Saturday, 9 May 2015

విరించి  ll ఇలా చెయ్యి. II
....................................
నిజాన్ని అలా నిప్పులమీద
ఎంత సేపని కాలుస్తావు?
బాంబు పెట్టి పేల్చు
అబద్దాలు వినే కర్ణభేరీలైనా పగులుతాయి

ఈ బుసలాంటి శబ్దాల్ని ఎంత సేపని
అలా అరుపుల్లాగా గాలిలో ఎగరేస్తావు?
ఒక కాగితం మీదికి ఊదిచూడు
పిడికిలెత్తిన గుండెల్నైనా అదిలిస్తుంది

ఈ మర్మావయవపు పుండు మీదే కదా
మార్మికతనంతా ప్రవచిస్తావు
నగ్న సమాజాన్ని అనుభవించి చూడు
నిర్వికార వ్రణమొకటి ఉదయిస్తుంది

అక్షరాల్ని అన్నం మెతుకుల్లాగా
ఎంతకని పొట్లంలో దాచుకుంటావు?
పొట్లం విప్పిచూడు
అక్షరాలా అవి దాడి చేస్తాయి.

అగ్ని స్నానం చేసే పదాల పంక్తిని
ఎంతకని ఉఫ్ఫున ఊదుతుంటావు
గుండెలకి హత్తుకుని చూడు
కొత్త జన్మలోకి పుట్టుకొస్తావు.

9/5/15



No comments:

Post a Comment