Friday, 22 May 2015

విరించి ll మూగ జంతువు  ll
..................................
మన మధ్య మాటలెందుకో..
మనల్ని కలపాలని ఎపుడూ అనుకోవు.

మాటల్లో మంటల్ని,
కరచాలనాల్లో కరవాలాల్ని
చిరునవ్వుల్లో విద్వేషాల్ని
బహిరంగ రహస్యాల్లా దాచేస్తాము.

మాట్లాడే ప్రతీ మాట వెనుక
ఒక విష పూరిత భావాన్ని
తూటా వెనుక రాయబడే
ఆవు కొవ్వులా
పంది కొవ్వులా
పుాసి వుంచుకుంటాము.

పక్క పక్కనే నిలబడి వున్నపుడు
ఒకరికొకరం మాట్లాడుకున్నపుడు
మన మధ్య దూరాల్ని బేరీజు వేసుకుంటాం.
ఇంకెంత దూరం జరగ గలమోనని
గతాల్ని మన మధ్యలో తవ్వుకుంటాం.

మన మధ్య విద్వేషాలు రాజ్యమేలుతున్నపుడు
మన నవ్వుల వెనుక ఎన్ని అర్థాలు దాగుంటాయో..
మన మౌనాల్లో ఎన్ని యుద్ధాలు రూపుకడతాయో..

కళ్ళ గంతలతో తూకం వేసేవాడు
బరువు తూగిన వైపే బలమెక్కువనుకున్నట్టు
గాడిదల్ని మనం గుర్రాలనుకుంటాం
తొండాల్ని ఏనుగులనుకుంటాం.
బలహీనంగా పైకిలేచిన తక్కెడ పళ్ళెం లో
మన స్నేహాల్ని ఉప్పు పాతరేస్తాం.

ముద్దాయి బోనులో నిలబడి
తీర్పునిచ్చే ఆత్రుతలో
భగవంతుడనే జడ్జ్ ముందు
మనం సమానమనే విషయాన్ని
కావాలనే మరచి పోతుంటాము.

ఒక పుస్తకంలోని కొన్ని అక్షరాలకు మాత్రమే
తలలు బాదుకునే మనం..
జీవిత పుస్తకాన్నెందుకో అసలు తెరువనే తెరువం.

పవిత్రంగా మనం రాసుకున్న అక్షరాలేవీ
మనల్ని కలపలేకున్నా..
విద్వేషంతో మనం రాసుకునే కవితలు
అద్భుతాలు చేసేస్తాయని నమ్ముతుంటాం.

అందుకే నేస్తం..
మనుషులతో ఓడిపోయే నేను
ఈ మూగ జంతువుతోనే స్నేహం చేస్తున్నాను.
ఇన్ని  వేల అక్షరాలు నాకీయబడినపుడు
ఏ తీర్పు ఇవ్వని ప్రేమాక్షరాన్నే నేనిక్కడ కనుగొన్నాను
నన్ను తప్పనో రైటనో అనని ఈ మహనీయుడు
నన్ను మానవుడిగా గుర్తించినట్టు ఆనందంగా భ్రమిస్తాను.

 22/5/15

No comments:

Post a Comment