Saturday, 9 May 2015

విరించి ll మేలి మలుపు ll
.....................................
మన మానవాత్మని మేల్కొల్పే
కొత్త చూపొకటి అక్కడ ఇరుక్కుని వుంది.
పలుగూ పారల్లాగా
మనమిద్దరమే ఇక పనిచేయాలి

రాగ ద్వేషాల్నీ, నిమ్నోన్నతాల్నీ వదిలి
హృదయాన్నొక్కటినే చేత పట్టుకుని
మనమక్కడికి చేరుకోవాలి.

చరిత్ర శిల్పం పగుళ్ళ లోంచి
వేదన లా బంక కారిపోతున్నపుడు
భవిష్యత్తు శిల్పం
ఒక స్పందనలా మనలో
గూడు కడుతున్నపుడు
దేవుడు పంపిన వర్తమానాన్నే
మన చేతుల్లో చదువుకోవాలి.

నినదించే పెదవుల మీద పాటలు పొంగినపుడు
కష్టించే చేతుల మీద చెమటలు మొలిచినపుడు
మన ఆచరణకి పుట్టిన బిడ్డలుగానే వాటిని గుర్తించాలి.

ఈ శరీరపు గోడలూ
తలుపులూ కిటికీల కింద
నలిగే పునాదుల్లో...
రెండు గట్టి ఇటుకల్లాగే
నీవూ నేనూ కలిసుండాలి

మన మానవాత్మల్ని
మంచి ముత్యాలుగా
కనుగొనబోయే మనం
మొదట రెండు
నత్త గుల్లలమే కావాలి

ఈ సమాజ శరీరంలో
మన ఆత్మోదయం
ఒక మేలి మలుపు కావాలి

9/5/15

No comments:

Post a Comment