Thursday, 11 May 2017

ఆగని యుద్థం
-----------------------

అపుడా అమ్మాయి బతికి వుండి, తిరగబడగలిగి ఉండింటే అప్పటికప్పుడు ఏమి చేయగలిగేదో దానినే, తమ తలలు బద్దలు కొట్టుకునేలా వాద ప్రతివాదాలు చేసుకుని చివరికి న్యాయాధీశులు చేస్తున్నారు. బలాత్కారం ఆపై దారుణమైన హత్య...రెండు దారుణమైన విషయాలే. నిర్భయకు ముందు ఆ తరువాత కూడా ఎన్నో ఇటువంటి సంఘటనలు జరిగాయి. జరుగుతున్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా ఉండిండొచ్చు. కానీ వాటి తీర్పు రావచ్చు రాకపోవచ్చు. న్యాయం జరగాలంటే ఖర్చవుతుంది, అందరూ ఖర్చులు భరించగలిగిన వారై ఉండగలరని అనుకోలేం. సమయమూ తీసుకుంటుంది. అందరూ సమయంకోసం వేచి చూడగల సహనం కలిగి ఉంటారనీ అనుకోలేం. అందరి విషయంలోనూ దేశ పౌరులు అదే విధంగా బాధిత కుటుంబాలకు క్యాండిల్ ర్యాలీలవంటి వాటితో నైతిక మద్దతు తెలుపుతారనీ ఆశించలేం. అందరి విషయంలోనూ మీడియా అదే విధమైనటువంటి కవరేజీ ఇచ్చి ప్రజలను చైతన్య పరుస్తుందనీ అనుకోలేం. బాధిత కుటుంబాలు ఎన్నో...కానీ ఎందుకో కొందరికే న్యాయం అనబడేది అందటం. కొందరు బాధితులకే తక్కువ సమయంలోనే తీర్పులు వెలువడటం. ఇలా ఎందుకు? అనే డౌట్ వచ్చినా దేశద్రోహమే అనే నేపథ్యం ఉన్నపుడు, అసలు ఉరి అనే ఆటవిక సాంప్రదాయమే మనకొద్దు అంటే, నిజంగా అర్థం చేసుకోగలిగినవారు ఎందరు?.

తప్పుకు శిక్ష పడాల్సిందే అనే భావన మనుషుల ప్రాథమిక అవగాహన. జెనిసిస్ లోని తొమ్మిదవ అధ్యాయంలో శిక్షను వేస్తాననే దేవుడూ, గీతలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాననే దేవుడూ కూడా మనిషి సృష్టే. మనుషుల చేసిన దేవుల్లు కదా. దుష్టులను శిక్షించే పాటే అయితే, అసలీ పనికిమాలిన దేవుడు దుష్టులను సృష్టించుట యేల? దుష్టులను సృష్టించుటా, ఆపై చంపుటా తానే చేస్తున్నాడంటే బహుశా దేవుడు పనిలేనోడే అయుంటాడు. అటువంటి దేవుడిని సృష్టించిన మనిషీ పనిలేనోడే అయుంటాడు. అందుకేనేమో మత భావనలను రూపుమాపుకోలేని వారిమిగా మనం మన న్యాయ శాస్త్రాలనూ రాసుకున్నాం. నిర్భయ కేసులో నిందితులకు మరణ శిక్ష వేయడం సరైనది కాదని వాదించిన ఒక డిఫెన్సు లాయరు," ఔనూ అంత రాత్రి సమయంలో ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఇంకో అబ్బాయితో ఎలా పంపుతారండీ...?" అని అడుగుతాడు. "స్వీట్లను బజారులో ఉంచితే కుక్కలు తినకుండా ఎందుకుంటాయ"ని ఉదాహరణనూ చెబుతాడు. అందుకే రేప్ జరిగింది తప్ప నిందితులు ఉత్తమోత్తములు అంటాడు. ఇందులో మతాలు కలిగించే భావనలున్నాయి. బహుశా డిఫెన్సు లాయరు ఉద్దేశమూ కూడా నిందుతులకు శిక్ష పడటమే కావచ్చు. అందుకే పసలేని వాదనలను నిందితుల తరపున చేసి ఉండవచ్చు. అతడి వాదనలకు మత భావనల కలరింగు ఇవ్వడం కూడా ప్రజలతో దూరం కాకుండా చేసే ప్రయత్నమే. తీవ్రతరమైన ఇటువంటి కేసులలో తీర్పు ముందే ఊహించబడుతుంది కాబట్టి, డిఫెన్సు లాయరైనా ప్రజల భావనలతో తమ భావనలూ ఏకమని చెప్పుకోక తప్పదు. అందుకేనేమో వుడ్రో విల్సన్ కూడా  "సమాజ ఆలోచనలూ అలవాట్లూ ఘనీభవించిగా ఏర్పడిన స్వరూపమే న్యాయం" అని నిర్వచించాడు.

ఇపుడు దుష్ట శిక్షణ అవసరమే అనుకుంటే, అసలు దుష్టులను తయారు చేయడమెందుకు వారిని శిక్షించడమెందుకు అనేది మౌలికమైన ప్రశ్న. దుష్టులను తయారు చేసేది కూడా సమాజమే. డిఫెరెన్సెస్ ని ఒప్పుకోని సమాజాన్ని తయారు చేసుకోవడమే దీనికి కారణం. డిఫెరెన్సు కేవలం భౌతికంగానే కాక, మానసికంగా కూడా. ఒక వ్యక్తికంటే ఇంకో వ్యక్తి వేరుగా ఉంటే, వేరే జండర్ ఉంటే, వేరే కులం ఉంటే, వేరే మతం ఉంటే, వేరే ప్రాంతం ఉంటే, వేరే వస్త్రధారణ కలిగి ఉంటే....చివరికి ఒక విషయం పై వేరే అభిప్రాయం కలిగి ఉంటే కూడా...ఏ మాత్రం భరించలేని వారిమై పోవడం ఇందుకు కారణం. ఒకడు ఇంకో వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆమె కాదంటుంది. అతడి అభిప్రాయంతో విబేధిస్తుంది. యాసిడ్ దాడి చేస్తాడు వాడు. ఒక నమ్మకానికో లేదా ఇంకో వాస్తవానికో ఒకరు ఒక అభిప్రాయం కలిగి ఉంటే, అందరూ అదే అభిప్రాయాన్నే కలిగి ఉండాల్సిందే అనేటువంటి భావనలు, మత భావనలతో సరితూగగల భావనలు, పెచ్చుమీరడమే దీనికి కారణం. నిర్భయ కేసులో మరలా ఉరి శిక్ష అంశం బయటికొచ్చింది. ఎప్పటిలాగానే మానవ హక్కుల వారు ఇది కూడదు అంటారు. జీవిత కాల శిక్ష సరిపోతుంది కదా మరణ శిక్ష ఎందుకు అంటారు. ఇక వారిపై యుద్ధ ప్రకటనమే జరుగుతుంది. వారి అభిప్రాయాన్ని చెప్పుకోనీయని ఇటువంటి సమాజంలోనే రేపులూ, మర్డర్లూ జరుగుతుంటాయని మనం, ముఖ్యంగా ఇటువంటివారిని 'మేధావులు' అంటూ ఎద్దేవా చేసేవారు, గమనించాలి. అభిప్రాయాలకు విలువనివ్వగలిగిన సమాజంలో రేపులు జరుగవలసిన అవసరం ఏముంటుంది. ఇద్దరి ఒప్పుకోలు మీద ఆధారపడి మాత్రమే ఇద్దరు మనుషుల మధ్య లైంగిక సంఘటన జరగడం అనేది నిజంగా అద్భుతమైన విషయమే కదా. స్త్రీల మీద ఆధిపత్యం చెలాయించాలనుకోవడం, వారిముందు తమ బలాన్ని ప్రదర్శించాలనుకోవడమూ కూడా స్త్రీలకంటే పురుషులు అధికులు అనే భావననుండి వచ్చినవే. "మేము అధికులం" అనుకోవడంలోనే "మీ అభిప్రాయాన్ని ఒప్పుకోం" అనడమూ ఉంది. ఆధిపత్య భావనలు తొలగి, సమభావనలు పెరిగి, అందరి అభిప్రాయాలనూ గౌరవించుకోగలిగిన సమాజంలో, వాటికి విలువనివ్వగలిగిన సమాజంలో దుష్టుల పుట్టుక నిజంగా ఉంటుందా?.

సమాజంలో దుష్టత్వం ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంటుగా తీసుకోవాలి. ప్రభుత్వం ఉంటేనే దుష్టత్వం ఉంటుంది సరి ఐనది. ప్రభుత్వం ఉండగానే, పాలకులు పాలితులు అనే ఆధిపత్య నిమ్న వర్గాలు ఏర్పడిపోతాయి. వర్గాల మధ్య అంతరాలు ఏర్పడతాయి. ప్రభుత్వం ఉనికిలో ఉండాలంటే సమాజంలో దుష్టత్వం ఉండాలి. దుష్టత్వం లేకుంటే ప్రభుత్వాలకు పెద్దగా పనేం ఉండదు. పౌరులు రెండు రకాలుగా విడిపోతారు. రాజ్య శాసనాలను గౌరవించే పౌరులు, గౌరవించని పౌరులు. వారికి తగిన పనిని కలిగించని ప్రభుత్వాలపై గౌరవం తగ్గించుకున్న పౌరులు వీరంతా. గౌరవించని పౌరులను దుష్టులుగా ప్రభుత్వాలు భావించాలి. దుష్టత్వంలో తీవ్రతలను బట్టి శిక్షలు విధించబడతాయి. ఇపుడు ప్రభుత్వం వీరికందరికీ పని కలిపించటం కష్టం. కొందరు కడుపు నింపుకోవటం కోసం వేరే పనుల్లోకి వెల్లిపోతారు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అఫ్ఘనిస్తాన్ వంటి ఎడారి ప్రాంతంలో పౌరులకు పని కలిగించటం ప్రభుత్వాలకు కష్టం. డెబ్భై శాతం యువత పని లేని వారిగా ఒక సమాజంలో ఎందుకుండాలి. అక్కడి మత సంస్థలకు అందుకే బలం ఉంటుంది. మతానికి సంబంధించిన విద్య నేర్చుకోవడమూ, మత తీవ్రవాదాన్ని కౌగిలించుకోవడమూ అక్కడి యువతకు ఉపాధి వంటిది. మత సంస్థలు తమకు సంపన్న దేశాల నుండి అందే నిధుల ద్వారా యువతను మత విద్య వైపు తిప్పడమూ, వారికి ఆ విధంగా ఉపాధి కలిగించటమూ జరుగుతుంది. మత విద్య నేర్చుకుని ఉపాధి పొందుతున్న యువత వలన రాజ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఎపుడైన తీవ్రవాద మూకలుగా చెలరేగితే తప్ప. అందుకే రాజ్యం వాటిని చూసీ చూడనట్టు ఉంటుంది. అంటే పరోక్షంగా ప్రోత్సహిస్తూంది. ఇపుడు మత సంస్థలనే మూసివేస్తే లక్షల సంఖ్యలో యువతకు ప్రభుత్వం పని కల్పించాల్సి ఉంటుంది. మత శిక్షణ పొందని నిరుపేద యువత డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి పనుల ద్వారా ఉపాధి పొందుతారు. వీరి వలనా ప్రభుత్వాలకు పెద్ద నష్టం ఉండదనే చెప్పాలి.

ఒక దేశంలో నియుద్యోగ యువత మత తీవ్రవాదం వైపు పోయే కంటే హత్యలూ, మానభంగాలూ, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ వంటి అరాచకత్వం వాటి వైపు పోవడాన్ని అమెరికా, ఇండియా వంటి ఆధునిక సెక్యులర్ దేశాలు పరోక్షంగానైనా ప్రోత్సహిస్తాయి. వీటికి సంబంధించిన సంఘటనలు జరిగినపుడు కంటి తుడుపు చర్యలతో వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తాయి. మత తీవ్రవాదం కంటే ఇవి తక్కువ తీవ్రత కలిగినవిగా గుర్తిస్తాయి. రైడ్ లు చేయడమూ, కేసులు పెట్టడమూ, తీర్పులు వెలువరించడమూ, జైలుకు పంపడమూ, ఇత్యాది ద్వారా న్యాయ పోలీసు శాఖలకు పని కల్పించడమూ. దేరీస్ నో అండర్ వరల్డ్ విథౌట్ యాన్ ఓవర్ వరల్డ్ అని ఓ పెద్దాయన మాట. నిజానికి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టడం ప్రభుత్వానికి చేతనవును. కానీ చేయదు. ఆల్కాహాల్ ను పూర్తిగా బ్యాన్ చేయలేదు. ఆల్కాహాల్ వలన మానభంగాలు పెరుగుతుంటాయని తెలిసినా, వాటిని పూర్తిగా నిర్మూలించలేదు. టీవీ సీరియల్స్ లో తాగే సీన్స్లలో కాషన్ నోటీస్ వేయకపోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి ఊరుకుంటుంది. అండర్ వరల్డ్ కీ ఓవర్ వరల్డ్ కీ సంబంధాలు చాలా డైరెక్టుగానే ఉంటాయి. డీమోనెటైజేషన్ జరగగానే, ఇండ్ల స్థలాల రిజిసట్రేషన్స్ తగ్గి పోవడం జరుగుతుంది. అయినా ప్రభుత్వం చెడునంతా కడగటం కోసమే అని నమ్మ బలుకుతుంది. చెడును అపుడపుడూ అదిలిస్తూండటం ద్వారా ప్రభుత్వాలు తాము పని చేస్తున్నాయని నిరూపించుకుంటూంటాయి, మనుషులు చేసిన దేవుడు, తానే దుష్టులను పుట్టించి తానే సంహరించి ఆ విధంగా తన ఉనికిని చాటుకుంటున్నట్టు. అవినీతి పై యుద్ధం, అరాచకత్వం పై యుద్ధం వంటివి యుద్ధాన్ని నిరంతరం కొనసాగించటానికే తప్ప యుద్ధాన్ని అంతం చేయడానికి కాదు. యుద్ధం విషయంలో అబ్రహం లింకన్ మాటలను ఈ సందర్భంగా చెప్పుకోవాలి.There is  no honorable way to kill , no gentle  way to destroy, there is nothing good in war except its ending. అది ఏ యుద్ధమైనా అంతే.

8/5/17
Virinchi Virivinti
సినిమా( బాహుబలి )కళ, కళాత్మకత
 ----------------------------------------

ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తున్నపుడు, రియాలిటీని సబ్వర్ట్ చేయడం ఆర్ట్ కి ఉన్న బలమూ అదేవిధంగా బలహీనత కూడా అనిపిస్తూంటుంది. అందుకేనేమో ప్లేటో తన 'రిపబ్లిక్' లో కవులకూ కళాకారులకూ స్థానమే లేదుపొమ్మన్నాడు. ఒక సినిమాలోని ప్రతీ దృశ్యమూ డైరెక్టర్ యొక్క ఊహా శక్తి ఫలితమని , సినిమా ప్రత్యక్షంగా దర్శకుడి ప్రతిభ మాత్రమే అని, సినిమాలోని మిగిలిన కళాకారులు కేవలం పరోక్ష సహాయకారులేననీ చెప్పేది 'థియరీ ఆఫ్ ఆటరిజం(Theory of Auterism)'. 1967లో రోలాండ్ బార్థెస్(Roland Barthes) రాసిన వ్యాసం డెత్ ఆఫ్ ఆథర్( death of Author) అందరికీ అర్థమవడం జరిగిన తరువాత, ఈ ఆటరిజం చాలా చర్చనీయాంశమయింది. పోస్ట్ మోడెర్న్(post modern) థాట్ ని ప్రోత్సహించిన ఈ వ్యాసం, సినిమా ను కళ లనూ కూడా ప్రభావితం చేసింది. ఆటరిజం చెప్పినట్టు సినిమాను కేవలం దర్శకుడి మేథావిత్వపు ప్రొడక్ట్ గా మాత్రమే కాక, దానిని ఆ కాలపు పరిస్థితులకూ, సామాజిక సందర్భానికీ అనుగుణంగా వచ్చిన ప్రొడక్ట్ గా చూడాలనే అంశం తెరమీదకి వచ్చింది. పలానా సినిమాను దర్శకుడు ఆ విధంగా తీయడానికి ఆ కాలపు పరిస్థితులేమిటన్నది చర్చగా మారింది.

ప్రస్థుతం మన సమాజం హేతుబద్ధత వైపు కాకుండా, మనం ఎలా 'ఫీల్ (Feel)' అవుతామనే అంశం మీదే ఆధారపడి నిర్మితమై ఉంది. ఒక విషయం పట్ల నేను ఎలా ఫీలవుతాను, ఇంకొకరు ఎలా ఫీలవుతారు, మెజారిటీ సమాజ సభ్యులు ఎలా ఫీలవుతారు అనే అంశం ఆధారంగా నిర్మించబడుతోంది. మనం ఒక విషయం పట్ల 'ఎలా ఆలోచిస్తాం' అనేదానికంటే, 'ఎలా ఫీలవుతాం' అనేది ముఖ్యమయింది. ఆలోచనను అనుభూతి సబ్జుగేట్(subjugate) చేసేసింది. ఇపుడు మనకు ఆలోచనకంటే అనుభూతి, ఫీల్ ముఖ్యమైపోయింది. ఆలోచన హేతుబద్ధత వైపు పయనిస్తే అనుభూతి నమ్మకాల వైపు పయనింపజేస్తుంది. అనుభూతి పరమైన సమాజాన్ని కండీషనింగ్(conditioning) చేయడం చాలా సులభం. అందుకే మనకెన్నో అడ్వర్టైజ్మెంట్లు. కాపిటలిస్ట్ సొసైటీ, కాపిటలిస్ట్ వ్యాపారం, కాపిటలిస్ట్ రాజకీయాలూ' అనుభూతి'ని అందలం ఎక్కిస్తాయి. మనుషులందరూ అనుభూతి చెందుతారు. ఆ అనుభూతి, ఫీల్ నే అసలు సత్యమనుకోవడమూ ఉంటుంది. ఒక గాడిదను కట్టేసి గుర్రమని అనుభూతి చెందిన సమాజం, దానిని గుర్రమనే నమ్ముతుంది. వ్యాపారం చేసి గాడిదను అమ్మాలనుకునే వాడికి మనం ఆలోచనతో అది గాడిదలా గుర్తించడం కంటే అనుభూతితో గుర్రమని భావించేలా చేయగలగడమే కదా కావాలి. గాడిదను గుర్రమని నమ్మించడానికి దానిని అలా అనుభూతి చెందగల సమాజం కావాలి. అందం అంటేనే సత్యమనీ, సత్యమంటేనే అందమనీ, రిలీజియస్ గా నమ్మిన గ్రీకులూ ఒకప్పుడుండేవారు.( కీట్సు కవీ 'ఓడ్ ఆన్ ఏ గ్రీషియన్ అర్న్( Ode on a Grecian Urn) ' లో ఇదే పాడాడు. 'అందమే ఆనందమ'నీ మన తెలుగు కవులూ పాడారు). మరలా మనం ఇపుడు సరిగ్గా అటువంటి సమాజంలో ఉన్నాం. ఇటువంటి సమాజంలో మనుషులనూ కుక్కలనూ దాదాపు ఒకే విధంగా ట్రైన్ చేయవచ్చు. 'కుక్క వంటి విశ్వాసం' అనేది అనుభూతి వలన వచ్చేదే తప్ప ఆలోచనతో వచ్చేదేమీ కాదు కాబట్టి.

ఒక సినిమా చూసిన తరువాత 'ఏమని ఆలోచించావు' అని ఎవరూ అడగరు. 'ఎలా ఫీలయ్యావు' అనేదే అడుగుతారు. ఇపుడు ఆ ఫీలింగుకే పట్టంగట్టడం దర్శక మేధావులు చేయగలిగిన వ్యాపారం. శంకరా భరణం సినిమాలోలాగా "శుద్ధ హిందోళంలోకి ఆ రిషభం ఎలా వచ్చింది?" అని శంకర శాస్త్రి అడిగినట్టు, "పోస్ట్ మోడెర్న్ థాట్ ప్రాసెస్ లోకి కాల్పనికత ఎలా వచ్చి చేరింద"ని మనం ప్రశ్నించుకుంటే, బాహుబలి సినిమా సక్సెస్ కావడంలో మనం అందలమెక్కించుకున్న 'ఫీలింగ్' పాత్ర అర్థమౌతుంది. గంటకొట్టగానే జఠర రసం కార్చిన పావ్లోవ్ కండీషన్డ్ కుక్కకీ, సినిమా తీయగానే మనం కార్చే అనుభూతి రసానికీ దగ్గరి సంబంధం ఉంది. ఇది అర్థం చేసుకుంటే వీరాభిమానం పేరుతో కళను కళగా చూడాలనే ఊహతో, సినిమాను సినిమాలాగా చూడాలనే మిషతో చేసే సకల వాదాలూ అర్థమౌతాయి. సినిమా కళే అసలైన కళ అనుకునే వారికీ, సాంఘిక ప్రయోజనం లేనిదే కళ కాదనే వారికీ కాంట్  (Kant) చెప్పిన  'నిజమైన కళ' నిర్వచనం గానీ, దాని సకలాతీత(transcendental) స్థితిగానీ,  దాని ప్రయోజన రహిత ప్రయోజనాత్మకత(purposiveless purposiveness)  గానీ, అర్థం కావు. అంతేకాకుండా నిజ జీవిత ఒత్తిడితో నలిగిపోయిన కాపిటలిస్ట్ సొసైటీలో ఆలోచనకు బదులుగా 'ఫీలింగు' నిర్వహించే తాత్కాలిక ఉపశమన పాత్ర విస్మరించదగినదసలే కాదు కూడా. అందుకే దర్శక నిర్మాతల దృష్టి రియాలిటీని తమ కళాసృష్టి లో సబ్వర్ట్ (subvert) చేయడంలో కనిపిస్తుంది. పైన చెప్పినట్టు ఇది వ్యాపారాత్మకంగా వారి బలమూ, సామాజికపరంగా మన బలహీనతా కూడా.

ఓవర్ వెల్మింగ్ టెక్నాలజీ( Overwhelming Technology) మనలను వర్చువల్ రియాలిటీకి(Virtual reality) పరిచయం చేయడమే కాకుండా భౌతిక శాస్త్రాన్ని(physics) బలహీన పరిచింది కూడా. సిములేటెడ్ ప్రపంచంలో మనం భౌతికతను మరిచి పోయి, కేవలం టెక్నాలజీ అందించిన వర్చువల్ మెటీరియలిజాన్ని నమ్ముతున్నాం. ఒక కుర్చీని తయారు చేసే భౌతిక విద్యను ఒక కళగా అభ్యసించిన విద్యార్థి ఉన్నాడనుకుందాం.  'కూర్చోవడం' కుర్చీ సాంఘిక ప్రయోజనమనుకుంటే కుర్చీని కేవలం కూర్చోవడానికి అనువుగా చెక్కితే సరిపోతుంది కానీ కళాకారుడు దానికి నగిషీలు చెక్కి రంగులు వేసి అందంగా మలిచాడనుకుందాం. ఇలా చేయడం వలన కుర్చీ సాంఘిక ప్రయోజనం అయిన 'కూర్చోవడం' ఏమీ మారదు. కూర్చోవడం కాస్తా పడుకోవడంగా ఠకీమని ఐపోదు. అంటే కళకూ కళాత్మకతకూ సాంఘిక ప్రయోజనానికి మించిన ప్రయోజనం ఉంది. కానీ ఇపుడు కుర్చీని ఒకడు కంప్యూటర్లో గ్రాఫిక్స్ సహాయంతో సృష్టించాడనుకుందాం. దీనిని  'కళ' అనుకుంటే దాని సాంఘిక ప్రయోజనమైన కూర్చోవటం అన్నది ఇపుడేం కావాలి?. ఒకవేళ దీనిని 'కళ కాదు' అనుకుంటే మరి అసలు కళ అనేదెక్కడుందనే ప్రశ్న వస్తుంది. "దో ఆంఖే బారాహ్ హాత్" సినిమాలో బొమ్మ ఎద్దుతో చేసిన బుల్ ఫైటు చాలా ఎబ్బెట్టుగా వచ్చిందని, నిజమైన ఎద్దుతో తల పడతానని , రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు కథానాయకుడూ ఐన వి. శాంతారాం. కళ లోని స్వచ్ఛతను ప్రిసర్వ్ చేయడం కోసం అతడు నిజమైన ఆ బుల్ ఫైట్ లో కంటి చూపునూ కోల్పోవలసి వచ్చింది. ఇపుడు మనం డిజిటల్ గ్రాఫిక్స్ లో చూపించినదే కళాత్మకత అంటూన్నామంటే పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించినట్టుగా భౌతిక శాస్త్రాన్ని టెక్నాలజీ ధిక్కరించినట్టుగా ఔతుంది. బ్లూమ్యాట్ లో, గ్రాఫిక్స్ అండతో, 'లేని దానిని' సిములేట్ చేసే డిసెప్టివ్ వర్చువల్ ప్రపంచంలో కళ దాని స్వంత పర్పస్ తో బతుకుతోందా?. సినిమా సినిమాలాగా బతుకుతోందా వ్యాపారంలాగా బతుకుతోందా అనేది తరచి చూచినపుడు దర్శకుడి కళా ప్రతిభ అతడి వర్చువల్ గ్రాఫికల్ డిపెండెన్సీ (Virtual graphical dependency) వలన తేలిపోతుందనేది గ్రహించాలి. గ్రాఫిక్స్ కోసం కథ రాసుకునే పరిస్థితుల వలన "థియరీ ఆఫ్ ఆటరిజం" ఇప్పటి వర్చువల్ డిపెండెన్సీ యుగంలో మరలా చర్చనీయాంశం కాబోతోంది.

10/5/17
విరించి విరివింటి

Friday, 5 May 2017

విరించి ll   పిల్లల పాట  ll
____________________________

టీచరులారా ప్రపంచం ముసలిగయ్యింది
కొంత బాల్యం కావాలిపుడు
చదువులూ ఉద్యోగాలూ ఉద్యమాలూ వదిలి
కేరింతలు కొట్టే ఆటలు కావాలిపుడు

ఒప్పుకుదాం టీచరు మహాశయా..!
నీవొక డాక్టరునో ఇంజనీరునో ఇంకొకరినో తయారు చేయగలవని.
ఒక పరిపూర్ణ బాల్యాన్ని తయారు చేయగలవా చెప్పు?

ఎండాకాలం సెలవుల్లో కూడా హోం వర్క్ రాసిచ్చే మీకు
భవిష్యత్తంటే ఒక రిసెషన్ కావచ్చు, యుద్ధమూ కావచ్చు, మరణమూ కావచ్చు
పొద్దున నిద్రలేవాలంటే కునుకుపాట్లు పడే బుజ్జిగాడికి
మరో రోజంటే ఎంత విసుగో ఎపుడైనా చూశారా?.

ఎండాకాలం మీకు చెమటా, చిరాకూ, అలసటా కావచ్చు.
కానీ ఎండాకాలపు సూరీడు పిల్లల చేతిలోని టార్చిలైటు
కావాలంటే చూడండి
మిట్ట మధ్యాహ్నం ఆటలో వాళ్ళు ప్రపంచాల్ని వెతుకుతున్నారు

దూరపు నక్షత్రాలను చూసినపుడు
మీ మనసులెంతగా తెరుస్తారో అంత చిన్న పిల్లలౌతారు
దగ్గరి నక్షత్రాలైన పిల్లలను ఎంత చిన్న పిల్లల్లా చూస్తారో
అంతగా మనసు పూవులై విచ్చుకుంటారు

అందుకే ఇపుడు పిల్లలతో కలిసి
పిల్లల్లాగే గట్టిగా అరుస్తూ ఈ మాటల్ని పాడుకుందాం.
నల్లబల్లలూ, చాక్ పీసులూ, స్కేలు బెత్తాలూ, హోంవర్క్ లూ
ఈ ఎండకు కాలి బూడిదైపోనీ..
ఆటలాడే పిల్లల కాళ్ళ కింద పడి నలిగిపోనీ..

5/5/17

Monday, 1 May 2017

సాములోరి ఆధ్యాత్మిక ఉచిత సలహాల మీద....

"ఆకలి, అజ్ఞానంతో అలమటిస్తున్న కోట్లాది ప్రజలు ఒకవైపుండగా, వారి శ్రమను ఆధారం చేసుకుని విద్యావంతులైన ప్రతీవాడూ నేరగాడే, ఇటువంటి ఉన్నత వర్గ విద్యావంతులందరూ పది వేల సంవత్సరాలనాటి మమ్మీలే"..అన్నాడు వివేకానందుడు. అటువంటి మమ్మీ ఇపుడు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరుతో కలియతిరుగుతూ,  రైతుల ఆత్మ హత్యలకు ఆధ్యాత్మిక లోపం కూడా ఒక కారణం అంటోందిపుడు. ప్రసంగాలు చేస్తూ కడుపులు నింపుకుంటున్న ఈ బుద్ధావతారాలకు తిన్నది సరిపోలేదేమో ఇపుడు రైతుల మీద పడి దోచుకునే పనిలో పడ్డారు. "ఆకలితో ఉన్న వాడికి గీతా బోధనలు కూడదన్నాడు" వివేకానందుడు. శ్రీ రవి శంకర్ ఇపుడు ఏకంగా యోగా ధ్యానాదులు నేర్పిస్తానంటాడు. సమస్యల పట్ల అవగాహనా లేమితనంతో ఈ స్వాములంగారు వాక్రుచ్చే సూచనలు వారి సామాజిక స్పృహలోని లోతులేనితనాన్ని తెలపటమే కాకుండా, వారిని నవ్వులపాలు కూడా చేస్తూ ఉంటుంది.  అసలు భారతదేశంలో యోగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి పేదరికమే కారణం అనేది పాశ్చాత్యుల అవగాహన. తినడానికి తిండిలేని అర్భకులు యోగా పేరుతో కఠిన నియమాలు పాటిస్తూ, రోజుకు ఒక పూటనే తింటూ, పస్తులను 'పవిత్ర ఉపవాసాలు'గా మలుచుకునేవారనీ, ఆ విధంగా ఆకలి బాధలను అధిగమించే వారు కాబట్టే ఎండమిక్ గా ఉన్న క్షుద్భాధ ఈ దేశంలో యోగా వ్యాప్తి చెందటానికి ఉపయోగ పడిందన్నది వారి అవగాహన. బహుశా అందుకేనేమో "ఒక పూట తినే వాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి" వంటి నానుడులు పుట్టి వుంటాయి. ఈ రోజుటికీ ప్రతీ రోజు రాత్రికి పస్తులు పడుకుంటున్న భారతీయుల సంఖ్య ఇరవై కోట్లు. వీరినందరినీ తన శిష్యులుగా మలుచుకుంటే..వీరందరికీ యోగా నేర్పిస్తే..అనే క్షుద్ర ఆలోచన వచ్చిన శ్రీ రవి శంకర్ నిజంగా ధన్య జీవనే చెప్పాలి. బతికుండగా మమ్మీ కావడం బహు అరుదైన విషయం కాబట్టి.

గమనిస్తే యోగా మెడిటేషన్ వంటి సంప్రదాయాలు ప్రాక్ పశ్చిమ దేశాలలోని ఆశ్రమాలనుండి వచ్చినట్టుగా ఉంటుంది. మనదేశంలో ఎన్నో ఆశ్రమాలుండేవి, అందులో వందల సంఖ్యల్లో జనులూ ఉండేవారు. (ముఖ్యంగా మన దేశంలో బౌద్ధం ప్రబలిన తరువాత బౌద్ధారామాలు, కాషాయ వస్త్ర ధారణలూ పెరిగిపోయాయి. ప్రతీ ఒక్కరూ సన్యాసం తీసుకోవడం ఆ రోజుల్లో ఒక కల్ట్ ఫ్యాషన్ గా మారేసరికి వేలలో ఆశ్రమాలూ మొదలయాయి. నేటికీ పాశ్చాత్యులు యోగా ధ్యానాదులు టిబెటియన్ బౌద్ధానికి సంబంధించినవే అనుకుంటారు తప్ప భారత హిందువులకు సంబంధించినది అనుకోరు. ఇపుడు ఏలినవారు యోగా అనగానే టిబెట్ కాకుండా ఇండియా గుర్తుకు వచ్చేలా ప్రయత్నాలూ ముమ్మరం చేశారు.) ప్రతీ ఒక్కరికీ ఆకలి తప్పని పరిస్థితి అనుకుంటే ఇంత మందికి ఆహారం పెట్టగలగటం  ఆశ్రమ నిర్వాహకులకు పెద్ద పరీక్షే. ఆశ్రమ పెద్దయినటువంటి గురువుగారికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే. అరకొర సౌకర్యాలూ, ఈతిబాధలూ ఎలాగూ ఉండేవి. ఇంత మందిలో కొంత మంది ముఖ్యంగా పిల్లలు మాత్రమే తిని మిగితా వారంతా ఏదో ఒక వ్యాపకంలో పడి ఆకలిని మరచి పోవాలంటే ఏమి చేస్తే బాగుంటుందనేది ఆశ్రమ నిర్వాహకుల ప్రధాన సమస్య. ఇంకా పుస్తకాలూ, ఫేస్బుక్ లూ, ఈడియట్ బాక్సులూ లేని కాలంలో, ఇంత మందిని ఏదో ఒక ఆకలి కానివ్వని వ్యాపకంలో పెట్టడం తప్పనిసరైంది. పని చేయించుకుని తగిన ఆహారం ఇవ్వక పోతే ఆశ్రమ వాసులు గోల చేస్తారు. బయటి ఏ శారీరక పనైనా ఆకలిని పెంచక తప్పదు. అందుకే ఓ మూలకు ముక్కు మూసుకుని మాట్లాడకుండా, అన్నం పెట్టడం లేదేంటని గోల చేయకుండా ఉంచాలంటే ఏం చెయాలి అని ఆలోచించినపుడు ప్రాణాయామం, ధ్యానం వంటి కూర్చుని ఆపసోపాలు పడే టెక్నిక్ లు కనుగోబడ్డాయి. యోగి అనిపించుకోవాలంటే వీలయినంత తక్కువ తినాలి. బేసిక్ మెటబాలిక్ రేటు తగ్గాలంటే శ్వాసను వీలయినంత మెల్లగా పీల్చి వదులుతుండాలి. భగవంతుడి మీదనో శ్వాస మీదనో ధ్యాసను మరలించాలి. ఎంత ఎక్కువ సేపు ధ్యానాదులు చేస్తే అంతెక్కువ శక్తి వస్తుందనీ నమ్మించాలి. ఈ విధంగా ఆశ్రమ నిర్వాహకులు ఖర్చులు తగ్గించుకుని సమర్థవంతంగా ఆశ్రమాలు,నడపగలిగేసరికీ రోజు రోజుకీ ఆశ్రమ వాసులు పెరిగిపోయేవారు. వారి తాకిడిని తగ్గించడానికి ఆశ్రమాల్లో,యోగా మెడిటేషన్ చుట్టూ కఠినాతి కఠినమైన నియమాలూ ఏర్పడటం మొదలైంది. బ్రహ్మచర్యాది యమనియమాదులూ ఇత్యాదివి. లావు మనుషులు అతిగా తినకుండా ఉండాలంటే వారిని ఆశ్రమం లో నుండి బయటకి ఉరికించేలా చేయాలంటే అష్ట వంకరలుగా తిరిగి, తలకిందులైపోయే ఆసనాలు వేయించాలి. బీదరికంతో కునారిల్లే ఆశ్రమాలలో  పరిస్థితులు మరోలా ఉండెవి. ఆశ్రమ వాసులు ప్రాణాయామంతో హైపర్ వెంటిలేట్ చేయడం వలన, పూరక రేచక కుంభకాల్లో కుంభకానికి అతి ప్రాధాన్యం ఇవ్వడం వలనా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి ఒకరకమైన ఉన్మత్త స్థితికి జారిపోయేవారు. రక్తంలో ఒకటి నుండి ఎనిమిది శాతం వరకూ చేరిన కార్బన్ డై ఆక్సైడ్ వివిధ రకాల ఉన్మత్తాలకు గురిచేసేది. ఎనిమిది శాతం దాటిన వారిలో మెదడు పూర్తిగా స్పృహ కోల్పోయే పరిస్థితి ఉండేది. అదే అలౌకికానందం అనుకున్నారు. కొంత సమయం గడిచిన తరువాత కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చేశాక తిరిగి మామూలు స్థితికి చేరుకునే వారు. (బహుశా ఇటువంటి చెడు ప్రభావాలు గమనించేమో తరువాతి యోగా స్కూల్సు కుంభకాన్ని అవసరం లేదన్నాయి, రేచకానికి అధిక ప్రాధాన్యత కలిగించాయి. దీనివలన కూడా ప్రమాదం లేకపోలేదు, అతిగా కార్బన్ డై ఆక్సైడ్ వాషవుట్ అవడం శ్వాస ప్రక్రియనే అకస్మాత్తుగా ఆపేయనూ గలదు. కానీ సహజంగానే ఎవ్వరైనాగానీ, రేచక ప్రక్రియ ఎక్కవ సేపు కొనసాగించలేరు గనుక ఒక విధంగా అంత ప్రమాద భరితం కాదనే చెప్పాలి). ధ్యానంలో కూర్చుని ఊపిరి బిగబడితే మొదట వచ్చే నిద్రకు కారణం తక్కువ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ రక్తంలో చేరడం. ఈ కునుకుతీత అసలు నిద్రలోని ఆర్.ఈ.ఎమ్. స్టేజి నిద్రతో సరితూగుతుంది కాబట్టి ఒక రకమైన స్వప్నావస్థను కలిగిస్తుంది. ఆర్. ఈ. ఎమ్ నిద్రలోనే మనకు స్వప్నాలు వస్తాయి. వీటిని సాధకులు మెడిటేషన్ వలన కలిగిన దివ్యానుభూతులని సంబరపడిపోవడం జరుగుతూ  ఉంటుంది. మెడిటేషన్ కి ముందే దైవ సంబంధ విషయాలపై ట్యూన్ అయి వుంటారు కాబట్టి అది ప్రీ హిప్నోటిక్ స్టేజ్ గా పని చేసి, ఈ స్వప్నావస్థలో దైవ సంబంధమైన విషయాలు కనిపించేస్తూ ఉంటాయి. ఇక సాధకులు మెడిటేషన్ లో తమకు దైవ దర్శనం కలిగిందనీ, దైవ సందేశం వినిపించిందనీ ఆనందపడిపోవటమూ చూస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ ఆ ఆశ్రమం లోని గురువర్యుల చలవగా ఆశీర్వాద ఫలంగా తపశ్శక్తిగా కీర్తించ బడుతూ  ఉంటుంది. అది ఆ ఆశ్రమంలో తక్కువ ఖర్చుతో జీవితం వెళ్ళబుచ్చటానికి అవసరమైన భూమికను కలగజేస్తుంటుంది. ఈ విధంగా ఆశ్రమ మేనేజ్మెంటు వారు ఖర్చులు తగ్గించుకోవడానికి కనిపెట్టిన కొత్త రూల్సుతో ఆశ్రమాలు చక్కగా నడిచేవని చెప్పాలి.

ఇపుడు శ్రీ రవి శంకర్ ఆధ్యాత్మిక గురువవుతాడా లేక యోగా గురువవుతాడా చెప్పడం కష్టమేమీకాదు. ఆయన ఆధ్యాత్మికనంతా యోగా ధ్యానాదులకే అపాదించేస్తాడు. ఆయనే కాదు ఆధ్యాత్మికత అంటే యోగా,యోగా అంటే ఆధ్యాత్మికత అనేది దాదాపు సో కాల్డ్ గురువర్యుల చింతన ప్రస్తుతానికి. అంతే కాకుండా ఒకప్పటిలా ఆశ్రమ వాసుల ఆకలికి ప్రత్యామనాయంగా కనుగొనబడిన యోగా, ఇపుడు ఆశ్రమ నిర్వాహకుల ధనాకలికి అనుగుణంగా వాడుకోబడుతుంది. యోగా ధ్యానాదులతో ప్రయోజనాలు లేవా అంటే ఉన్నాయి. శరీరాన్ని పలు విధాలుగా వంచగల, మౌనంగా కాసేపు ఆలోచించగల ఏ విషయమైనా యోగా ధ్యానంలవలె మనిషికి మంచే చేస్తుంది. అనవసర ఆలోచనలతో స్ట్రెస్ తో సతమతమయ్యే సగటు మానవునికి యమాది కఠిన నియమాలు కొంత వరకు ఉపశమనాన్ని కలిగించగలవు. లేటెస్ట్ గా యమాది నియమాలు కుదరవు కాబట్టి, పది ఆసనాలు, ఐదు రకాల ప్రాణాయామాలు, కొంత సేపు ధ్యానమూ వంటి ప్యాకేజీలూ ముందుకొచ్చేశాయి. అయితే జీవితంలోని అసలు సమస్యలు వదిలేసి ఈ యోగాది కార్యక్రమాలలోకి పలాయనం చెంది జీవించే వారూ లేకపోలేదు. ప్రతీ సమస్యకూ యోగాలో దివ్యమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పేవారూ పెరిగిపోయారు. ఎయిడ్స్ కాన్సరు వంటి భయానక జబ్బులకూ ఈ జబ్బును పాకించారు. అంతే కాకుండా రజినీష్, మహేశ్ యోగీ, దీపక్ మహతా, యోగానంద వంటి వారి పుణ్యమాని "న్యూ ఏజ్ రిలీజియస్ కల్చర్" పాశ్చాత్య దేశాల్లో వేళ్ళూనుకుంటుండటంతో, రవిశంకర్ వంటి యోగా గురువులకూ అక్కడ గిరాకీ పెరిగింది. ఏ యోగా గురువు దెగ్గర చూసినా ముందు వరసల్లో వందల సంఖ్యలో ఫారీనర్స్ దర్శనమిస్తూంటారు. "ఆయనంటే ఏమనుకున్నావు..ఎంత మంది ఫారినర్స్ ఆయన దగ్గరికి వస్తుంటారు తెలుసా, ఏం వాళ్ళంతా పిచ్చోళ్ళా..?" అని పరమ భక్తులు మనమెపుడయినా ఆయన్ని శంకిస్తే వాపోతూంటారు. ఫారినర్స్ ముందు వరసలో ఉన్నారంటే ఆ గురువు పరమ ఉత్కృష్టమైన గురువనే నికృష్ట భావనలూ అధికమయ్యాయి. ఈ మెడిటేషన్ కునుకులల్లో వచ్చే పిచ్చి కలలను గొప్ప దివ్యానుభూతులని నమ్మేస్తూ, అవి కనిపించటం వెనుక ఉన్న అంతరార్థమేమిటని పిచ్చి భక్తులు అడుగుతుండగా, ఆకుకు అతకక పోకకు పొసగకా గురువర్యులం గారు సమాధానాలూ ఇస్తుంటారు. అదంతా భగవంతుడి కృపకంటే ఆ గురువర్యుని కృపే అనుకోవడమూ కద్దు. వారి వస్త్రాల మీద, ఇండ్లల్లో భగవంతుడి ఫోటోలకంటే ఈ గురువర్యుల ఫోటోలే ఎక్కువగా ఉంటాయనంలో సందేహమూ లేదు.

శ్రీ రవి శంకర్ వంటి యోగా గురువులు ప్రభుత్వ వేదికల మీద కనబడటంలో ఏలుతున్న వారి పాత్ర కంటే గత కాలపు మౌలిక రాజకీయ శక్తుల ఫెయిల్యూర్ ని సూచిస్తుంది. మొదటి సహస్రాబ్దిలో రోమ్ లో రాజకీయ శక్తులు బలహీన పడి విచ్ఛిన్నం చెందటం వలననే రోమన్ కాథలిక్ మత శక్తులు బలం పుంజుకున్నాయనేది నిష్ఠుర సత్యం. క్రూసేడులూ ఇటువంటి మత, రాజకీయ శక్తుల పరస్పర బలాల బేరీజుల్లోనే జరిగిపోయాయి. ఇపుడు శ్రీ రవి శంకర్ వంటి వారి వేదికా వైభవాలకు కుటుంబ రాజకీయ వ్యవస్థల వైఫల్యమే ప్రధాన కారణమనీ చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో ఇపుడు శ్రీ రవిశంకర్ అసంబద్ధ సూచనలను కేవలం ఒక రాజకీయ వర్గపు బలాఢ్యతగా మాత్రమే పరిగణ చేసి లెక్కించడం, మరొక రాజకీయ వర్గపు బలహీనతను చూడకపోవడమే అవుతుంది. రైతు ఆత్మహత్యల వంటి సీరియస్ సమస్యకు ఆధ్యాత్మికం వంటి పైపై పరిష్కారాలు చెప్పడం  బహుశా మన రాజకీయాల  "ఆల్ ఈజ్ వెల్" ధోరణిని చూపిస్తుంది. అంతా బాగుంది గానీ అల్లుని నోట్లో శని ఉంది కాబట్టే ఇలా జరిగింది కనుక శని గ్రహ శాంతి చేస్తే సరిపోతుందన్నట్టు, సమస్య మూలాలను వదిలి పూజా పునస్కారాలు చేసుకుంటే ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పడం చాలా దారుణమైన విషయం. ఒక వేళ ఈ స్వాములం వారు చెప్పినట్లు ఈ పొర్లు దండాలు ఆత్మహత్యలను నిజంగా ఆపేసేవే అనుకున్నా, అది కేవలం పాలకులకు వారి నిష్క్రియా పరత్వాన్ని తేలికచేసి, మొత్తానికే తప్పుదారి పట్టించి సమస్య తీవ్రతను ఇంకా పెంచేదిగా మాత్రమే మారుతుంది తప్ప మరోటి కాదు. నిజంగానే యోగాది కార్యక్రమాలకు మనిషిలో మార్పు తీసుకు రాగల శక్తే ఉంటే, మైకుల ముందు కోట్ల సంఖ్యలో ఉన్న రైతులకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు వందల సంఖ్యలో ఉన్న రాజకీయ దురంధరులకు సలహాలిచ్చి రైతు సమస్యలపట్ల చిత్తశుద్ధి కలిగుండేలా వారి బుద్ధులను మార్చమని శ్రీ రవి శంకర్ సాములోరికి మా ప్రార్థన.

విరించి విరివింటి
1/5/17
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మీద వివాదాలు అనవసరం.
చలన చిత్ర పరిశ్రమ ఇండియాలో ఎదగడానికి కృషి చేసిన వారికే అది ఇవ్వబడుతుంది.
కె. విశ్వనాథ్ అద్భుతమైన సాంఘిక సినిమాలు తీయలేదని, అతనికి ఇవ్వడంలో ఏవో మతలబులున్నాయనీ గొంతు చించుకునేవారికి ఒకమాట...
"సాంఘిక సినిమాలు తీసిన వారికే ఈ అవార్డు ఇస్తాం " అని ఎక్కడా ప్రకటించబడలేదు అనే విషయం గుర్తించాలి. కేవలం అటువంటి సినిమాలకోసమే అవార్డు ఇచ్చేటట్టుగా ఒక కొత్త అవార్డును మీరు మొదలుపెడితే బాగుంటుంది. అది అవసరం కూడా.
ఇక విశ్వనాథ్ కేవలం ఒక వర్గానికి చెందిన,ఒక సాంప్రదాయానికి చెందిన సినిమాలే తీసారనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ అలా తీస్తే అవార్డులు ఇవ్వకూడదని దాదాసాహెబ్ అవార్డు కమిటీలు మడి కట్టుకోలేదనే విషయమూ గమనించాలి. ఇకపోతే కళాత్మక విలువలని కలిగి, సాహిత్య విలువలు కలిగి, బూతు, హింస ఇత్యాదివి లేకుండా, శృతి మించని హాస్యంతో, కుటుంబ సహితంగా కూర్చుని హాయిగా చూడగలిగిన సినిమాలు తీయటమే కాకుండా, ప్రయోగాలు చేయడం, వాటిని ప్రేక్షకులచే మెప్పింపజేసి విజయాలు సాధించడం, ఆ విధంగా నిర్మాతలను నిలబెట్టడం విశ్వనాథ్ గొప్పదనం. రొటీన్ కి భిన్నంగా ముసలివాడిని లీడ్ రోల్ లో పెట్టడం, అంధ, బదిర కథానాయక నాయికలతో అత్యద్భుత కళాత్మకతను ప్రదర్శించటం, పిచ్చి వాడిని కథానాయకుడిగా మలచగలగటం ఇటువంటిలెన్నో ఫార్ములాకు భిన్నంగా తీసి విజయం సాధించాడతడు. రొమాంటిసిజం సినిమా ఇండస్ట్రీని రాజ్యమేలె సమయంలో నిజ జీవితాలకు దూరమైన అవే కల్పనలతో అత్యంత అద్భుతాలని ఆయన తెరకెక్కించాడు. తెలుగులో కూడా కళాత్మక విలువలు గల సినిమాలు వస్తాయని అవీ ప్రేక్షకుల మన్ననలు అందుకోగలవనీ దేశానికి చాటిచెప్పాడు. ఇటువంటి సినిమా సాహసాలు చేసి అటు కమర్షియల్ గా ఇటు కళాత్మకంగా సక్సెస్ కావడం మామూలు విషయం కానేకాదు. కళాత్మక సినిమాలు కమర్షియల్ సినిమాలను కలపగగటం పెద్ద సాహసమే. అవి నిజానికి ఒకటే ఒరలో ఇమడలేని కత్తులుగా సినిమా పండితులు భావిస్తుంటారు.

ఇపుడున్న తెలుగు సినిమా వాతావరణం బూతు, హింస మాత్రమే కాక ఫార్ములా కథలనూ, ఫార్ములా కథనాలనూ మోసుకు తిరుగుతూంది. ఒక రకంగా అస్పష్టమైన రియలిజం ఇపిడిపుడు సినిమాల్లో కనిపిస్తున్నా, అది ఫార్ములాను దాటి బయటపడటం లేదు. రియలిస్టిక్ స్పృహ కేవలం పైపై విషయాలే నేటికీ మన సినిమాల్లో. కాలు కదిపితే టాటా సుమోలు పైకిలేచే ఊహల్లోనే ఇంకా మన దర్శకులూ, ప్రేక్షకులూ ఉన్నారు. ఒక హీరో ఇంట్రొడొక్షన్ సాంగు, కం ఫైటూ, హీరోయిన్ అందాల ఆరబోత, విలన్ హీరోయిన్ల రక్త సంబంధాలూ, నాలుగు ఫైట్లు, నాలుగు అర్థంలేని లేకి పాటలూ, ఒక ఐటం సాంగు, బీభత్సమైన క్లైమాక్సు, అర్థంకాని పాటలూ, సంగీతం పేరుతో శబ్దాల హోరూ... వంటి ఫార్ములాకు భిన్నంగా తీయగలిగిన దర్శక నిర్మాతలూ కరువయ్యారు. తీసి , బతికి బట్టగలిగిన వారు దాదాపూ లేరు. అటువంటి సమయంలో గత కాలపు సినిమాను రొటీన్ నుండి బయటపడేసి విజయాలు అందించిన కే. విశ్వనాథ్ కు ఇటువంటి సర్వోన్నత అవార్డు రావడం, సినిమా వర్గాలను కనీసం పునరాలోచించుకొనేలా చేయగలిగితే, మనం ముందు ముందు మంచి ప్రయోగాత్మక సినిమాలను చూడగలుగుతామేమో. ప్రయోగాలు చేయడం, కళాత్మక దృష్టితో మంచి సంగీత సాహిత్యాలు అందింటం, విలువలనూ హెల్తీ హాస్యాలనూ నమ్మడమూ, హింసా, బూతులను దూరం పెట్టడమూ వంటి సూత్రాలతో విశ్వనాథ్ విజయాలు సాధించినట్టయితే, తప్పకుండా సినిమా ఫీల్డ్ కి ఇదే అతడందించిన కాంట్రిబ్యూషన్ గా మనం గుర్తించాలి. కె.విశ్వనిథ్ గారిని దాదాసాహెబ్ అవార్డుతో గౌరవించటం, సినిమాల్లో కొత్తదనాన్ని, ప్రయోగాలను,విలువలనూ, సాహిత్య సంగీతాలనూ ఆహ్వానిండమే. కె. విశ్వనాథ్ గారికి శుభాకాంక్షలు.

Saturday, 22 April 2017

మతం ఒక అబ్నార్మల్ జెనిటికల్ మ్యుటేయన్

తర్కం ఎక్కడ ఆగపోతుందో అక్కడ మతం మొదలవుతుంది. తర్కాన్ని ఏది నాశనం చేయగలో అదే మతంలా అవతరించగల శక్తిని సంతరించుకుంటుంది. మతాన్ని అవలంబించే వారిలో తర్క జ్ఞానం కించిత్తయినావుంటే ఉరేసుకు చస్తానన్నాడట వెనకటికొకడు. వారి నోటిదూల మంత్రాలకూ, చేతివాటం కనికట్టులకూ చింతకాయలూ, శెనగపప్పులూ రాలేట్టయితే, మానవుడి పరిణామం ఇప్పటికీ జానెడు గుడ్డ అడ్డం పెట్టుకునే దెగ్గరే ఆగి ఉండేది. కానీ ఈ చేతి వాటం కనికట్టు రాయుల్లే మన మతగురువులు. "ప్రాచీన క్రిస్టియన్ సన్యాసి ప్రజల కోసం, వారి విముక్తి కోసం శరీరాన్ని శుష్కింప జేసుకుంటే, ఆధునిక సన్యాసి తన వ్యక్తిగత విముక్తికోసం ప్రజల శరీరాలను శుష్కింపజేస్తాడు అంటాడు" మార్క్స్ మహాశయుడు. ఇటువంటి స్వార్థ సన్యాసులతో, వాజమ్మలతోటే మతం మొదలుతుంది. కానీ ప్రత్యక్షం, ప్రమాణం, అనుమానం పద్దతిలో మొదలై ముందుకు సాగేది తర్కం. ప్రాచ్య పాశ్చాత్య మేధావులంతా తర్కాన్నే ఆశ్రయించారు. మన దగ్గరున్న అంగీకృత్య ఖండనం పాశ్చాత్య డయాలెక్టికల్( dialèctical) కి దగ్గరి సంబంధం కలిగి ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకటే అప్పటి ప్రపంచ మేధావులు తర్కాన్నే ఆశ్రయించారు తప్ప మతాన్ని కాదు. గ్రీకు 'జీనో' మొదలు పెట్టిన తర్కం సోక్రటీస్ నుండి, ప్లేటో నుండి ముందుకు సాగి హెగెల్ తో జడలు విప్పి, వాద ప్రతివాద, సమన్వయ వాదాది త్రిక తర్కం (గతి తార్కికం)గా అవతరించింది. ప్రపంచానికి భాష్యం చెప్పిన తత్వవేత్తలు మతం గుప్పిటిలో దాదాపు ఇరుక్కు పోలేదు. ప్రాచీన ఋషులెవరూ ఏ మతానికీ బంధీ కాలేదు. కానీ జన సామాన్యం తత్వ శాస్త్రాన్నే కాదు తత్వ వేత్తలనీ వదిలిపెట్టింది. సోక్రటీసుకు విషమిచ్చి చంపేసింది. అరేబియన్ తత్వవేత్త ఇబన్ రుష్ద్ పుస్తకాలనూ తగులబెట్టింది, డార్విన్ పుస్తకాలను తగులబెట్టింది. మనదేశంలో లోకాయత, భౌతికవాద దర్శనాలు నామరూపాలు కోల్పోయాయి. మొదటినుండీ మతం తర్కాన్ని నాశనం చేయడం వలననే వృద్ధి చెందింది. తర్కాన్ని నాశనం చేయకుండా మతం మనలేదు. ఆల్జీబ్రానూ, జామెట్రీని కలిపి కార్టీజియన్ సిస్టం( Cartesian system) సృష్టించిన డెకార్టే (Descartes) వంటి గణితజ్ఞుడైనా తర్కం సహాయంతోటే దేవుడి ఉనికిని నిరూపించగలమనీ అన్నాడే తప్ప నమ్మకాలతో దేవుడి ఉనికిని గుడ్డిగా ఒప్పుకోలేదు. లెక్కలు చూస్తేగానీ తిక్కలు కుదరవని ఊరకే అనలేదు కదా.  "బ్రైటర్ దాన్ థౌజండ్ సన్స్ ( Brighter than thousand suns) పుస్తకంలో చెప్పినట్టు శాస్త్రవేత్తలను రాజ్యాధినేతలు తప్పు మార్గం పట్టిస్తే...తార్కిక జ్ఞానంగల మనుషులను మతాలు తప్పుదారి పట్టిస్తాయన్న విషయం మధ్య యుగాల చరిత్రను చూస్తే అర్థమౌతుంది. తత్వ శాస్త్రం మతం కలిసిపోవడమూ, మత కోణంలో తత్వ శాస్త్రాన్ని వివరీంచటమూ, తత్వాన్ని మత భావనల అభివృద్ధికి గురిచేయడమూ పరమ పాండిత్యంగా ఆవిర్భవించి పాండిత్య వాదానికి( Scholasticism) తెరలేపింది. మౌఢ్యానికి వ్యతిరేకమనిపించిన బౌద్ధం తాంత్రిక కౌగిలింతల్లో తేలియాడింది. యోగ మార్గం కన్నా జ్ఞానమార్గం గొప్పదన్న గీత "యజ్ఞం వలన మోక్షం వస్తుంద"ని చెప్పక తప్పింది కాదు. (అది ఖర్చుతో కూుకున్న పనిగనుక జ్ఞానంతో సరితూ గదని అందులో సవరణ).

మతం ప్రతివాదాన్ని(anti thesis) నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఏ మతమైనా తన మార్గమే గొప్పది అంటుంది. తాను చెప్పిన దైవమే అసలైన దైవం అంటుంది. తను చూపించిన మార్గమే దేవుని చేరు ఏకైక మార్గమనీ అంటుంది. తన ప్రవక్తనే చివరి ప్రవక్త అంటుంది. దేవుడు జడ్జ్మెంటు ఇచ్చే రోజు ఒకటుంటుందని నమ్ముతుంది. ఇవన్నీ స్టేట్మెంట్లు అనుకుంటే, వాటికి వ్యతిరేకంగా ఎవరు ప్రతివాదాన్ని వినిపించినా, వెంటనే నాశనం చేయడమే మతం ఉనికికి చరమ మార్గం. పలానా పుస్తకంలో ఈ విధంగా రాశేశాడు దేవుడని చెబుతుంది మతం. అదంతా అపౌరుషేయం అంటుంది. దేవుడెందుకు రాశాడో, దేనితో రాశాడో, అసలేం పని లేక రాశాడో మనకు తెలియదు గానీ, అది అడిగే హక్కూ మనకు ఉండకూడదంటుంది మతం. ఆ విధంగా రాయబడి చెప్పబడీ ఉన్నందున ఆ విధంగానే చెయ్యాలి. వ్యతిరేకంగా చేస్తే దేవుడి పేరు చెప్పి మతానుయాయులే మనుషులను నాశనం చేయపూనుకుంటారు. మతమంటే మొత్తానికి తప్పొప్పుల పట్టిక తప్ప ఇంకేమీ కాకుండా పోతుంది. ఈ పలానాది ఇలా చేయాలి, అలా చేయకూడదు అని సూత్రమాలనొకటి తయారు చేసి పెడుతుంది. ఈ మూల సూత్రాలు కరడుగట్టిన తరువాత, మొదటికి ఎసరు బెట్టినట్టు, ఆ కాలానికి చెందిన విజ్ఞాన శాస్త్రాన్నీ తత్వ శాస్త్రాన్నీ భ్రష్టు పట్టిస్తుంటుంది మతం. ఖగోళ శాస్త్రంలో గ్రీకులు బాబిలోనియన్లు సాధించిన విజయాలకంటే ఉత్కృష్టమైన విజయాలను మూటగట్టుకున్న భారతదేశం,ఆ తరువాతి కాలంలో అందులోకి మత భావనలను చొప్పించి ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీగా మార్చి పడేసింది. గ్రీకులు పైథాగొరియన్లు భారతీయులు వృద్ధి చేసిన అంక గణితం(number theory) చివరికి అంకెల జోస్యంగా( numeroĺogy) పరిణమించింది. భౌతిక శాస్త్రాలకు భాషగా ఉండవలసిన గణితం చివరికి కాకి లెక్కలకూ పిచ్చి గణనలకూ ఆలవాలమై పతనం చెందింది. గణితానికి మిస్టిసిజంను జతచేసే జాడ్యం క్రీ.పూ ఆరవ శతాబ్దానికి చెందిన పైథాగొరియన్ల నుండి మొదలైందని సరిపుచ్చుకున్నా, పాశ్చాత్య దేశాల్లో మధ్య యుగాల్లోనే(medieval period)  పరిణతి చెందింది. చివరికి దాని ప్రభావం వలన విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అదే పాత చింతకాయ పచ్చడిలాంటి మతపిచ్చి మాటలను వినడం, భూమి బల్లపరుపుగా ఉందని నమ్మడమే అవుతుంది.

ఈ మధ్య ఇంకో వాదన మొదలైంది. ఆ వాదన మత ప్రారంభకులను మహానుభావులుగా ఊహించే వాదన. ఆ మత ప్రారంభకులు ఏదైతే రాశారో, ఏదైతే చెప్పారో అది అన్నింటికంటే సర్వోత్తమం, సర్వోత్కృష్టం అంటారు వీరు. మత ప్రారంభకులు ప్రాణం పోయినా పొరపాటున కూడా తప్పు రాయరు, తప్పు చెప్పరు అనే ఒక ఫాల్లసీ వీరిని నడిపిస్తూ ఉంటుంది. తర్కంతో సాగే విజ్ఞాన శాస్త్రం దీనికి పూర్తి భిన్నంగా వాదిస్తుంది. పూర్వులు చెప్పిన దానిని సవరించుకుంటూ, అభివృద్ధి చెందుతూ సత్యం వైపుకు సాగేది విజ్ఞాన శాస్త్రమైతే, పూర్వులు చెప్పిందే పరమ సత్యమని , ఇక అనుమానానికీ, తర్కానికి ఏ మాత్రం చోటివ్వకుండా మతం సాగుతుంటుంది. ఈ వాదన ప్రకారం మతానికి సంబంధించిన ఆ పలానా పుస్తకంలో చెప్పినదంతా అత్యద్భుతమే...పరమ సత్యమే కానీ ఆ మతాన్ని అనుసరించే వారు దానిని సరిగా అవగాహన చేసుకోలేకపోవటం వలనో, లేదా తప్పుగా అర్థం చేసుకోవటం వలననో మాత్రమే ఇన్ని మత సంబంధ మారణ హోమాలు జరిగాయనో వాదిస్తుంది. మతానుయాయుల్లో లోపాలుంటాయి గానీ, మతంలో, మత సూత్రాల్లో లోపాలే ఉండవంటుంది విచిత్రంగా. మతానుయాయుల్లో లోపాలు ఉన్నపుడు ఆ మతాన్ని ప్రారంభించిన అర్భకులలో లోపాలు ఎందుకుండకూడదు అని మనం వీరిని అడగకూడదు. అడిగితే ఠారుమని నిటారుగా పైకిలేస్తారు. వీరి వాదన ప్రకారం మత ప్రారంభకులు దివ్య పురుషులన్నమాట. సగం అడ్డ గోచీలు కట్టుకుని, ప్రసార సాధనలు కూడా సరిగా చేయలేని పరమ అనాగరికమైన కాలం నాటి ఈ అమాయక మానవులు పరమ దివ్య పురుషులుగా ఎలా అయుంటారో వీరు తప్ప బహుశా ఏ విజ్ఞాన శాస్త్రమూ చెప్పలేదనుకుంటా. అంతే కాకుండా మత సూత్రాలు గొప్ప నీతివంతమైన ఆలోచనలకు పునాదులని కూడా వీరు వాదిస్తారు. ఇంకా ఎక్కువ మత కిక్కుగనక తలకెక్కింటే, అసలు తమ మతమే గొప్ప సైన్సు అనీ వాగుతారు. మతంలో చెప్పిన దానికీ నేటి సైన్స్ కీ బీరకాయ సంబంధాల్ని లాగి లాగి కకూన్లలాగా చుట్టచుట్టుకుంటారు. ఆ పురాతన కాలపు నీతి ఇప్పటి ఈ కాలపు నీతికి, సైన్సుకూ ఎట్లా అతుకుతుందో వారికే తెలియాలి. కప్ప బురద నుండి పుడుతుందని నమ్మిన అజ్ఞానాంధకార ప్రజలుండిన సమాజంలోని కిరాతక నీతి ఈ సమాజానికి సరిపోతుందని నమ్మే వారు ఏ బురదలో దొర్లుతుంటారో చెప్పడమూ కష్టమే. వాటిని ఈ కాలానికనుగుణంగా మార్చాలని అనుకోకపోవడానికి ఈ మత ప్రారంభ అర్భకుల మీది ఎనలేని అతి ప్రేమనే.

కాలం మారే కొలదీ మానవుని ఆలోచన పరిపక్వం కావలసిన అవసరం ఉంటుంది పరిణామ రీత్యా. కానీ దానిని పరిపక్వం కానీయకుండా పురాతన నమూనాలోనే ఉంచేయగలది మతం మాత్రమే. ఆదర్శ సమాజాలూ, స్వేచ్ఛా సమాజాలు ఉద్భవించాలంటే మతమన్నదే మొదటి అడ్డంకి. మానవ సమాజ పరిణామానికి అది గుదిబండ. మతం ఉండగా మానవుడు కొత్తగా ఆలోచించే అవకాశం ఎక్కడిది?. ఏది కొత్తగా ఆలోచించవలెనన్నా అదే మత భావనలను ఆలంబన చేసుకుని వీరు సాధించే పరిణామం ఏమిటి?. భారత దేశంలోని పురాతన కాలపు ఋషులూ, గ్రీకు లాటిన్ లలోని తత్వ వేత్తలే ఈనాటి ఆధునికులకంటే నయం. ఋగ్వేద ఋషులు పునర్జన్మలకోసం, మరణానంతర దివ్య జీవనం కోసం కక్కుర్తి పడలేదు సరికదా, ఇటువంటి భావజాలంతో భవిష్యతరాలకు ఇబ్బందులు సృష్టించలేదు, పైగా భౌతిక సుఖలాలసతను దివ్య జీవనమనుకున్నారు. తమకు తెలియని ప్రపంచాన్ని పలు విధాలుగా తెలుసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేసారు. ఇప్పటి ఆధునికులు ఈ పూర్వీకులు కనుక్కున్న ఆ మాత్రం విషయాల్ని దివ్య పుస్తకాలుగా చదువుకుని తలలు బొప్పికట్టించుకుంటున్నారు. పొరపాటునో, గ్రహపాటునో ఆ పురాతన అర్భకులు తాము కనుక్కున్న విషయాలను ఏదో రూపంలో దాచి ఉంచి పెట్టడమే ఆ తరువాత కాలంలో మత దరిద్రం మనకు చుట్టుకోవడానికి కారణం. వారు దాచి పెట్టి ఉంచడమేమోగానీ ఆధునికులకు మా తాతల మూతులు నేతులు నాకాయని చెప్పుకుంటూ తమ మత గొప్పదనమంతా పూర్వీకుల గొప్పదనమే అనే పటాటోప రోగాలతో సంచరిస్తూంటారు. ఆ విధంగా మతం మనిషికి ఆతడి భావజాలానికీ సంఘర్షణలేని ఒక రెడీమేడ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతా రెడీమేడ్ వష్తువులు వచ్చేసాయని మనం ఇపుడు వాపోతుంటాం గానీ, మతమంటేనే రెడీ మేడ్ ఆలోచనలుగల భావజాలం. అందుకే అది తర్కాన్ని చిదిమేస్తుంది. అసత్యం నుంచి సత్యానికీ, చీకటి నుండి వెలుగుకూ, మృత్యువునుండి అమరత్వానికీ పరిణామం చెందాలనే అద్భుత పరిణామాత్మక స్లోగన్ ని ఇచ్చిన బృహదారణ్యకోపనిషత్తు మతం కోరలలో చిక్కి చివరికి దేవుడి పూజా గదిలో కుంకుమా పసుపుల మధ్యన పూజలు అందుకుంటుంది.

ఈ దేశంలోగానీ మరేదేశంలోగానీ యుగయుగాలుగా మత భావనలకూ రాజ్యాధికారాలకూ, రాజకీయాలకూ విడదీయరాని సంబంధ బాంధవ్యాలు ఉండటం కనిపిస్తుంది. మానవుని ఆలోచనల పరిణామానికి మతం దానిని అంటి పెట్టుకుని ఉన్న రాజకీయాలూ రెండూ ప్రతిబంధకాలే. ప్రతీ వస్తువునూ  వ్యాపారం చేయగలిగిన కాపిటలిజం కాలంలో మతం కొత్త వ్యాపారంగా ప్రజల ముందుకొచ్చింది. దైవ చింతనం, మననం, ధ్యానం ఇపుడు లాభదాయక వ్యాపారాలు. దోపిడీ వర్గాలకు అందివచ్చిన నూతన మార్గాలు. కాలానుగుణంగా మతం తన దోపిడీ రూపాన్ని మార్చుకుంటూ మనిషిని తన సహజ పరిణామానికి దూరంగా ఉంచుతూనే ఉంది. మతం మానవుని పరిణామ దశను ముందుకు సాగనీయకుండా చేసే అబ్నార్మల్ జెనెటికల్ మ్యుటేషన్(  abnorma genetical mutation). దీనికి విరుగుడు తార్కిక చింతననే. తాము తార్కికులమనీ, ఆధునీకులమనీ, అభ్యుదయ వాదం మీద కూచున్న స్వేచ్ఛా పక్షులమనీ చెప్పే మహానుభావులు, మత భావనలను వదిలి పెట్టకుండా ఎలా తార్కికులయ్యారో చెప్పవలసి ఉంటుంది. వారి తార్కిక శక్తి ఏ పురాతన మత భావనలను నిలపటానికి ఉపయోగించుకుంటున్నారో ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంటుంది.

22/4/17
 Virinchi Virivinti

Tuesday, 18 April 2017

జోకులు చేసే నష్టం

"మొరిగే కుక్కలు కరువవు" అనేది సామెత. కానీ మొరిగే కుక్కలైనా కరుస్తాయేమోగానీ, హాయిగా నవ్వేసే శత్రువెపుడూ తుపాకీతో కాల్చడు అంటాడు కోనార్డ్ లోరెంజ్. రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్స్ పెరిగిపోతున్న ఈ సోషల్ మీడియా కాలంలో రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్ ల విషయంలో లోరెంజ్ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమన్నది చర్చ చేయవలసిన అవసరం ఉంది.  లోరెంజ్ ఇటువంటి రేసిస్ట్ జోక్స్ ప్రమాదభరితంగా లేనంత వరకూ ఆమోదించవచ్చు అంటాడు. మనుషుల్లో ఇతర జాతుల పట్ల ఉండే హింసాత్మక ప్రవృత్తిని కొంతవరకైనా రేసిస్ట్ జోక్స్ నిలువరిస్తాయని అతడి వాదన. మానవుడు హింసను కలిగివుండడమన్నది అతడి సహజ గుణం. ముఖ్యంగా తనకంటే ఇతర జాతుల పట్ల అతడు తప్పక ద్వేషాన్ని కలిగివుంటాడు. అది అతడి సహజ నైజం అనేది మనం అవగాహన చేసుకోకపోతే, అహింస అనే ఆదర్శాన్నీ, నిర్మిత సత్యాన్నీ పట్టుకుని వేల్లాడతాం. మనిషిలోపలుండే హింసా ప్రవృత్తి బయటపడటానికి ఏదో ఒక కవాటమనేది అవసరం. ఆ కవాటాన్ని బలవంతంగా మూసి ఉంచటం వలన అది ఏదోరోజు మనిషిని చంపేంత హింసాత్మకంగా బయటపడక తప్పదు. కానీ రేసియల్ జోక్స్ ఆ కవాటాలని ఎప్పటికప్పుడు తెరచి ఉంచుతాయి కాబట్టి ఆ అగ్రెషన్ ఎప్పికప్పుడు తగ్గుతూ ఉండి, సాటి మనిషిని చంపడానికికు బదులు జోక్ కి నవ్వడంతో  ఆగిపోతుంది లేదా పలుచనపడిపోతుంది అనేది ఈ వాదం. ఈ వాదం సారం ఏమంటే, రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్స్ అవసరమే అనేది.

 "మనుషి ఆలోచించగల జంతువు" అన్నారు అంటే అతడూ జంతువనే కదా. జంతువుల్లో ఉండే లక్షణాలు మనిషికీ ఉండాలి. కుక్కలనే తీసుకోండి. వీధి కుక్కలు ఎపుడైనా ఒక బొచ్చుకుక్క కనబడితే వెంటనే మొరగటం మొదలు పెడతాయి. మూకుమ్మడిగా మొరిగి తమ కంటే వేరుగా కనిపించే బొచ్చుకుక్కను గేలి చేస్తాయి. మనిషికీ అదే లక్షణం వచ్చి ఉంటుంది. తనకంటే వేరేగా కనిపించే జాతివాడిమీదో, మతం వాడి మీదో, కులం వాడి మీదో మొరగకపోతే, వదురుబోతు తనాన్ని తగినంత చూపకపోతే అతడి హింసా ప్రవృత్తి తృప్తి పొందటం జరగదు. "తిట్టడం" లేదా అంతకంటే తీవ్రమైన "చంపటం" బదులు "నవ్వటం" అనే దాన్ని ప్రవేశ పెట్టడం తద్వారా జాతుల వైరం కాస్తా జాతుల స్నేహంలా మారిపోతుందనుకోవటం ఇటువంటి ఆలోచనల వచ్చిన ఉపాలోచనలు.

"పొలిటికల్ కరెక్ట్ నెస్ (political correctness)" అనే పదం భాష ద్వారాగానీ, పాలసీల ద్వారాగానీ ఇంకే విధంగానూ ఒక గ్రూపు ప్రజలకు అవమానకరంగా ఉండకూడదనే విషయాన్ని  సూచిస్తుంది. మనదేశంలో ఈ పదం పెద్దగా తెలియదనే చెప్పాలి. చాగంటి వారి ప్రవచనాల్లో అదేదో సామెతది తప్పే తప్ప తమది కాదు అని చెప్పటమూ ఇటువంటి పొలిటికల్ కరెక్ట్ నెస్ యాటిట్యూడ్ లేకపోవటమే. రేసిస్ట్ సెక్సిస్ట్ జోకుల్లో కూడా పొలిటికల్ కరెక్ట్ నెస్ దృక్పథం ఉండదని చెప్పాలి.  రేసిస్ట్ జోక్స్ ఖచ్ఛితంగా ఒక వర్గం వారిని కించపరుస్తాయి. వాటిలో జోక్ పేల్చేవాడూ, నవ్వేవాడు ఒకడైతే, బాధ పడేవాడు ఇంకొకడు ఉంటాడు. అయితే జోక్స్ ఎవరు ఎవరితో చెబుతున్నారు అనేది చాలా ముఖ్యమంటారు సోషియాలజిస్ట్లు. ఒకే జాతికి చెందిన వారందరూ ఒక చోట కూర్చుని ఇంకో జాతి వారి గురించి జోకులు చెప్పుకుని నవ్వుకోవడం ఒక రకం. మగవారంతా కూర్చుని ఆడవారి గురించి జోకులు వేసుకోవడం. మొగుళ్ళందరూ కూర్చుని భార్యల గురించి జోకులు వేసుకోవడము, తెల్లవాడు నల్లవాడి మీద, హెటిరో సెక్సువల్ హోమో సెక్సువల్ మీద, ఒక మతం వాడు ఇంకో మతం మీద, ఒక వర్గం వాడు ఇంకో వర్గం మీద, ఇత్యాదివి. సాధారణంగా ఆధిపత్య వర్గాల వారు అణచివేత వర్గాల వారి మీద, పీడకులు పీడితుల మీద ఇటువంటి జోకులు వేసుకుని నవ్వుకుంటారు. ఇటువంటి జోకులు చెప్పేవారు, వాటికి నవ్వేవారూ తప్పకుండా రేసిస్టులూ, సెక్సిస్టులూ అయ్యుంటారు. టార్గెటెడ్ గ్రూపువారందరూ అణచివేత వర్గానికి చెందిన వారై ఉంటారు.

రేసిస్ట్ సెక్సిస్ట్ జోకులు, సమజంలో పాతుకుపోయి ఉండే నిమ్నోన్నతాలను, వాటి చుట్టూ పేరుకుపోయి ఉన్న నమ్మకాలను, ముందే ఏర్పాటు చేసుకున్న భావనల ( prejudices)నూ స్థిరీకరిస్తాయి. ఇటువంటి జోక్స్ విభిన్న జాతుల మధ్య సఖ్యతను ఏర్పరుస్తాయని ఒక వాదన ఉంది. మన "రస్సెల్ పీటర్" లాంటి వాళ్ళు విభిన్న జాతుల వారిని ఒక చోట కూర్చోబెట్టి రకరకాల రేసిస్ట్ జోక్ లు వినిపించేస్తూ తామేదో సాదించేస్తున్నాం అనుకోవడం జరుగుతూ  ఉంటుంది. విభిన్న జాతుల వారు ఒక చోట కూర్చుని కలిసి నవ్వుకోవడం వలన మేలు జరుగుతుంది, వారిలో ఉండే రేసిస్ట్ భావనలు ఆ విధంగా పలుచనపడి పోతాయనేది ఈ వాదన లోని సారం. కానీ వాస్తవాలు ఇంకో రకంగా ఉంటాయనేది వాస్తవమే. రేసిస్ట్, సెక్సిస్ట్ జోక్ లలో ఉండే సామాజిక జీవన విధానానికీ, వాస్తవ జీవితంలో ఉండే సామాజిక జీవనానికీ సంబంధం ఒక రబ్బర్ బ్యాండుతో పోల్చడం జరిగింది. ఉదాహరణకు రబ్బర్ బ్యాండు లోపల మన సమాజం ఒప్పుకునేంత మేరకు భావనలు ఉంటే, రబ్బరు బ్యాండుకు బయట ఉన్నదంతా మన సమాజం ఒప్పుకోనిదే అనుకుందాం. ఇపుడు ఈ రకమైన జోక్ లు రబ్బర్ బ్యాండును సాగదీయడం ద్వారా, సమాజంలో ఒప్పుకోని వాటిని కూడా రబ్బర్ బ్యాండు లోపలికి తీసుకువచ్చి మనతో ఒప్పిస్తాయి. ఒక మైనారిటీ వర్గం వారిని దూషించటం తప్పు అనేది సోషల్ నార్మ్ అనుకుంటే, ఈ జోకుల ద్వారా ఆ నార్మ్ తొలగించబడుతుంది. దానికి "జస్ట్ ఎ జోక్" అని పేరు పెట్టబడుతుంది.

నిజానికి చెప్పాలంటే ఇటువంటి జోక్స్ భిన్న జాతుల వారిని దగ్గర చేయడం అటుంచితే,  అవి అప్పటి దాకా మనలో దాచి పెట్టబడిన ఇన్హిబిషన్స్ ని వదిలించుకునేలా చేస్తాయి. ఉదాహరణకు ఆడవారి గురించి ఒక చోట ఒకతను జోక్ లు చెబుతున్నాడనుకుందాం. అతడు చెప్పే జోకులలోని తీవ్రతను బట్టి వింటున్న వారిలో ఇన్హిబిషన్సు తొలగిపోతాయి. ఇపుడు వింటున్న వారిని కూడా అటువంటి జోక్ లు చెప్పమని అడిగినపుడు, వారు కూడా అప్పటిదాకా బయట ఎక్కడైనా చెప్పాలంటే ఏమనుకుంటారో అనుకునే విధంగా ఉండే జోక్స్ ను కూడా ఆ సమయంలో అతి సులువుగా తడుముకోకుండా చెప్పగలుగుతారు. అంటే రేసియల్ జోక్స్ వారిలోపల ఉండే ఇన్హిబిషన్ ని తొలగించేస్తాయి. ఒక వ్యక్తి గురించి గుంపులో ఎవరైనా ఒకరు నెగెటివ్ గా చెప్పినా గుంపులోని అందరూ చిలువలు పలువలుగా ఆ వ్యక్తి గురించి నెగెటివ్ గా చెబుతూ  ఆనందించడం వంటిదే ఇది కూడా. ఇపుడు అలా చెప్పబడిన వ్యక్తి తారస పడినపుడు ఆ గుంపులోని వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో..రేసియల్ జోక్ లను విని ఆనందించిన వారు కూడా జోక్ విక్టిమ్స్ ఎదురు పడినపుడు అటువంటి అవగాహననే కలిగి ఉంటారు. ఉదాహరణకు ఒక గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెక్సిస్ట్ జోక్ లు వినక ముందు కంటే విన్న తరువాత, వుమన్ ఆర్గనైజేషన్ లకు గవర్నమెంట్ ఫండింగ్ అవసరమే లేదన్నారట.

" ఆ ఏముందీ ఇవి కేవలం జోక్స్ మాత్రమే కదా" అనుకునే వారు ఈ మధ్య కాలంలో ఎక్కువ. జోకును జోకులాగా చూడాలి అనేది వీరి ఫిలాసఫీ. వీరంతా చదువుకున్న పనికిమాలిన వారు అనాల్సి ఉంటుందేమో. పైగా ఈ మధ్య సెక్సిస్ట్ జోక్ లను ఆడవారే ఎక్కువగా షేర్ చేస్తూ కనిపిస్తారు సోషల్ మీడియాలో. ఆ మధ్య ఓ సినిమా విలన్ కం హాస్య నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఏవో సెక్సిస్ట్ జోక్ లు లైవ్ లో చెబుతుంటే, స్వయంగా ఆడవారే పడీ పడీ నవ్వటం మనం చూసే ఉంటాం. ఇటువంటి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. ఒక రీసెర్చిలో కొంత మంది మగవారికి న్యూట్రల్ జోక్స్ ని వినిపించినప్పటికంటే, సెక్సిస్ట్ జోక్స్ వినిపించినపుడు వారు ఆడవారిని రేప్ చేయడం తప్పేమీ కాదనే భావనని వ్యక్తపరిచారట. ఆడది ఒక సెక్స్ ఆబ్జెక్ట్ అనే భావనని ఈ సెక్సిస్ట్ జోక్స్ వారిలో స్థిరీకరించాయన్నమాట. కాబట్టి సెక్సిస్ట్ జోక్స్ షేర్ చేస్తూ తాము గొప్ప కామెడీ లవర్స్ మి అని చెప్పుకునే ఆడవారందరూ తాము షేర్ చేసిన జోక్ ఇంకో రేప్ విక్టిమ్ ని తయారు చేస్తుందని గుర్తు పెట్టుకోక తప్పదు. ఈ మధ్య జబర్దస్త్ వంటి కామెడీ షో లలో ఆడవారిని కించపరచడం సమాజం ఒప్పుకోనంత స్థాయికి చేరిపోయింది. దానికి విక్టిమ్స్ ఎటువంటి వ్యతిరేకత చూపక పోవడం వలన రాను రానూ సమాజం దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడిన తరువాత వచ్చే కామెడీ అప్పటిదాకా ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. దాని పరిణామాలు సమాజంలో ఆడవారిని చూసే పద్దతిలో కనిపిస్తూ ఉంటుంది. పక్కింటి ఆడవారందరూ తన కోసమే కాచుకుకూర్చున్నారనుకునే మూర్ఖత్వాన్ని గ్లోరిఫై చేసే జోక్ లు వచ్చినంత కాలం, దానిని చూసి ఎంజాయ్ చేస్తున్నంతకాలం ఆడవారిని భోగవస్తువులుగా చూడటమన్నది స్థిరీకరణ చెందుతూ నే ఉంటుంది.

మన దేశంలో ఇప్పటికీ భార్యల పేరుతో ఆడవారిపై జోక్ లు వస్తూనే ఉన్నాయి. లావుగా ఉండే వారి మీదా, నల్లగా ఉండే వారి మీదా, బక్కగా ఉండే వారి మీద, ఎల్జీబీటీల మీదా జోక్ లు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఈ మధ్య ఒక మిత్రుడు అసెంబ్లీలో థర్డ్ జండర్ కి కూడా చోటు కలిగించాలని సహృదయతతో పోస్ట్ పెడితే, ఇప్పుడున్న వారందరూ ఎవరనుకున్నారని ఒకాయన పరిహాసాలాడటం కనిపించింది. ఇది నిజంగా ఇపుడున్న మంత్రులను హేళన చేయడమా లేక థర్డ్ జండర్ ని హేళన చేయడమా?. ఇంకో ఆయన ఏకంగా ఒక జాతి మగవారి మగతనం అంటూ కీర్తిస్తాడు. మగతనం అంటే కార్య శూరత అనే అర్థంలో వాడటం బహుశా జబర్దస్త్ వంటి కామెడీ షో లు వచ్చాక పెరిగిందేమో. ఎందుకంటే ఆ జోక్ లు ఆ భావనను స్థిరీకరించేశాయి. కాబట్టి మన మాటల్లో, భాషలో, భావాల్లో పొంగి పొరలే రేసిస్ట్, సెక్సిస్ట్ భావనలకు బీజాలు వాటిని ప్రోత్సహించే జోకుల నుంచే మొదలవుతాయని మనం గుర్తించాలి. పొలిటికల్ కరెక్ట్ నెస్ భావనని పెంపొందించుకోవాలి.

17/4/17
Virinchi Virivinti.

Thursday, 13 April 2017

అల్ అబౌట్ టాయిలెట్

 Shit can also serve as a stuff for thought  అన్నారు పెద్దలు. అందుకే టాయిలెట్ ని కూడా ఫలవంతంగా ఉపయోగించుకోవాలన్న స్పృహనేమో అప్పట్లో న్యూస్ పేపర్లు కూడా టాయిలెట్లలోకి దూరి పోయేవి. ఇపుడు సెల్ ఫోన్స్ వచ్చేశాక ఉదయం పూట ఏకంగా వాట్సప్ అండ్ ఫేస్బుక్ కూడా టాయిలెట్ల నుండే ప్రపంచాన్ని పలకరిస్తూ ఉంటాయి. ఎంత ఫేస్బుక్ లో ఫేసు పెట్టినా, సెల్ఫీ వీరులకు ఆ సమయంలో సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన కలగకపోవడం ముదావహం. కొద్దిరోజుల్లో ఆ ముదనష్టాన్ని కూడా చూడక తప్పదేమో అని బాధ కూడా. సెల్ఫీ దిగేటపుడు ముఖం ముక్కినట్టుగా ఎలాగూ పెడుతుంటారు కదా, సిట్యుయేషన్ లేకున్నా. ఇదొక్క సెల్ఫీ కూడా దిగేస్తే...పెట్టిన ముఖకవళికకూ కింది కదలికకూ పొంతన చేకూర్చిన వారౌతారు. సామాజిక కట్టుబాట్లను టాయిలెట్ల నుండే ఛేదించాలంటాడు తన సర్రియలిస్ట్ చిత్రం "ఫాంటమ్ ఆఫ్ లిబర్టీ"లో దర్శకుడు "లూయిస్ బున్యూల్". ఈ సినిమాలోని టాయిలెట్ సీన్ ని మన దేశస్థులు చూసే వీలు లేదు సెన్సార్ పరిధుల వలన. డైనింగ్ టేబుల్ చుట్టూ పది మంది కూర్చుని మాట్లాడుకుంటూ తింటూన్నట్టుగా పది మంది చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ మలవిసర్జన చేయటం చూపిస్తాడీ సినిమాలో. అంతే కాకుండా తిండి తినడానికి ఇంటి వెనుక ఉన్న చిన్న గదిలోకి పోయి ఒంటరిగా కూచుని తినటం చూస్తాం ఇదే సినిమాలో. అంటే టాయిలెట్ల విషయంలో మనమేర్పరచుకున్న దృక్పథాలు సామాజిక నిబంధనల వలన ఏర్పడినవే, వాటిని ఛేదించాలంటాడు దర్శకుడు. ఇన్ని రోజుల తర్వాత స్వచ్ఛ భారత్ పుణ్యమా అని మనం మొదటిసారయినా టాయిలెట్ల గురించి ఆలోచించగలుగుతున్నాం, చర్చించగలుగుతున్నాం. టాయిలెట్లనుండే ఆదునిక భారతంలో విప్లవం మొదలవటం శుభపరిణామం.

ఈ మధ్య నగరీకరణల వలన మన ఇండియన్ టాయిలెట్లు కనుమరుగై ప్రతీ చోట వెస్టర్న్ టాయిలెట్లు ప్రత్యక్షమౌతున్నాయి. ఇండియన్ స్టైల్ అలవాటయిన వారికి ఒక పట్టాన ఈ వెస్టర్న్ టాయిలెట్స్ అర్థం కావు. "పని ముగియకముందూ, ముగిసిన తరువాత వెయిట్ చెక్ చేసుకుంటే ఎలాంటి మార్పూ ఉండి చావట్లేదోయ్" అన్నాడు అప్పట్లో ఊరి నుండి వచ్చిన బంధువు. ఒకానొక పెండ్లి విడిదిలో వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్న గదులు ఏర్పాటు చేశారని మగ పెండ్లి వారు అలక పానుపేశారట. అప్పటికప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉన్న హోటల్ లో గదులు ఇప్పించాల్సి వచ్చిందట. ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ పబ్లిక్ టాయిలెట్లలో ఇండియన్ స్టైల్ ని అనుసరించటం వెస్టర్న్ టియిలెట్స్ కి అలవాటుపడిన నగరవాసులకు మహా ఇబ్బందిగా మారింది. ఒక పెద్దాయన పబ్లిక్ టాయిలెట్లను ఏకంగా పెళ్ళితో పోల్చేశాడు. బయటనున్న వారు ఎపుడెపుడు లోపలికెల్దామా అని తొందరపడుతుంటే, లోపలున్న వారు ఎపుడెపుడు బయటికొచ్చేద్దామా అని తొందరపడతారట. మోకాళ్ళను మడచి ఎక్కువసేపు కూర్చోలేక కావచ్చు. అసెంబ్లీలో ఇండియన్ టాయిలెట్లలో ఉండే పాదపు గుర్తులను చూచి దేవుడి పాదాలనుకుని మొక్కి వచ్చారట అప్పటి పల్లెటూరినుండి ఎంపికైన ఎంఎల్ఏలు. అది గుర్తుంచుకునే నేమో ఈ మధ్య జైరాం రమేశ్ టాయిలెట్స్ గుళ్ళ కంటే పవిత్రమైనవన్నాడు. గుళ్ళ కంటే కూడా టాయిలెట్స్ లోనే తక్షణ మోక్షం లభిస్తుందని చమత్కరించాడు. మనలో మనమాట, రాజకీయనాయకులు టాయిలెట్ కుండ మీద కూర్చున్నంత  స్థిరంగా ఇంకెక్కడా కూర్చోలేరని ప్రతీతి.

టాయిలెట్ ఎక్కడున్నా ఫ్లష్ ఎంత ముఖ్యమో వెంటిలేటర్ కూడా అంతే ముఖ్యం. అలా అని చెప్పి విమానాల టాయిలెట్లలో వెంటిలేటర్లను ఆశించకూడదు మరి. ప్రైవసీ తక్కువున్న ప్రదేశాల్లో నీళ్ళ కంటే నీళ్ళ శబ్దం చాలా అవసరం. ఆ మధ్య అత్యవసరంగా పొట్టపట్టుకుని ఇంటికొచ్చిన మిత్రుడు లోపలంతా బక్కెట్టు జరిపిన శబ్దమే అని కవరింగ్ ఇవ్వ ప్రయత్నించాడు. నవ్వకుండా నమ్ముతున్నట్టు నటించడం కష్టమైంది మరి. తెనాలి రామకృష్ణుడు బంగారు వరి గింజలు నాటితే బంగారం వరి పంట వస్తుందని చెప్పాడట. కానీ నాటేవారు ఇప్పటిదాకా కిందినుండి గాలి వదలని వారై ఉంటేనే సాధ్యమౌతుందని మెలిక పెట్టాడట. కృష్ణదేవరాయరంతటి వాడు ఆ ఆఫర్ ని తిరస్కరించాడట. ఎంతవారలకైనా తప్పని గాలి కదా. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అన్నట్టు, ఎంతటివాడైనా టాయిలెట్ కి పోక తప్పదు. నేను అవతార పురుషుడిని నేను పోను అంటే కుదరదు. విజ్ఞానం పెరిగి టాయిలెట్లు ఈ మధ్య మన దేశంలో దర్శనమిస్తున్నాయిగానీ మనవారంతా ప్రకృతి సౌందర్యారాధకులే ఒకప్పుడు. ఎటొచ్చీ ఆడవారికి టాయిలెట్లు రావడమనేది గొప్ప సామాజిక పరిణామం మనదేశంలో. ఇంతకాలం ఆడవారికి కూడా టాయిలెట్ల అవసరం ఉంటుందని మగవారు గుర్తించకపోవటం దారుణమైన విషయమే. వరల్డ్ మెన్స్ డే (world men's day) నీ వరల్డ్ టాయిలెట్స్ డే (world toilets day) నీ ఒకే రోజు (నవంబర్ 19) జరుపుకోవడంలో అసలు మతలబు బహుశా టాయిలెట్ల అవసరాన్ని మగవారికి చెప్పడం కోసమేనేమో.  ఇప్పటికీ గ్రామాలు నిప్పులతో ఉదయిస్తూండటం స్వచ్ఛభారత్ పనితీరును తెలుపుతూ  ఉంటుంది. నిప్పులు లేని భారత దేశం కోసం పనిచేయాల్సిన అవసరాన్ని లోక కల్యాణం దృష్ట్యా మనం, అంటే భారతీయులం గుర్తించాల్సి వుంది.

టాయిలెట్ కుండల ఆకారాలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. వారి వారి శారీరక అవసరాలను బట్టి ఈ ఆకారాలుంటాయనుకోవడం అర్ధ సత్యమే ఔతుంది. ఈ ఆకారాలకూ ఆ దేశ రాజకీయ దృక్కోణానికీ సంబంధం ఉందంటాడు జిజెక్. సెకండ్ వేవ్ ఫెమినిజంలో కీలక పాత్ర పోషించిన "ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్" నవలలో రచయిత్రి "ఎరికా జంగ్" జర్మన్ టాయిలెట్ల గురించి ఉటంకిస్తుంది. థర్డ్ రీచ్ లోని భయానక దృశ్యాలకూ టాయిలెట్ల ఆకారాలకూ లింక్ పెడుతుందావిడ. "ఇటువంటి టాయిలెట్లను రూపకల్పన చేసిన ప్రజలు ఎంతకైనా తెగిస్తారని" నాజీ జర్మన్లను గురించి చెబుతుంది. అంతగా జర్మన్ టాయిలెట్ల గురించి భయపడవలసిన అవసరం ఏముందని అడగవచ్చు. వుంది. భయపడవలసిన అవసరమే ఉంది. ఎందుకంటే జర్మన్ టాయిలెట్లలో మలం వెనుకకి పోకుండా ప్యాన్ మీద ముందుకు వస్తుంది. ప్యాన్ ముందు భాగంలో ఒక షెల్ఫ్ ఉంటుంది. అందులో పడిన మలాన్ని పరీక్షించండనీ, అందులో ఏమైనా నులి పురుగులూ, రక్తపు మరకలూ ఉన్నచో డాక్టరుని సంప్రదించాలనీ జర్మన్లు ఆ విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకుంటారు. ప్యాన్ లోఉన్న మలం ఫ్లష్ చేస్తేగానీ కదలదట. ఇది జర్మనులు పురాతన కాలం నుంచీ అనుసరిస్తూ వస్తున్న ఆరోగ్య సూత్రమట.  వీరి ఆరోగ్య కాంక్ష ఏమోగానీ వినడానికే జుగుప్స కలిగించేలా ఉంటుందీ పరిస్థితి. అందుకేనేమో ఈ అమెరికన్ రచయిత్రికి థర్డ్ రీచ్ నాటి మారణ హోమానికి జర్మనుల ఈ ఆకాంక్షాపరత్వమే కారణమనిపించి ఉంటుంది. జర్మన్ల టాయిలెట్స్ పరిస్తితి ఇలా ఉంటే ఇందుకు పూర్తి భిన్నంగా, ఫ్రెంచి టాయిలెట్లు వెనుక దూరంగా రంధ్రాన్ని కలిగి ఉంటాయట. ప్యాన్ మీద నుండి మలం వెనువెంటనే దూరంగా కనిపించకుండా జారిపోతుందట. ఫ్లష్ చేయనవసరం లేకుండానే ఇటువంటి వేగవంతమైన పనిని అవి చేస్తాయట. ఇక అమెరికన్ టాయిలెట్ల తీరు ఇంకో రకం. వీటిలో నీరు ఎప్పటికీ పైకి కనిపిస్తూ ఉండటం వలన, ఫ్లష్ చేయనంతవరకూ నీరూ, మలమూ ప్యాన్ మీద తేలుతూ ఉంటాయట.

ఈ మూడు దేశాలకు సంబంధించిన టాయిలెట్ల రూపానికీ ఆ దేశాల వైఖరులకూ సంబధం ఉందంటాడు జిజెక్. నిజానికి ఈ మూడు దేశాల భౌగోళిక అస్తిత్వ వైఖరులను మొదటగా అర్థం చేసుకున్న వాడు హెగెల్. జర్మనుల ప్రతిఫలనాత్మక పరిపక్వత(reflective thoroughness, )ఫ్రెంచి వారి విప్లవాత్మక తొందరపాటు( revolutionary hastiness), అమెరికన్ల ఆధునిక ప్రయోజనాత్మక ప్రాగ్మాటిజం( modern utilitarian pragmatism) వలన అవి తమ అస్తిత్వ వైఖరులను వేరు వేరుగా కలిగి ఉన్నాయంటాడు హెగెల్. జిజెక్ ఇంకో అడుగు ముందుకేసి ఆయా దేశాల వైఖరులకు టాయిలెట్ల నిర్మాణాలకూ సంబంధం చూపిస్తాడు. జర్మనులు తమదగ్గరున్న అసహ్యకరమైన విషయం పట్ల సందిగ్ధతతో కూడిన ఆలోచనలను కలిగి ఉంటారట. ఫ్రెంచి వారు అసహ్యకరమైన విషయాన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలని అనుకుంటారట. అమెరికన్లు ఆ విషయాన్ని ఒక సాధారణ విషయంగా పరిగణించి సరైన పద్దతిలో ప్రయోజనకరంగా దానిని తొలగించుకుంటారట. ఇటువంటి వైఖరే సామాజికంగా జర్మనీలో మెటా ఫిజిక్స్, కవిత్వమూ ఉదయించడానికీ, ఫ్రెంచ్ లో ఫ్రెంచి తరహా రాజకీయాలకూ, యూరోపులో ఇంగ్లీషు ఎకానమీ రావడానికి కారణమంటాడు. రాజకీయంగా కూడా జర్మనుల సాంప్రదాయ వాదం ( conservatism), ఫ్రెంచి వారి విప్లవాత్మక ఉగ్రవాదం (revolutionary terrorism) , అమెరికనుల ఆధునిక ఉదారవాదాల( modern  liberalism) ను వారి టాయిలెట్ల నమూనాలతోనే అర్థం చేసుకోవచ్చంటాడు. ఈ లెక్కన మనదేశంలో నిన్న మొన్నటి వరకూ టాయిలెట్లు లేవు కాబట్టి మన ప్రబంధ కవుల సందర్భానుచిత ప్రకృతి వర్ణనలకు కారణం లేకపోలేదనుకోవాలి.

కీ హోల్ లాగా ఉండే మన ఇండియన్ టాయిలెట్ల ఆధారంగా ప్రస్తుత మనదేశ అస్తిత్వ వైఖరిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. పైగా గ్లోబలైజేషన్ పుణ్యమా అని మనమూ వెస్టర్న్ టాయిలెట్లను ఉపయోగించటం మొదలెట్టేశాం. మన బానిస వైఖరి వలననే ఇదంతా కావచ్చు. మన సాంప్రదాయం అని చెప్పి బహిరంగ విసర్జనను సమర్థిస్తూ జల్లికట్టులాంటి ఉద్యమాలూ పొడచూపొచ్చు. కడుపు పట్టుకుని లోపలికి పోయి, చేతులూపుకుంటూ బయటకి వచ్చి..."రిఫ్లెక్ట్స్ మై స్టైల్" అని సోనమ్ కపూర్ చెప్పినట్టు మనం కూడా అవసరం తీరిన తరువాత బోడి మల్లన్న అంటూంటాం. మనదేశంలో ప్రజాస్వామ్యం ఓటరు ఓటేసేంత వరకే..ఓటేశాక రాజకీయనాయకులు ఐదేల్లు చేతులూపుకుంటూ గడిపేయడమే చేస్తుంటారు. మన పబ్లిక్ టాయిలెట్ల ప్యాన్ లు తెల్లగా తళ తళ మెరిసినపుడు మన దేశానికి నిజంగా స్వచ్ఛ భారత్ ఒచ్చినట్టు. టాయిలెట్ రూంలలో అసలు వాసనతో పాటు, సిగరెట్, పాన్ మసాలా వాసనలు అదనం. తలుపుల మీద పెన్నుతో గీసిన బూతు బొమ్మలు ఉచితం. ఆ విధంగా చూచినపుడు ప్రపంచంలో మన టాయిలెట్లు చివరినుండి అత్యత్తమ స్థానాన్ని సాధిస్తాయేమో. "ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయి" అని కలలుగానే హైటెక్ ముఖ్యమంత్రిగారు సీసీ కెమెరాలతో టాయిలెట్ల పనితీరును పునరుద్ధరిస్తానని అనుకోవడం బహుశా గతం తాలూకు "వాసనలే" కావచ్చు.  ప్రపంచంలోకే అత్యుత్తమ టాయిలెట్లు జపాన్ సొంతమట. జపాన్ తరహాలో బుల్లెట్ ప్రూఫ్ ట్రైనులు మనకొద్దులేగానీ, ఏలిన వారు జపాన్ తరహాలో టాయిలెట్లు అభివృద్ధయ్యేలా చూస్తారని కోరుకుందాం. ప్రజలు చైతన్యవంతులై తమ నిత్యావసరాల విషయంలో పోరాడకపోతే కుర్చీలెక్కే ఏలినవారు తమ కుర్చీల కింద రంధ్రాలు చేసుకుని మరీ కూర్చుంటారనేది సత్యం. అయిదు నిమిషాల కంపు స్థానే అయిదేండ్ల కంపును భరించకతప్పని పరిస్థితి రాకుండా చూసుకుందాం.

6/4/17
Virinchi virivinti
విరించి ll  పీకేసిన కళ్ళు ll
...............................
తెరిచివుంచిన కనురెప్పల్లోంచి
నిన్ను చూస్తూనే ఉన్నాడు కదూ అతడు..
నీవు గమనించి ఉండవు తల్లీ..!
కనుగుడ్లే లేవు కదమ్మా..!!
కలలను దాచుకున్న కళ్ళు
కన్నీటిని ఆపుకున్న కళ్ళమ్మా అవి.
నిను చూశాడని పీకేశారు కదమ్మా...!
ఈ చీకటిని భరించగలవా తల్లీ..!!

పక్కటెముకలు విరిచేయబడి
మర్మావయవాలు చీల్చేయబడి
వివస్త్రుడై నిర్లజ్జగా కదలలేని
పాషాణ శవంలా కనిపిస్తున్నాడు కదూ...!
అతడు శవం కాదమ్మా
బతికున్న వారి అసలు రూపాన్ని చూపిస్తున్న శిల్పే అతడు.

ఒకప్పుడు బుడి బుడి అడుగులు వేసిన బుడతడే అతడు
అమ్మకు ముద్దుముద్దు మాటలు చెప్పిన చిన్నారే అతడు
వేల ఆశలను, భవ్య జీవితాన్నీ భుజానికెత్తిన యువకుడతడు
మధురోహల స్వప్నాలతో నీముందు వాలిన సుందరుడతడు
ఏం మిగిలిందమ్మా ఈరోజు ..?

మరచి పోక తప్పదు కదా తల్లీ...!
ప్రేమను చిదిమేసినా, నీ జీవితం జీవించక తప్పదు
నీకథ నీవారిమధ్యే మళ్ళీ మొదలుకాక తప్పదు
ఈ దేశం ఆవల, మరేదేశంలోనో..
ఈ వెంటాడే గుర్తులను నీవు వదిలేయక తప్పదు
కానీ పీకేసిన కళ్ళ వెనుక వేలాడిన కలలిపుడు
ఈ కలంతో నిన్నడుగుతున్నాయి ఓ చివరి కోరిక
అమ్మా...!ఈ దేశంలో తల్లులు కులాలను కంటారు
ఆ దేశంలోనైనా నీవు పిల్లలను కంటావు కదూ....??

31/3/17
ప్రాథమిక విద్య ఏ భాషలో ఉండాలి?.

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ బోధన తీసివేసి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే చదువు కొనసాగాలని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది. జీ.వో.332 తీసుకు వచ్చి అన్ని మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టారు. దానికి విద్యాశాఖా మంత్రిగారు ఇచ్చిన వివరణ " ఎంసెట్ ఎంట్రెన్స్ లో సబ్జెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఇంటర్మీడియేట్ బుక్స్ లో ఉండవు. ఆ అప్లికేషన్స్ చదవాలంటే రకరకాల బుక్స్ చదవాలి. అవన్నీ ఇంగ్లీషులో ఉంటాయి కాబట్టి పిల్లలకు ఒకటో తరగతినుండి పదవతరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలి" అని. అంత పెద్ద నిర్ణయానికి ఈ చిన్న సమర్థన అది కూడా ఏ మాత్రం పొసగని సమర్థన ఎందుకో అర్థం కాలేదు. పైగా రాష్ట్రంలోని మేధావి వర్గంలో ఈ నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత వచ్చినట్టు కూడా కనబడలేదు. ఒకటి రెండు రోజులు ఉపాధ్యాయ సంఘాల నిరసనలు తప్ప, మరే కోణం నుంచీ అభ్యంతరాలూ రాలేదనిపించింది. దీనిపై మేధావి వర్గాల చర్చలు గానీ, పునస్సమీక్షలుగానీ అటు మీడియాలో ఇటు ప్రజలల్లో కనిపించలేదు. చర్చలు ఎలాగూ అసెంబ్లీలో జరగవు, ఈ విషయం మీద మాట్లాడాలని ప్రతిపక్షాలు నోరు తెరిచినట్టు కూడా అనిపించలేదు. చర్చలు జరగకపోవటం ప్రజాస్వామ్యంలో ఏక పక్ష నిర్ణయాన్ని ఆమోదించటం ప్రజల రాజకీయ సామాజిక చైతన్య రాహిత్యాన్ని సూచిస్తూ ఉంటుంది.

ఒక వైపున తెలుగు మీడియం అనవసరం, ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాభ్యాసం జరగాలి అనే వాదన బలంగా, అర్థవంతంగా కూడా ఉంది. డబ్బున్న వారు వారి పిల్లలను ఇంగ్లీషు మీడియం లలో చదివించడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ లో సులువుగా రాణించగలుగుతున్నారనీ, అదే బీదవారి పిల్లలు తెలుగు మీడియం చదివి, హయ్యర్ ఎడ్యుకేషన్ లో చతికిల పడుతున్నారనీ, ఇంగ్లీషును డిమాండ్ చేసే ప్రైవేటు సంస్థలలో ప్రవేశం పొందలేకపోతున్నారనీ అందువలన గవర్నమెంటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరగటం స్వాగతించ వలసిన అంశమనీ వారంటారు. మనదేశంలో ధనిక పేద అంతరాలకు కులాల వెనుకబాటుతనాలూ జోడై ఉంటాయి కనుక, కొన్ని కులాల వారికీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అందని ద్రాక్షే అయిందన్నది వాస్తవం. సామాజిక అంతరాలను అడ్రస్ చేసే ఇటువంటి వాదన పూర్తి సమర్థనీయమైనది. పైగా మాతృభాష పరిరక్షించాలని అందుకు విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్లోగన్లు ఇచ్చేవారు, వారి పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూండటంతో మాతృభాష పరిరక్షణ కేవలం పేద విద్యార్థులేదేనా అనే సంశయమూ మొదలవుతుంది. అటువంటి వారి హిపోక్రసీనీ దాని వెనుక ఒక మెజారిటీ సెక్షన్ వారిని చదువుల పోటీకి దూరంగా ఉంచే కుట్రనీ ఈ వాదన గుర్తిస్తుంది. అందువలన సర్కారీ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన సమాజంలో సమానత్వాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో ఈ మార్పును ఈ వాదన స్వాగతిస్తుంది.

అయితే దీనికి వ్యతిరేకంగా, ఏ మాధ్యమంలో చదవాలన్నది గవర్నమెంటు శాసించటమేమిటని ఇంకో వాదన. విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ తమకు తోచిన మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు ఉండాలి తప్ప మొత్తం ఒకటే మాధ్యమం ఉండాలనేది సరైనది కాదు. ఇది బలం లేని వాదనలా అనిపించినా మూలాలకు పోయినపుడు ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాథమిక విద్య ఎందులో జరగాలి అనే అంశం మీద రీసెర్చ్ కూడా జరిగింది. రీసెర్చ్ లో తేలిన అంశాలు క్రమానుగుణంగా ఎలా మార్పు చెందాయో కూడా గమనించవలసి ఉంది.

సాధారణంగా చిన్న పిల్లలకు విద్య ఇంటి వద్దే మొదలవుతుంది. పాఠశాల అనేది ఆ విధంగా మొదలైన విద్యను ముందుకు తీసుకెళ్ళే ప్రక్రియలాగా ఉండాలి. విద్య నెరపడం వారి ఆటలో భాగం కావాలే తప్ప చిన్నారుల లేత మనసుల మీద అది భరింపరాని భారం కాకూడదు. ప్రపంచంలో ఈ రోజు రెండు బిలియన్ల  (రెండువందల కోట్లు) చిన్నారులున్నారు (పదిహేనేల్ల లోపు). వీరు మొత్తం ప్రపంచ జనాభాలో ఇరవై ఏడు శాతం. వీరిలో అట్టడుగు వర్గాలకు చెంది, కనీసం చదువు అందుబాటులో కూడా లేని పిల్లలు దాదాపు ఎనిమిది కోట్లు. అంటే వీరు ఎటువంటి విద్యా సంస్థలల్లో ఇప్పటి వరకు ప్రవేశం పొందని వారు. ఇక స్కూలు లో ప్రవేశం పొంది చదువు పూర్తి చేయని వారి శాతం( డ్రాపవుట్స్) ప్రపంచ వ్యాప్త డేటా తెలీదుగానీ, ప్రపంచంలో సౌత్ ఏషియా ముప్పై మూడు శాతం డ్రాపవుట్స్ తో ప్రథమ స్థానంలో ఉంది. ఇందులో పాకిస్థాన్ అత్యధికంగా ముప్పై ఎనిమిది శాతం కాగా, కేవలం బాలికల డ్రాపవుట్ శాతం ఆ దేశంలో అత్యధికంగా నలభై ఒక్క శాతంగా వుంది. మన దేశంలో పరిస్థితి కూడా ఈ డ్రాపవుట్ ఇంచుమించు ముప్పై శాతం మీదే ఉంది. ముఖ్యంగా డ్రాపవుట్స్ రెండవ తరగతి లోపలే ఎక్కవగా ఉంటున్నాయంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. యునెస్కో అంచనా ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగకపోవటమే దీనికి కారణం. అందుకే 1953 నుంచి యునెస్కో పిల్లలను మాతృ భాషలో చదవించటమే ఉత్తమమని నొక్కి వక్కాణించింది. మాతృభాషలో విద్య నెరపటం వలన విద్యాలయాల్లో చేరే అవకాశమూ, చదువులో విజయావకాశమూ పెరుగుతాయి అని యునెస్కో రీసెర్చి చెబుతోంది. ఎందుకంటే చిన్నారులకు మాతృభాషలో విద్య నేర్పడం కేవలం వారి సాంస్కృతిక మూలాంశాన్ని అందించడమే కాక, ఎదగబోయే మనిషిగా విద్య ఒక ఆనందకరమైన అంశంగా తయారవుతుంది. చిన్నలేలేత వయసులో అర్థం కాని తెలియని భాష, దానిని అందుకోలేని అశక్తతా వారిలో తెలియని డిప్రెషన్ ని స్ట్రెస్ నీ కలిగిస్తాయి. అంతే కాకుండా ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు కూడా ఆ చిన్నారుల చదువులో పాత్ర వహించే అవకాశము పెరగటంతో "ఇల్లు- స్కూలు -విద్యార్థి ట్రయాంగిల్" సమర్థవంతంగా పనిచేయడం మొదలవుతుంది. అటువంటి తల్లిదండ్రులు స్కూలులోని గురువులతో సరిగా మాట్లాడగలుగుతున్నారని కూడా ఈ స్టడీ చెబుతోంది. యునెస్కో ఉద్దేశాలలో పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థులను ఎన్రోల్ చేయించటమే కాదు, వారి చదువును కొనసాగించడం కూడా.

ఇక ఇంగ్లీషులో చదివితే కాంపిటీటివ్ ఎక్జామ్స్ లో సీటు వచ్చేస్తుంది అనుకునే వారు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషలో కాకుండా డామినెంటు భాషలో విద్యను అందించాలని ఉవ్విల్లూరుతున్నారు. వారి సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య జరిగిన యునెస్కో కాన్ఫరెన్సు గత ముప్పై యేండ్లుగా చేసిన రీసెర్చిని బయటపెట్టింది. భాష నేర్చుకోవడానికి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న సూత్రాలను అందించింది. అవేంటో ఇపుడు చూద్దాం.

       *  "సాధారణంగా ఒక విద్యార్థికి మాతృ  భాషలో పట్టు సాధించడానికి పన్నెండేళ్ళు పడుతుంది. పన్నెండేళ్ళ లోపు ఒకవేళ ఆ పిల్లలు మాతృభాష కాక వేరే భాష చదవాలనుకుంటే, మాతృభాషలో విద్యను మాత్రం ఆపేయకూడదు. కొత్తగా నేర్చుకుంటున్న భాష కేవలం అదనపు భాషగా ఉండాలే తప్ప మాతృభాషలోనే చదువు సాగాలి". ఉదాహరణకు తెలుగు మీడియంలో చదివే పిల్లవాడు ఇంగ్లీషును అదనపు బాషగా నేర్చుకుంటాడు. సామాన్య, సాంఘీక, గణిత శాస్త్రాలను తెలుగులోనే నేర్చుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు తెలుగులో చదవటం వలన ఆ భాషమీద పట్టు ఏర్పడుతుంది.

       *"శాస్త్ర విషయాలను మాతృ భాషలో కాక వేరే భాషలో కూలంకషంగా అవగాహన చేసుకోవడానికి ఆ కొత్త భాషను పిల్లలు దాదాపు ఏడు సంవత్సరాలు చదివ వలసి ఉంటుంది". ఇంతకు ముందు ఉదాహరణే తీసుకుంటే తెలుగు మాధ్యమంలోనే గణితాది శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం పెంచుకోవడం వలన పిల్ల వాడి మీద అదనపు భారం పడదు. ఇపుడు అతడు కొత్తగా ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వలన, పైన చెప్పిన రీసెర్చి ప్రకారం ఇంగ్లీషు భాషలోని పదాలనూ, అర్థాలనూ, పలికే విధానాన్నీ అవగాహన చేసుకోవడం అదనపు భారం కావడం, ఏడు సంవత్సరాలు కేవలం భాషను అవగతం చేసుకోవడంలోనే గడిచిపోవడం వలన గణితాది శాస్త్రాల మీది అవగాహన పైపైనే ఉండిపోతుంది తప్ప, లోతైన సంపూర్ణావగాహన ఉండదు.

    *"మాతృభాష మీద పట్టు సాధించిన వారు, చాలా సులువుగా రెండవ భాషను నేర్చుకోగలుగుతున్నారని ప్రపంచ వ్యాప్త స్టడీలు చెబుతున్నాయి. ట్రాన్స్లేషన్, ట్రాన్సిషన్ అనే విషయాలను ఈ సందర్భంగా గుర్తించాలి". చిన్నప్పటి నుండి తెలియని భాషలో చదువే విద్యార్థి ప్రతీ పదాన్నీ, ప్రతీ విషయాన్నీ తన భాషలోకి అనువాదం( ట్రాన్స్లేషన్) చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సమర్థవంతంగా చేసుకోలేని విద్యార్థుల విషయావగాహన నామ మాత్రంగానే ఉంటుంది. కానీ అలాకాక మాతృభాషలో చదువుకోవడం వలన విషయావగాహన విస్తృతంగా పెంచుకోగలిగిన విద్యార్థి ఇంకో భాషలోకి అదే విషయాన్ని చాలా సులువుగా (ట్రాన్సిషన్) మార్చుకోగలుగుతాడు. ట్రాన్సిషన్ ట్రాన్స్లేషన్ అనే ఈ రెండు విషయాలనూ అవగతం చేసుకోకపోవడం వలన ఎప్పుడో పెద్దగయ్యాక ఇంగ్లీషు మీడియంలోకి మారటం కష్టమేమో అనే అనవసర భయం సృష్టించబడింది. మొన్న విద్యాశాఖా మంత్రిగారి మాటలు దాదాపు ఈ భయాన్ని పిల్లలలో తల్లిదండ్రులలో కలిగించేదిగా వున్నాయి.

    *"కేవలం ఒక భాషలోనే విద్య గరిపేవారికన్నా..మాతృ భాషలో విద్య నేర్చుకుంటూ ఇతర భాషలను అదనంగా నేర్చుకునే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని గ్రహించడం జరిగింది".

ప్రపంచ వ్యాప్తంగా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ బ్రిటన్ వంటి దేశాలనుంచే ఎక్కువగా మేధావులు శాస్త్రజ్ఞులు ఉదయించారు. వారి మాతృభాషలోనే వారి శాస్త్రావగాహన ఉండటమందుకు కారణం. పిల్లలను భవిష్యత్తు ఉద్యోగాల కోసం తయారు చేయడమా లేక వారిని శాస్త్రాది విషయావగాహన గల పరిపూర్ణ మానవులుగా చూడగలగటమా అన్నది మనం ఆలోచించాలి. ఏరకంగా చూసినా మాతృభాషలో విద్య దాని గొప్పదనమూ నిరూపితం అవుతూనే ఉన్నాయన్నది వాస్తవం.

28/3/17
Virinchi  virivinti
విరించి ll   అతడూ నేను ll
-----------------------------------------------
అతడు నాతో పెద్దగా మాట్లాడిందీ లేదు
మాట్లాడటానికని ఉత్సుకత చూపిందీ లేదు
కానీ నన్నెందుకనో ద్వేషిస్తూంటాడతడు
మనం అనుకోకుండా జరిగినదెప్పటికీ మనకు ఆశ్చర్యకరమే

బహుశా అతడు శుక్ల పక్షపు చంద్రుడేమో...
వెన్నెల చేతిలోంచి జారవిడిచిన అమావాస్యను నేను

ఎండలో ఎంతగా ఆడుకుంటాడో అతడు
నేనేమో  నీడలో కూర్చుని అలసిపోయివుంటాను
నీడలో తననూ సేదదీరమని ఎంతగా సైగ చేస్తుంటానో
తనతో ఆడుకోమని అతడెపుడూ పిలిచిందీ లేదు
నేను అడిగిందీ లేదు

బహుశా నేనతడిని తప్పుగా చదివుంటానేమో
నిశ్శబ్దంగా నింపాదిగా చదవడం నాకలవాటు కాబట్టి

ఒంటరి రాత్రుల్లో అతడు నాచేతిలో పుస్తకమౌతూంటాడు
నేనతడి కవితలో ఒక పదమైనా అయ్యానేమోనని వెతుకుతుంటాను

ద్వేషమనే పదం దొర్లకుండా కవిత్వం రాస్తాడతడు
క్షమించడం తెలియని బరువైన మనసులకెన్ని జాగ్రత్తలవసరమో..

పదాలకు గుణాలద్దుతూ  గుంభనంగా రాస్తాడతడు
పితూ రీలు మోసే కలాలకెన్ని తలుపులవసరమో..

అతడు నన్నో, నా రంగునో, నా పేరునో చూసి
చూశావా నీవెంత దూరమో నాకు అంటూంటాడు
మేమిద్దరమూ ఎంత దగ్గరో చెప్పడానికి
ఆకాశాన్ని చూపిస్తుంటానతడికి.

12/4/17

Saturday, 8 April 2017

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

Sunday, 26 March 2017

పవన్ మళ్ళీ మోసపోయాడు
------------------
(సినిమాను సినిమాలాగా చూడాలనే పాత చింతకాయ పచ్చడి సొల్లు డైలాగులు చెప్పే గుండెపోటు గుమ్మడి క్యారెక్టర్లు ఇక్కడ  కామెంట్లు చేయకండి.)

మనమెవరైనా బంధువుల ఇంటికి పోతుంటాము. అపుడపుడే ముద్దు ముద్దు మాటలు మాట్లాడే చిన్న పిల్లలు గనుక వాళ్ళ ఇంట్లో ఉండింటే, సాధారణంగా ఒక సీన్ మొదలవుతుంటుంది. వచ్చిన వారికి ఆ సదరు బుజ్జిపాపల పాండిత్య ప్రకర్షను ప్రదర్శించటానికి ఆ ఇంటి వారు పూనుకుంటారు. కొన్ని ఇంగ్లీషు పద్యాలూ, సంస్కృతం శ్లోకాలు ఆ చిన్నారితో చదివిస్తూ ఉంటారు. ఎబిసిడీలు, అఆఇఈలూ, వన్టుత్రీలు కూడా వచ్చిచేరుతుంటాయి. సిగ్గు పడుతూ నో, చెప్పమన్నారు కాబట్టి దిక్కులు చూస్తూనో, భయం భయంగానో ఆ చిన్నారి అన్నీ చెబుతూ   ఉంటుంది. మధ్య మధ్యలో ఆ చిన్నారి ఏదైనా చెప్పలేక పోతేనో, మరచిపోయినట్టుగా అనిపిస్తేనో, మనం 'అబ్బే అస్సలు లాభం లేదు' అంటామేమో అనేంత ఆతృతతో వాళ్ళమ్మ అక్కడక్కడా పదాలను అందిస్తూ ఉంటుంది. పైగా తనేమీ అందివ్వలేదన్నట్టు మనవైపు చూస్తూ ఉంటుందావిడ. అయినా పాప సరిగా చెప్పలేకపోతే, ఇపుడే నిద్ర లేచింది అందుకే డల్ గా ఉందనో, మీరు కొత్త కాబట్టి సిగ్గు పడుతుందనో సరిబుచ్చుతూ  ఉంటుంది. 'లేకుంటేనా అసలు..!!'అనే స్వరం ఆ సరిబుచ్చటంలో వినిపిస్తూ ఉంటుంది. వింటున్న మనకూ బాగుంటుంది. చిన్న చిన్న పెదాలతో వచ్చీరాని మాటలతో మనల్ని కట్టిపడేస్తూ ఉంటారు పిల్లలు. ఒకవేళ ఆ కార్యక్రమానికి మనమే మొదటి అంకుల్ అయుంటే పరిస్థితి ఇంకో రకంగా తయారు కాక తప్పదు. ఆ తరువాత ఫంక్షన్ కి వచ్చే ప్రతీ అంకుల్ లేదా ఆంటీల ముందర ఈ కార్యక్రమం మొదలవుతూ  ఉంటుంది. 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్' మళ్ళీ మొదలవుతుంది కానీ ఈ సారి ఇంకో అంకుల్ కోసం అన్నమాట. ఇక ఆ పై వచ్చిన ప్రతీ ఆంటీ అంకుల్ దగ్గర మొదలైపోతే మొదలొచ్చిన ఆంటీ అంకుళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. పెదవుల పైన నవ్వు తగిలించుకుని వాచీల వైపు పదే పదే చూసుకుంటూ ఈ ప్రోగ్రాం ఎపుడెపుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తల్లి ఆతృత, మురిపెం అపుడు మెలి మెల్లిగా 'అబ్బా..'అని విసుగుదలగా మారుతూ  ఉంటుంది. ఆనందంలో ఊయలలూుతున్న ఆ తల్లికది తెలియకపోవచ్చు. కానీ వచ్చిన వారికి బలవంతంగా కూర్చోబెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ నూ, కాటమ రాయుడు సినిమానూ చూస్తున్నపుడు ఇటువంటి పరిస్థితులు గుర్తుకొచ్చాయి.

ఒక బిజినెస్ చేసే సంస్థ ఒక ఊరిలో ఏదో పరిశ్రమ కడదామనుకుంటారనుకుంటా. వాళ్ళకి అక్కడి లోకల్ లీడర్ అనబడే కాటమ రాయుడి పర్మిషన్ కావాలిట. అమరావతిలో వలె రైతుల భూములను లాక్కుని బడాబాబులు వారి వారి పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నించినట్టు ఈ బడాబాబులు ఈ చిన్న ఊరిలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒస్తారన్నమాట. ఎమ్ ఓ యూలు పట్టుకుని సీ.ఎం. ముందు లైనుగా నిలబడిన పారిశ్రామిక వేత్తల ఫోటోలు చూసిన మనకు, 'ఈ లోకల్ లీడర్ ఒప్పుకుంటేనే సాధ్యం' అనేది ఎట్లానో అర్థం కాదు. రైతుల భూముల్ని కాపాడటం అనే అంశంతో మనకు ఈ లోకల్ లీడర్ కనిపిస్తాడు. వచ్చిన పారిశ్రామిక వేత్తలు కూడా వారి ప్రాజెక్టేమిటి, ఎందుకు ఈ లోకల్ లీడరు అడ్డుపడుతున్నాడు అనే అంశంతో రారు. ఏకంగా ఏసేయ్యడానికే వచ్చేస్తారు. లోకల్ లీడర్ రాగానే లేచి నిలబడాలని ఏదో డిక్షనరీలో రాశారు అన్నంత బిల్డప్ సృష్టిస్తాడు డైరెక్టరు.లీడరుగారు వచ్చి కుర్చీలో కాలు మీద కాలేసుకు కూర్చుని తన అధికారాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ ప్రాజెక్ట్ చర్చలూ ఇత్యాదివేమీ ఉండవు. సంబంధం లేకుండా పశువులకు సంబంధించిన మాటల రూపంలో ఈ ప్రాజెక్టు తనకు ఇష్టం లేదని చెప్పడం అక్కడ హీరోయిజం. సభ్యత గా ప్రవర్తించడం హీరోయిజం కానంత వరకూ ఇదే హీరోయిజం అని మనకు దర్శకుడు చెప్పాలనుకుంటాడేమో. అక్కడో ఫైటు. సర్కార్ రాజ్ సినిమాలో ఇటువంటి సీన్ ఉంటుంది. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి ఒక ఎలక్ట్రిసిటీ ప్లాంట్ నిర్మించాలని ఒక బడాబాబు ఆలోచిస్తాడు. దానికి లోకల్ లీడర్ అడ్డు  . ఆ లోకల్ లీడర్ రాజకీయాలు సీ.ఎమ్. ని కూడా శాసించేలా ఉంటాయి. అపుడు ఆ పర్మిషన్ కోసం ఏకంగా సీ.ఎమ్. తో పాటు వస్తారు ఆ పారిశ్రామిక వేత్తలు. చర్చ జరుగుతుంది. ఈ ప్లాంటు ఎంత గొప్పదైనా, భవిష్య తరాలకు ఎంత ఉపయోగపడినా, వేల మంది నిర్వాసితులను ఒకేసారి వీధిపాలు చేస్తుంది కాబట్టి నేను ఒప్పుకునేది లేదని తేల్చేస్తాడు. ఎక్కువగా మాట్లాడితే సీ.ఎమ్. కుర్చీలో నీవు కూడా ఉండవు అనేంత శక్తి ఉన్న లీడర్ గా ఆ పాత్రను చూపిస్తారు. మహారాష్ట్రలో ఆ పాత్ర ఎవరిదో మనకందరకూ తెలిసినదే.

ఈ ఇంట్రడక్షన్ సీన్ తరువాత అసలీ లోకల్ లీడరెవరు అనేది మనకు అర్థం కాదు. వార్డు మెంబరా, సర్పంచా, ఉప సర్పంచా, ఎమ్పీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేనా?...ఏమో...ఒక సీన్ కే లోకల్ లీడర్ అన్నమాట. ఆ తరువాత ఎక్కడా బహిరంగ సభల్లో మాట్లాడటమో, పార్టీ మీటింగుల్లో వాణిని వినిపించడమో, సమస్యలతో ప్రజలు అతడిని శరణుజొచ్చడమో అటువంటివేమీ లేని ఒక లోకల్ లీడర్ ని దర్శకుడు మనకు చూపిస్తాడు. అతడికి నలుగురు సోదరులు. ఏమి చదువుకున్నారో, ఏమి చేస్తున్నారో మనకు అనవసరం. కానీ వారందరూ చదుకోవడానికో వ్యవసాయం చేసుకోడానికోగానీ, హీరో అన్నం తినకుండా ఛాయ్ తాగి పెంచుతాడన్నమాట. కానీ వాళ్ళ అన్నని ఎవరైనా ఏమైనా అంటే మూకుమ్మడిగా దాడి చేసి కుటుంబ బంధాలనూ, అనుబంధాలనూ ఆ విధంగా చూపిస్తారన్నమాట. ఈ సదరు లీడరుకి ఆడవారంటే పడదు. ఎందుకో..ఏమ్మాయరోగమో అనుకునేలోపల బ్లాక్ అండ్ వైట్ లో పదేళ్ళు నిండని పసి పిల్లల మధ్య ప్రేమ భావనలున్నట్లు చూపించేస్తాడు దర్శకుడు. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలను భారంగా మోస్తాడేమో గానీ దానికీ, ఆడవారంటే పడకపోవడానికీ సంబంధం బొత్తిగా అర్థం కాదు. ఇంతలో ఎదురింటిలో దిగిన ఒక క్లాసికల్ సింగర్ కం డాన్సర్ కం, పక్కనోడు ఏ సొల్లు చెప్పినా నమ్మేసే అమాయకురాలు కం, అహింసా మార్గమంటే బీభత్సమైన నమ్మకమున్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి కం, పాటలల్లో లోదుస్తులు కనబడేలా ఎక్స్పోజింగ్ చేయగల సమర్థురాలు కం, అందం కోల్పోయిన అందగత్తె అయినటువంటి ఓ హీరోయిన్ వస్తుందన్నమాట. ఆ అమ్మాయిని  ఈ అన్నయ్యకు తగిలించడానికి ఈ సోదరులు పడే తంటాలతో సింహభాగం మొదటి భాగం. ఆడవారంటే అన్నయ్యకు పడదంటూనే నలుగురూ ఒక్కో అమ్మాయిని ప్రేమికురాలిగా కలిగి ఉండటం మనకు అందించే కామెడీ అన్నమాట.

ఇక రెండవ భాగంలో ఆ అమ్మాయి ఇంటికి పోవడం, అక్కడొక స్కూలు విషయంలో హీరో గారి గొప్పదనం ద్వారా పని జరిగిపోవటంతో హీరోయిన్ తండ్రి కాబోయే అల్లుడు గారి శాంత స్వభావానికి ఉబ్బితబ్బిబ్బై పోవడం. ఆ సీన్ లో హీరోని ఎవడో అనామకుడు అనుకున్న ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ కాల్ చేయడం. కాటమరాయుడి పేరు వినబడగానే ముందు కాళ్ళు మొక్కమని అవతలి వ్యక్తి ఇవతలి వ్యక్తిని పురమాయించడం, ఇతడు వెంటనే కాటమరాయుడి కాళ్ళు పట్టుకోవడం చూస్తే ఎప్పుడో అంతరించిన ఫ్యూడల్ భావజాలాన్ని ఈ ఆధునిక కాలంలో ఎందుకు పట్టుకు వేల్లాడుతున్నారో అర్థం కాదు. ఆ సదరు వ్యక్తి పేరులో గౌడ్ అని ఒక కులాన్ని సూచించేలా ఎందుకు పెట్టారో కూడా తెలియదు. వెంటనే అవతలి ఫోన్ లోని వ్యక్తి కూడా వచ్చేసి కాటమరాయుడి కాళ్ళు పట్టుకోవడం చూస్తుంటే, అసలు దర్శకుడు ఈ కాలం వాడేనా లేక ఫ్యూడల్ యుగం నాటి వాడు టైం మెషీన్ లో ఈ కాలానికి వచ్చి తిష్టవేశాడా అనిపిస్తుంది. ఇక రెండవ భాగంలో రెండవ సగమంతా, అహింసా మార్గం లో పోయే హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న హింసాయుత వాతావరణాన్ని హీరో అండ్ అతడి సోదరులూ వారికి తెలియకుండానే తొలగిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో హింసా మార్గంలో ఉన్నాడని తెలుసుకున్న ఆ కుటుంబం అతడిని వెలివేస్తుంది. అయినా హీరో కదా అసలు నిజాన్ని చెప్పడన్నమాట. మనసులోనే దాచుకుంటాడు. వెంకటేష్ 'రాజా' సినిమాలోలాగా సెల్ఫ్ సింపథీని హీరో ప్రదర్శించక పోవటం ఒక శుభ పరిణామం. కానీ హీరోయిన్ తండ్రి పూర్తి ఆపదలోకి  రాగానే హీరో మరలా రావడం. ఆ దుండగులనందరినీ చంపేయడం. అపుడు చివరిగా "బాబూ...మాకోసం ఇదంతా చేశావా" అంటే..అవును అని ఒక ముక్కలో చెబితే బాగోదు కాబట్టి, రెండు భారీ డైలాగులతో సినిమాని ముగించటం.

ఏమి చెప్పదలుచుకున్నాడు దర్శకుడు?. ఇంకా ఈ పాత కథలు ఎందుకు రాసుకుంటున్నారు?. తెలియదు. ఈ సినిమాకు ఏకైక బలం పవన్ కళ్యాణ్.  తెలుగులో అంత స్టైలిష్ హీరో లేడనే చెప్పాలి. దాసరి నారాయణ రావు కూడా గబ్బర్ సింగ్ సినిమా చూసి ఇదే మాటన్నాడు. అంతో ఇంతో సామాజిక దృక్పథం ఉన్న హీరో కూడా అతడేనేమో బహుశా. అతడికి ఈ సినిమాకూ ఎక్కడా పొసగదు. ఒక బంగారాన్ని దగ్గర పెట్టుకుని ఇత్తడి కథలు తీయడం, దానిని ఫ్యాన్స్ అనే వారు బలపరచటమూ చూసినపుడు, తెలుగు సినిమా దిశ ఎటు అనేది అడగాలనిపిస్తుంది. బాధ్యతాయుతమైన హీరోలుగా మన హీరోలు మారటం ఎంతో అవసరం అనిపిస్తూంటుంది. చిన్న పిల్లలు ఏది చేసినా బాగుంది బాగుంది అని తల్లి అంటుంది. తల్లికాబట్టి. అది అందరికీ చూపాలనుకుంటుంది. తల్లి కాబట్టి. పర్వాలేదు. కానీ పదే పదే అదే చూపాలి అనుకోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఎంతకాలం పవన్ వంటి హీరోతో చేసిందే చేయిస్తారు అని నా ప్రశ్న. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ విన్న కథలలో ఇదే ఉత్తమ కథ అయుంటుంది. అందుకే అతడు మోసపోయాడు. ఇదే ఉత్తమ కథ అయినట్టైతే అసలు పరిశీలనకు వచ్చి రిజెక్ట్ అయిన కథల పరిస్థితి ఇంకెంత దారుణమో ఆలోచించాలి. పవన్ వంటి సామాజిక స్పృహ ఉన్న హీరో మీద సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఫ్యాన్స్ కోసమే సినిమా తీసేట్టయితే ఇంక సినిమా తీసి రిలీజ్ చేయడమెందుకు, ఫ్యాన్స్ ని అందరినీ ఒక థియేటర్ లో కూర్చోబెట్టి ప్రదర్శస్తే సరిపోతుందిగా. పవన్ ఈ సమాజం కోసం సినిమా తీయాలి. ఆధునిక యుగంలోని సామాజిక వాస్తవిక జీవితాలకు దృశ్య రూపం ఇవ్వాలి. ప్రజలను ఆలోచింపజేసే సినిమాలు తీయాలి. పవ'నిజం' అలా మొదలుకావాలి.

26/3/17
Virinchi virivinti.
ధ్యావుండా....

"దేవుడా...నువ్వున్నావని నమ్ముతున్నాను" అని దేవునికి తెలియ చెప్పాలనుకోవడమే భక్తి
దానిని దేవునికి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నానని పది మందికీ చూపుకోవడం నిష్ఠ
ఆ విధంగా చూపుకున్నది అవతలి వాడిని కూడా మార్చేసి తన మార్గం వైపుకు మరలేలా చేస్తుందనుకోవడం ఆచార్యత్వం
అలా పదిమందిని పోగేసుకుని దేవుడి గురించి సొల్లు కబుర్లు చెప్పుకోవడం..కల్ట్.
వారిలో ప్రతీ ఒక్కరినీ ఇంకో పది మందిని (వీలైతే మందని) పోగేసుకురమ్మని పురమాయించడం ప్రచారం
అటువంటి వారు చెప్పే కాకి కబుర్లు విని ఊగిపోవడం వారితో కలిసి 'పోవడం' మతానందం
అనుభవించిన ఆ వెర్రి ఆనందమే అందరికీ కలగాలనుకోవడం మత జాడ్యం
ఈ పిచ్చానందాన్ని పదిమందికీ పంచి డబ్బు పోగేయటం మత వ్యాపారం
ఈ ఆనందాన్ని ఇలాగే, ఈ చెప్పబడిన దేవుడితోటే పొందావో సరి, లేదంటే నా చేతిలో చచ్చావే పో...అనుకోవడం మతోన్మాదం.
ఈ దైవానందం నాకు మల్లేగాకుండా ఇంకో రకంగా పొందాడో వాడు ముమ్మాటికీ శత్రువే , అనుకొని  వాడిని చంపేయడమే మత తీవ్రవాదం.

హమ్మయ్య......
మతాల మతలబులు ఇలా దొరుకుతాయనుకోలేదు.

Wednesday, 22 March 2017

ఇద్దరు మిత్రుల రసవత్తర నాటకం.
------------------------------------------------

ఇళయరాజా, బాలు కావాలసిగానే కాపీ రైట్ విషయాన్ని తెరమీదకు తెచ్చారని నా అవగాహన. వారిద్దరూ మంచి మిత్రులన్నది అందరికీ తెలిసిన విషయమే. అటువంటపుడు కాపీ రేట్స్ మీద గొడవపడవలసిన అవసరం ఉండదనుకుంటాను. ఇక ఇళయరాజా ఒక మంచి విషయాన్ని తెరమీదకు తెచ్చాడు. కమర్షియల్ ప్రోగ్రామ్స్ లో తమ గొంతు విప్పి పాడుతున్న గాయకులు పాడే పాటలేవీ తాము స్వంతంగా స్వరపరిచినవి కావు. వాటిని సృష్టించిన సృజనకారులు సంగీత దర్శకుడూ సాహిత్య కారుడూనూ. నిజానికి వారి బుర్ర ఇందులో లేకపోతే ఈ గాయకులకు ఆ పేరు వచ్చేదే కాదు. పేరు విషయం పక్కకు పెడితే, ఎపుడో స్వరపరిచిన పాటలను నేటికీ పాడుతూ  డబ్బును వెనుకేసుకుంటున్న గాయకులు, ఈ మొత్తం సంపాదనలో స్వరకర్తనూ, సాహిత్యకారుడినీ పట్టించుకోక పోవడం ముమ్మాటికీ క్షమింపరాని నేరం. ఇళయరాజా దానిని బయటకు తీసుకువచ్చి, పాట సృష్టిలో అసలైన శ్రామికులకు చెందవలసిన క్రెడిట్స్ ని నొక్కి వక్కాణించి నట్టయింది. ఇది ఇళయరాజా మాత్రమే చేయగల సాహసం.

ఇది బయటకు కాపీ రైట్స్ విషయంలా కనబడినా, లోపల ఎన్నో విషయాలను తప్పక తెరమీదకు తీసుకొస్తుంది. ఇళయరాజానే ఈ సాహసం చేయగలడని ఎందుకన్నానంటే...వేరే ఏ సంగీత దర్శకుడూ తాను స్వరపరచిన పాట పూర్తిగా తన సొంతదే అని చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు కాదు. రెహ్మాన్ నుండి, దేవిశ్రీప్రసాద్ వరకూ ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్ వంటి భాషల పాటలను కాపీ చేసి తమ సినిమాల్లో 'వాడుకున్నా'రనేది నిర్వివాదాంశం. అంతే కాక వాళ్ళు ఎక్కడా ఆ ఒరిజినల్ సంగీత కారుడికి క్రెడిట్స్ ఇచ్చినట్టుగా కనిపించకపోగా, ఇదంతా తమ 'తెలివి మహాత్యమే' అని చెప్పుకోవడమూ చూస్తున్నాం. ఇపుడు ఈ కాపీ రైట్స్ వివాదం ముదిరి ముదిరి పాకాన పడుతుంది. ఇళయరాజా మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. "తమరు నావి అని చెప్పుకుంటున్న స్వర బాణీలు ఎంతవరకు మీవి"? అనే అంశం తెరమీదకు వస్తుంది. నాకు తెలిసి ఇళయరాజాకు వేరే బాణీలను కాపీ చేసుకోవాల్సిన అవసరమూ, అవి తన సృష్టే అని అబద్ధం చెప్పుకోవాల్సిన ఆగత్యమూ ఇంతవరకూ రాలేదు. కాబట్టి అతడు పూర్తిగా సేఫ్ సైడ్. ఇపుడు ఇతర సంగీతకారులు కూడా ఇళయరాజాలాగానే తమ కాపీ రైట్స్ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ బాణీ "సాంతమూ నాదే" అని చెప్పలేని మహా మాయగాల్లందరూ గప్చుప్ కాక తప్పదు. ఇక అసలు దొంగలను బయట పెట్టే కార్యక్రమం కోసమే ఇద్దరు మిత్రులు కలిసి వేసిన పాచిక అని నాకనిపిస్తుంది.
పిల్లలాట
----------------

సాధారణంగా పిల్లలు ఏదైనా విషయాన్ని పోటీ పడి తోటి పిల్లలతో చెబుతూ వుంటారు. నా దగ్గర పది చాక్లెట్లున్నాయి తెల్సా అని ఒకడంటే, నా దగ్గర పదకొండున్నాయి తెలుసా అంటాడింకొకడు. మా ఇంట్లో మూడు కుక్కలున్నాయ్ అంటే..మా ఇంట్లో నాలుగున్నాయ్ అంటాడు. ఏది చెప్పినా దానికింకొకటి కలిపి చెప్పడం, ఆ విధంగా అవతలివాడికంటే తామే గొప్ప అని చెప్పాలనుకోవడం పిల్లల అలవాటు. అది పిల్లలకు ఒక ఆట. దీనిని బ్రాగ్గింగ్ అంటారు. పిల్లలు అభివృద్ధి చెందే దశల్లో ఇదీ ఒకటి. పిల్లలు సోషియలైజ్ అయ్యే దశలో ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఇదే పరిస్థితి పెద్దగ అయ్యాక కూడా దాపురించిందంటే అది అసాధారణ మానసిక రోగమని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలలో జరిగిన ప్రచార తంతు కావచ్చు, ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఈ చిన్న పిల్లలాటను గుర్తు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ప్రజల మేధావిత్వాన్నీ, ఆక్టివ్ పార్టిసిపేషన్ నీ మాత్రమే కాక హుందాతనాన్నీ కోరుకుంటుంది. రాహుల్ గాంధీ లో వీడని బాల్యం, ప్రధాన మంత్రి అయిన మోడీలో కూడా బాల్యాన్ని నిద్రలేపిందేమో....మరీ దిగజారుడు స్థాయిలో ప్రచారాలు జరిగాయి. నారియల్ పానీ, నారియల్ జ్యూస్ వంటి చిల్లర జోక్ లూ ప్రధాన మంత్రి ఉపన్యాసాల్లోకి వచ్చి చేరాయి. గతంలో ప్రధానమంత్రులెవరూ ఇలా మాట్లాడిన దాఖలాలు లేవు. తానేంచేయబోతున్నాడో..తన గవర్నమెంటు పథకాలేంటో, సాధించిహ విజయాలేంటో ప్రతిభావంతంగా ప్రజలముందు పెట్టి, ఎంతో హుందాగా ఓట్లను అడిగేవారు. చురకలు విజ్ఞతతో కూడుకుని ఉండేవి. చమత్కారంగా సాగేవి. అవన్నీ ఇపుడు పోయి, పిల్లలాటగా మారిందనిపించేలా ఉపన్యాసాలు సాగాయి.

ఎన్నికల తరువాత కూడా..గోవా మణిపూర్ లలో ఒక్కొక్కసీటును లెక్కపెట్టుకుంటూ, నేను గొప్పంటే నేనే గొప్ప అని అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం పడుతున్న పాట్లు చూస్తుంటే, ఈ చిన్న పిల్లలాటే గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో కూర్చోవటం నామోషీ ఏమీ కాదు. ప్రజల కష్టాలని అర్థం చేసుకోవడానికి, పరిపాలనలో ఊహలకూ వాస్తవానికీ ఉన్న అంతరాల్ని అవగతం చేసుకోవడానికీ తద్వారా మెరుగైన సమాజాన్ని తయారు చేసుకోవడానికీ ప్రతిపక్షం పాత్ర దోహదపడుతుంది. అధికార పక్షానికి ఎప్పటికప్పుడు చేసే తప్పులను గుర్తుకు చేయడం సరి చేసుకోవడానికి అవకాశం కల్పించడం వంటి బాధ్యతల ద్వారా, ఇంకా మెరుగైన పాలన అందించడానికి ప్రతిపక్షం దోహదం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఓడిపోవడమూ, అధికార పక్షంలో ఉంటే గెలవడమూ అనే స్పృహ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజలు ఈ సారికి ఆ  పక్షానికి అధికారమిచ్చారు అంతే తప్ప అదేదో శాశ్వత విజయం కాదు. కానీ పరిస్థితులు చూస్తుంటే కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాకలుదీరిన రాజకీయ పార్టీలు ప్రవర్తించడం, హుందాగా వ్యవహరించవలసిన చోట చిన్నపిల్లల్లా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విషయం. గోవా మణిపూర్ లలో హుందాగా కాంగ్రేసుకు అధికారమిచ్చి తాను ప్రతిపక్షంలో కూర్చుని ఉంటే, బీజేపి వంటి అనుభవమున్న పార్టీమీద గౌరవం పెరిగేది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని, బహుశా కొని, అధికారం కోసం అర్రులు చాచటం పిల్లల పది పిప్పరమెంట్ల ఆటనే గుర్తుకు తెస్తోంది.

మన సమాజం మోడెస్టీని ఇష్టపడే సమాజం. సాధుశీలతనూ, వినయాన్నీ, త్యాగాన్నీ ఆదర్శాలుగా చెప్పుకునే సమాజం. అతిగా గొప్పలు చెప్పుకుని తమ ప్రతాపం చూపించుకోవాలి అనుకునే వారిని ఈసడించుకునే సమాజం. ఇటువంటి దేశంలో ప్రజాస్వామ్యం వాస్తవానికి దాని స్వచ్ఛతను బయటపెట్టేదిలా ఉండాల్సింది పోయి, దాని లొసుగులతో పబ్బం గడుపుకునే వారిని తయారు చేయడం భయానకమైన విషయం. బహశా మన దేశంలో ఉండే బానిస మనస్తత్వం ఇటువంటి పోకడలను ప్రోత్సహిస్తుందేమో. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇంకో పార్టీకి ఇచ్చాక కూడా, తిమ్మిని బమ్మిని చేసి రాజ్యాధికారం కోసం అంగలార్చడం ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో వారే చెప్పాలి.

15/3/17
Virinchi Virivinti
తల్లి అసలు స్వరూపం
--------------------------------------

ప్రతీ ఒకరికీ వారి వారి మానసిక చట్రం ( Mental Frame)  ఒకటి ఉంటుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఇచ్చిన అనుభవాలే అతడి మానసిక చట్రాన్ని ఏర్పరుస్తాయి.  ఒక వ్యక్తి చుట్టూ పరుచుకుని ఉన్న అనుభవాలు, చుట్టూ పేరుకుని ఉన్న భావాలతో,ఇంకో రకంగా చెప్పాలంటే ఆదర్శాలతో ఏకీకృతం కానపుడు, అతడు తన మానసిక చట్రంలో తీవ్ర ఘర్షణకు లోనవుతాడు. వైయుక్తిక అనుభూతికీ, సామాజిక ఆదర్శానికీ లంకె దొరకక పరాయీకరణ (Alienate) చెందుతాడు.  చుట్టూ వున్న సమాజంలో ఇమడలేక ఏకాకవుతాడు. అటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే, అతడు నిశ్శబ్దంగా నిస్సారంగా తన బతుకును వెళ్ళదీస్తాడు. కానీ ఆ వ్యక్తి ఒక కవి అయితే ఆ ఘర్షణను భాషలో వ్యక్తీకరించటానికి ఉద్యమిస్తాడు. ఆ ఉద్యమంలో అతడు వ్యవస్థ ఆదర్శాలను తనలోని సంఘర్షణతో ఢీకొడతాడు. ఢీకొట్టే బలాన్ని బట్టి నూతన సృష్టి జరిగే అవకాశం పెరుగుతూ  ఉంటుంది. ఎంతగా లోపల సంఘర్షణ ఉంటే అంత బలంగా దెబ్బ వుంటుంది. దెబ్బెంత బలంగా వుంటే ఏర్పడిన సమాజాదర్శాలు అంతగా వినాశనమవుతాయి. అవెంత వినాశనమౌతే నూతన సృష్టి అంతగా జరుగుతుంది. అంటే లోపలి సంఘర్షణ బయటి సృష్టికి కారణమవుతుంది. ఫ్రాయిడ్ చెప్పినట్టు చెప్పాలంటే సృష్ట సమాజంలో ఇమడలేనివాడు కాబట్టే సృష్టి చేస్తాడు. నిజానికి కవికి సమాజంతోటి సంఘర్షణ అనేది అనుషంగిక ఆవశ్యకతలా మారుతుంది కాబట్టే కవి దారి చూపించేవాడవుతాడు. కవి లేదా కళాకారుడు స్రష్ట కనుక ఆ ఆవశ్యకతతోటే జీవిస్తాడు అంటాడు రాంక్ అనే మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త. కళ అనేది ఆత్మాభివ్యక్తీ కాదు, సృష్ట సమాజపు( created society's) సామూహికాదర్శ అభివ్యక్తీ కాదు. అది వైయుక్తిక సామూహికాదర్శాల మధ్య ఘర్షణ అనేది అతని సిద్ధాంతం. ఈ లెక్కన చూసినపుడు కవిత్వ సృష్టిలో స్వచ్ఛమైన కళాభినివేశం పెరిగేకొలదీ, అతడు సమాజాదర్శాలకు దూరం జరుగుతాడు. సమాజాన్ని కొత్తగా చూపించటం మొదలెడతాడు. రవి కాంచని చోట కవికాంచును. అలాంటి కవి మద్దూరి నగేష్ బాబు.

ఈ కవితలోని వస్తువు అమ్మ. నేటికీ అమ్మ అనగానే ఒక రూపం మన మదిలో కలుగుతుంది. ఈ రూపం ఈ సమాజాదర్శం నుండి వచ్చిందే తప్ప వాస్తవ రూపం కాదు. అందుకే అమ్మ అనే భావన చుట్టూ పేరుకుని ఉన్న భావజాలాన్ని అందులోని డొల్ల తనాన్నీ బలంగా బద్దలు చేస్తాడీ కవితలో. అమ్మకు సంబంధించిన అతడి వైయుక్తిక అనుభవంలోని నిజం, సమాజాదర్శంలోని అబద్దం ఈ రెండూ కవిని ప్రేరేపిస్తాయి. అమ్మను కొత్తగా చూపిస్తాయి. నిజానికి కొన్ని ప్రమాణాలకు లోబడి మనుషులు భావనలను ఏర్పరచుకుని, వాటిని స్థిరీకరించుకున్నపుడు ఆ సమాజం మృత సమాజమే అవుతుంది. సృజనాత్మకతకీ చోటుండదు. కవి సృజించేవాడు. మృత్యవుని జయించేవాడు. మృత సమాజాన్ని మేల్కొలిపేవాడు. మద్దూరి నగేష్ బాబు కవితల్లో ఈ అంశం కనిపిస్తుంది. ఈ కవితలో అబద్దంలో జీవించడమే కాక సమాజంలోని పోతపోసిన పోకడలని అనుసరించే అరవింద ఘోష్ వైషయిక (sensate) మానవుడినీ, లేదా జే.ఎస్ మెకంజీ పండిత మన్యుడినీ( pedant) చాలా వ్యంగ్యంగా విమర్శిస్తాడు. ఫిలిస్టైన్ (philistine) మానవుని భావబధిరత్వాన్ని, సత్య బధిరత్వాన్నీ సులువైన మాటలలో ఎండగడతాడు. అమ్మ భావనను కొత్తగా చూపివ్వడమే కాకుండా అందులో తన సంవేదనను నింపుతాడు. తద్వారా సమాజంలోని వ్యక్తులు తల్లి చుట్టూ ఏర్పడిఉన్న  భావనలద్వారా ఎంతటి అంధులుగా మారారో చెప్పదలచుకుంటాడు. తల్లి భావనను మనిషి భావన దగ్గరికి తీసుకెల్లి, తల్లి కూడా ఒక మనిషే అనే సత్యాన్ని తీసుకువస్తాడు.

వైషయిక మానవ సమూహంతో ఏర్పడిన మనదేశ సంస్కృతి, బీదతనంలో మగ్గి, అసే ఒసే లంజముండా అనిపించుకున్న తల్లుల విషయంలో ఎంతటి అంధత్వాన్ని ప్రదర్శించిందో ఈ కవితలో చూపిస్తాడు. మనదేశంలో అత్యధిక తల్లులు ఈ బాధలను అనుభవించినవారే..తక్కువకులం పేరుతో నానా మాటలూ పడ్డవారే. అంతేకాక చెరువుల దగ్గర నీళ్ళు కూడా తాగనీయని అగ్ర వర్ణ అహంకారం, తమని అక్షర సముద్రం ముందర అంగీకరిస్తుందా అని అడుగుతాడు కవి.  బుద్ది జీవుడైన కవితప్ప ఇంకెవ్వరూ సంస్కృతి అనబడే అంశంలోని పటాటోపాన్ని గుర్తించలేరు. తను చూసిన తన తల్లి రూపాన్ని అందరికీ చూపించి తద్వారా తల్లి అనే సమాజ భావనలోని లోపాన్ని ఎత్తిచూపుతాడు కవి. తల్లి భావనను ఒకదానిని సృష్టించి,దానిని స్థిరీకరిస్తుంది సమాజం. పోతపోసినట్టుండే ఆ భావానికి సంబంధంలేని అతిరిక్త (deviant) భావనలన్నింటినీ కొట్టేయ్యాలని నాశనం చెయ్యాలనీ సమాజం, దాని నాగరికత నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వీటన్నింటిని సమర్థవంతంగా కవితలో చర్చిస్తాడు కవి.
అంతేకాక మన భారతీయ సమాజంలో కుల వ్యవస్థలో వివక్షకు గురైన పీడితులను సాటి మనుషులుగా గుర్తించలేని తత్వం కనిపిస్తుంది. సాటి మనుషులను పశువులుగా గుర్తించిన వారు కూడా పశువులే. నిజానికి ఈ దేశ తల్లుల మీద చాలా బాధ్యత ఉంది. తమ పిల్లలు మనుషులని మనుషులుగా గుర్తించగలిగేలా పెంచటమా, లేక మనుషులను పశువులుగా గుర్తించగలిగేలా పెంచటమా అనేది వారి పెంపకం మీదే ఆధారపడి వుంది. స్త్రీగా కాక మనిషిగా బతికిన తల్లులే తమ పిల్లలను మనుషులుగా పెంచుతారేమో..! ఇటువంటి ఒక అంతర్లీన సూచనతో కవిత ముగుస్తుంది. మనకు కొత్తగా తల్లిని చూచిన అనుభూతి మిగులుతుంది.

||అలగా తల్లి || మద్దూరి నగేష్ బాబు || మాతృక సౌజన్యంతో ||
------------------------------------------------------------------------------------------------
ఏ ప్రభుత్వాసుపత్రి శవాలకొట్టుముందయినా
ఒక కన్నీటి మడుగుని చూసారా – అది మా అమ్మే
ఏ సమాధుల దొడ్లోనయినా కనీసం చావుబండకి నోచుకోని
బొందమీద మొలిచిన ఏకాకి శిలువని చూసారా? – అదీ మా అమ్మేనండీ

మా అమ్మ యశోద కాదు
అలాగని కౌసల్యా కాదు

ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ
వెండిగిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మాయమ్మ
నూజీడీల కోసం మారాం చేస్తే నాలుగు తన్ని కసురుకుందేకాని
కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మాయమ్మ

ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడలేదే
అలాంటి మా అమ్మమీద ఏం రాయమంటారండీ

అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలల్లుతున్నారంటే
వాళ్ళ తల్లులు రాజమాతలు కడుపులో చల్ల కదలని క్షీరమాతలు
మా అమ్మదేవుందండీ
అసే ఒసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది

లంజముండా అని తప్ప గౌరవవాచకాలకి నోచుకోనిది
బతుకంతా గుక్కెడు గంజినీళ్ళ కోసమే దిగులుపడి డీలాపడ్డ పిచ్చిది
అలాంటి మా అమ్మ మీద కవిత్వమంటే
అక్షరాలు అంగీకరిస్తాయంటారా?
లక్షణాలు వొదుగుతాయంటారా?

అందరి తల్లులు ఆదమరిచి సుఖనిద్రలు పోతున్నప్పుడు
నా కూలితల్లి పంటకుప్పల మధ్య పరాభవమైపోయింది
ఉన్న తల్లులంతా ఉత్తమమాతల పురస్కారాలందుకుంటున్నప్పుడు
నా వాడతల్లి గుక్కెడు నీళ్ళు తాగినందుకు జరిమానాలు కడుతూ వుంది
అందరి తల్లులు అపరనాయకురాళ్ళయి ఏలికలు చేస్తున్నప్పుడు
నా అలగాతల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్తూ వుంది

ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే
నాకు మా అమ్మ కలుపుతీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండీ
కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాకా
తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నా మొరటు తల్లి మీద
ఏం రాయమంటారండీ

నాకు మా అమ్మ ఎప్పుడూ జోల పడలేదండీ
దాని గొంతెప్పుదో ఆకల్తో పూడుకుపోయింది
నన్ను మా అమ్మ ఎప్పుడూ జోకొట్టనైనా లేదండీ
దాని చేతులెప్పుడో వ్యవసాయపనిముట్లుగా మారిపోయాయి

పిల్లలందరూ తమ తల్లుల చిటికెనేళ్ళు పుచ్చుకు వనభోజనాలకెళ్తుంటే
నేను మా అమ్మడొక్కలోయలోకి ముడుక్కుని పడుకున్నాను సార్!
బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్షదైవాలుగా కీర్తిస్తుంటే
నేను ఫీజు కట్టలేని నా పేదతల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్
కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లుతున్నప్పుడు
నేను నా రోగిష్టితల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గొణుక్కున్నాను సార్

ఏం చెప్పమంటారండీ!
వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మకొంగందుకుంటే
కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండీ
చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్ముని ఆబగా నోటికదుముకుంటే
నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండీ

ఏదేమైనా సార్!
సాటిమనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని
పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య
మనిషి కాక మరేమీకాని నా తల్లి గురించి చెప్పాలంటే
ఈ భాషా ఈ కవిత్వం ఎప్పటికీ సరిపోవు సార్!

(కవిత్వ సందర్భం 32)
8/3/17
Telugu traslation of our movie song
EL MUCHACHO DE LOS OJOS TRISTES by Spanish singer JEANETTE
----------------------------------------------------------------------------------------------------------------------

అతడి ప్రపంచాన్ని ఆనంద పరచటానికి
ఒక చిన్న నవ్వు,
అతడి లోతైన కళ్ళలో ఒక చిన్న వెలుగూ
కనీసం ఒక ఆలోచనా ప్రతిబింబం
ఏదీ లేదసలు

అతడి కళ్ళ లోని బాధ
నాతో నిశ్శబ్దంగా మాట్లాడుతోంది
నిదానంగా నాతో నాట్యం చేస్తోంది.
దూరతీరాలనుండి ఎగిరొచ్చిన ఆ బాధ
నా అంతరంగాన్ని తాకి ప్రేమగా మారుతోంది.

విచారంగా కనిపించే కనులున్న అతడి ఒంటరితనానికి
నా ప్రేమ కావాలి.
ఈ గాలికి నా అవసరం ఉన్నట్టుగా
నేనతడికి అవసరమిపుడు

విచారంగా కనిపించే కన్నులున్న ఈ అబ్బాయిపుడు
చిరునవ్వు నవ్వటానికి ఓ కారణం కనుగున్నాడనిపిస్తుంది.
నా స్నేహాన్నీ, నా ప్రేమనూ ఆస్వాదిస్తున్నాడనిపిస్తుంది.

నాకతడి పేరు తెలియనప్పటికీ
అతడు ఒంటరిగా దొరికినపుడు
వసంతంలాంటి ఆ కళ్ళలో
లోకాల్ని మరచి నిదురపోవాలనిపిస్తుంది.

ఈరోజు దీనంగా కనిపిస్తున్న అతడి కళ్ళలో
నేను ఏదో ఓ కారణం కనుక్కోకుండా పోను
సునిశితమైన నవ్వును ఆ కళ్ళలో చూడకుండా పోను

విచారంగా కనిపించే కనులున్న అతడి ఒంటరితనానికి
నా ప్రేమ కావాలి.
ఈ గాలికి నా అవసరం ఉన్నట్టుగా
నేనతడికి అవసరమిపుడు

విచారంగా కనిపించే కన్నులున్న ఈ అబ్బాయిపుడు
చిరునవ్వు నవ్వటానికి ఓ కారణం కనుగున్నాడనిపిస్తుంది.
నా స్నేహాన్నీ, నా ప్రేమనూ ఆస్వాదిస్తున్నాడనిపిస్తుంది.
విరించి ll   మాట్లాడుకుందాం  ll
------------------------------------------------

నేను చెప్పగానే నీవు వింటావనీ, మారిపోతావనీ
నేనెప్పటికీ అనుకోను
కానీ ఎందుకనో..
చెప్పకుండా నిస్పృహతో ఉండిపోవాలనే పట్టుదలను
ప్రతిసారీ బలవంతంగా వొదులుకుంటూనే ఉంటాను

నేను చెప్పినపుడు నీవు విన్నా విననట్టుగా ఉండిపోతుంటావు
లేదా, అదేమంత ముఖ్యం కాదన్నట్టుగా ప్రవర్తిస్తుంటావు
నాకు అత్యద్భుతమైన విషయం
నీ ముఖ కవళికల్లో అతి చిన్నవిషయంగా నీవు చూపించినపుడు
పైకి నవ్వుతూ  లోన బాధపడటం
నేనపుడపుడే నేర్చుకుంటాను
అద్భుతమని విప్పార్చిన నా కళ్ళలో
అసహనాన్ని దాచడమెంత కష్టమో తెలుసుకుంటాను.

చెప్పాలనుకున్న అంశం ఉన్నదున్నట్టుగా
నీ మనసును చేరాలంటే ఎన్ని అడ్డుగోడల్ని దాటాలో కదా...!
నా పెదవులు మాట్లాడిన మాటలూ
నీ చెవులను చేరిన మాటలూ
ఒకటే ఎందుకు కాలేవని నేనెపుడూ ఆలోచిస్తూంటాను

పెదవులకీ చెవులకీ నడుమ
భావప్రసారం సరిగా జరిగిన తరుణంలో
మన నాలుగు నేత్రాలూ తడిసిపోతుంటాయి
మాటలు కౌగిలించుకోవడం చూస్తుంటామపుడు
ఎపుడోగానీ జరగదనుకుంటానిలాగా..!

కానీ, ఎప్పటికీ మనం మాట్లాడుకుంటూనే వుందాం
ఒకరినొకరం అపార్థం చేసుకోవడానికైనా మాట్లాడుకుందాం
సమయాన్ని నింపడానికి తప్ప ఉపయోగపడని మాటలకు
ఏదో ఒక అర్థాన్ని ఇవ్వడానికైనా మాట్లాడుకుందాం...
ఔను, ఇక మనం మాట్లాడుకుందాం.

6/3/17

Thursday, 16 March 2017

ఎంతగా కల లోకి గుచ్చుకున్నావో ఈ జీవితాన్ని
కలల్లో నెత్తురు కారుస్తున్నావు
పిచ్చివాడా...
కలల్లో స్వేచ్ఛ ఉందని విసిగిస్తావేం..?
ఏదీ నిద్రను దాటి రమ్మను చూద్దాం...

తలపుల కిటికీలు బార్లా తెరిచి కూచుంటావు
ప్రశ్నలెంత బలంగా వీస్తాయో...
ఒకసారి ఆనందంలో ఇంకోసారి విషాదంలో
ఒంటరిగా తడిసి ముద్దవుతావు
తల తుడుచుకోవడానికి తుండుగుడ్డ కూడా దొరకదా?

ఎపుడోమారు నీ ద్వేషానికీ కోపమొస్తుంది
కత్తిమీది రక్తపు చారికలా ఉంటుందేమో అది
కత్తులూ  వాడికి
నీ స్నేహం రుచిస్తుందా చెప్పు...

గుండెల్లోకి కత్తి దిగినా, తూటా దిగినా
బుగబుగ పొంగుకొచ్చేది నెత్తురు కాదేమో...
నరనరాన ఇంకిపోయిన నీ అలసత్వం
అయినా..నీ జీవన పోరాటంలో
కత్తులూ లేవు, తుపాకులూ లేవు
యుద్ధంమాత్రం జరుగుతూనే వుంది

నీ శత్రువెపుడూ నీకు అమూర్తమే
వాడికీ తెలుసు వాడు కనిపిస్తే చంపేస్తావని
ఓడిపోవడానికే నీయుద్ధం
ఓటమిలో మెలకువలు తెలుసుకోవడమే జీవితం


Thursday, 23 February 2017

విరించిll  త్వమేవాహం ll
-------------------------------

అతడి పేరడిగాను
సాటి మనిషన్నాడతడు
ఎంతటి అద్భుతమైన పేరది...!!

తెరలు తెరలుగా
 పొరలు పొరలుగా మాట్లాడాడతడు
అంతఃపురాన్ని అరుగుమీదకు తెచ్చినట్టు

అతడపుడే బోధించాడు

హృదయానికీ లోకానికీ
ఒక్క ఛాతి ఎముకే అడ్డమనీ
హృదయానికీ మెదడుకూ
ఒక్క మనిషి ముఖమే దూరమని

కుల మతాలూ
పాప పుణ్యాలూ
పదాల పీనుగులైపోతే...
నడిచే మనిషే మనిషని.

పోతూ పోతూ  నా పేరడిగాడు
సాటిమనిషన్నాను
అద్దంలా నవ్వాడతడు.

15-1-17
విరించి ll    సంచిత గీతం  ll
--------------------------------------------

నీకు తెలియకుండానే నన్ను బాధ పెడతావ్
బాధ పడకూడదనే అనుకుంటాను నేను

ఏమీ తెలియని పసివాణ్ణని నన్నెగతాళి  చేస్తావ్
ఎందుకనో....పసివాణ్ణవుతాన్నేను

నేను గమనించలేదనుకుని
అపహాస్యాన్ని నావెనుక రహస్యంగా ఇంకొకరితో పంచుకుంటావు
గమనించనట్టే ఉండిపోతాన్నేను.

నాతో కలిసి పంచుకున్న నవ్వులన్నీ
నా వెనుక నన్ను చూసి నవ్వినపుడు కూడా
ఇదంతా స్నేహమేననుకుంటాన్నేను.

నీతో చెబుదామనుకుని ఆపేసిన మాటల్లో
నేను మాత్రమే దాగుండిపోతాసు
నీతో చెప్పి పంచుకున్న ఆ కొన్ని నవ్వుల్లో
నీవే సర్వమై వుండిపోతుంటావు.

కానీ చివరిలో
మాటకారిని కానందుకేమో...
నీముందొక స్వార్థపరుడిలా మిగిలిపోతాన్నేను

కలతల్లేని నిద్ర కోసం
అర్ధరాత్రి కొన్ని క్షణాల్ని కన్నీటితో తడుపుతున్నపుడు
నీవన్నదే నిజమనిపిస్తుంది
నేను మాటకారిని కాను
స్వార్థపరుడనని

23/2/17

Tuesday, 31 January 2017

Radheya Kavithwa sandarbham

ముందు తరాల రిఫరెన్సు కోసం నేటి కవిత
...................................................

గతం ఒక స్వప్నంలా గోచరిస్తుంది. మనసులో రికార్డు అయిన గతం తాలూకు ప్రతీ చిన్న అనుభవమూ మనిషిని ఏదో ఒక సమయంలో నులిపెట్టి బాధిస్తుంది. గతం తాలూకు అనుభవం ఎప్పటికీ కనులముందు నిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది అవాస్తవం. ప్రస్తుతమే గతం తాలూకు అనుభూతిని పట్టుకుంటుంది. కానీ ప్రస్తుతం గతంలా మారే వేగం దాని డైనమిక్స్ ఆధారంగా మనిషి మనసు ఫ్యూచర్ షాక్ కు గురవుతుందా లేదా చెప్పవచ్చు. వేగంగా మారుతున్న పరిస్థితులు, మనుషులు ఊహా శక్తి వేగం కంటే మించిపోయినపుడు, అనుభవించే మానసిక నిష్ఫలతనే ఫ్యూచర్ షాక్ అని చెప్పవచ్చు.

 గ్రామాలలో సంస్కృతి ఒక రకంగా ఉంటే, పట్టణాల సంస్కృతి ఇంకో రకంగా ఉంటుంది. పూర్తిగా పల్లెల్లోనే జీవించే వారుగానీ, పూర్తిగా పట్టణాల్లోనే నివసించేవారుగానీ ఎటువంటి సాంస్కృతిక అఘాతానికి గురి అయ్యే అవకాశం ఉండదు. కానీ పల్లెనుండి పట్నానికి వలస వచ్చినవారు లేదా పట్నం నుండి పల్లెకు తరలిన వారు ఒక తాత్కాలికమైన సాంస్కృతిక అఘాతానికి గురౌతారు. ఇదిలా వుంటే ఒకప్పుడు పల్లెగా ఉన్న తన వూరిని చాలా కాలం తరువాత చూద్దామని వెల్లిన కవి రాధేయ తన పల్లె పల్లెలాగా లేకపోవడం చూసి ఒక అఘాతానికి గురౌతాడు. అదే ఒక కవితగా మనముందుంచుతాడు. ఒక ఆత్మాశ్రయ నష్ట భావన, ఆత్మనుండి దూరంగా జరిగిన భావన, ఒంటరితనమును అనుభవిస్తాడు. ఒక నోస్టాల్జియాలో కాసేపు సేదదీరుతాడు. ఈ లక్షణాలనన్నింటినీ ఫ్యూచర్ షాక్ అనవచ్చు. రాధేయ కవిత చదివేటపుడు మనమూ దాని బాధితులమని గుర్తించగలుగుతాం. అంత సున్నితంగా కవితలో మనసును వ్యక్తపరుస్తాడు.

నేనెక్కడికి వచ్చాను? నేనెక్కడున్నాను? అనటం ద్వారా టైం అండ్ స్పేస్ తో పూర్తిగా విడిపోయిన ఒక మనస్తత్వ స్థితిని చూపిస్తాడు. ఊరు పరాయిదైపోవడం, ఊరికి తాను పరదేశీయుణ్సైపోవడం, వాస్తవిక స్థితిలో ఇమడలేకపోవడం, ఏలియనేషన్ ని అణుభవించటమూ కనిపిస్తుంది. ఇటువంటి మనసు ఒక నిష్ఫలతను తనలోపల దర్శిస్తుంది. అందుకే అంటాడు కవి ఆత్మను కోల్పోయిన సౌందర్య వాదినని. ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఒకదానితరువాత ఒకటి తరంగాలుగా ప్రవహిస్తూ, మనిషి ఆశించినట్టు కాకుండా ఇంకో విధంగా పల్లె స్వరూపం మారిపోతుంటే, మార్పుకు తగ్గ మానసిక సంసిద్ధతను మనిషి పొందలేనపుడు పొందే ఫ్యూచర్ షాక్ స్వరూపాన్ని కవితలా మలచటం బహుశా దాచుకోతగ్గ అద్భుతమైన సంపద కావచ్చు. సంవత్సరం నాటికి భారత దేశంలో దాదాపు యాభైఐదు శాతం ప్రజలు నగరాల్లో నివసిస్తారని లెక్కలు గట్టారు. వేగంగా నగరీకరణలు చెందుతున్న ఈ దశలో,ఈ మార్పుకు తగ్గ సంసిద్ధతను ఏర్పరచుకోని ఇప్పటి మానవుల మనోస్థితులు ఏమిటో బహుశా ముందు తరాలవారికి ఉపయోగపడుతుందేమో...

సౌందర్య రాహిత్యంలో...
                   రాధేయ

అమాయకత్వానికి
అచ్చమైన ఆకృతిలా
ఇక్కడో పల్లె పట్టు వుండాలి
ఇప్పుడు కనిపించదేమిటి?

ఈ కొండల కోనల గుండెల్లోంచీ
వడివడిగా దూకే జలపాతముండాలి
అది మా బాలమూకకు
స్నాన ఘట్టమై తపన తీర్చేది
ఇప్పుడది అదృశ్యమైపోయిందా?

ఇక్కడే ఈ చీలిన కాలిబాటలో
ఓ మాతృమూర్తి నిలబడి
తన నుదురుకు చేయి అడ్డం పెట్టుకుని
పనికోసం పట్నం వలస బోయిన
కన్న పేగు కోసం ఎదురు చూసేది
నే నా బాట మీద నడిచినప్పుడల్లా
దుమ్మురేగిన ఆమె పాద ముద్రలు
వెన్నెల చేతి కర్రల్లా
నా వెన్నంటే నడిచేవి

నేను పట్నం బస్సుదిగి
ఆ మిట్ట పల్లాల మీద నడుస్తుంటే
గొల్ల గురవయ్య కూతురు ఎదురొచ్చి
నాచేతుల్లో బరువంతా తానే మోసేది

ఆ పిల్ల రెండు భుజాల మీద
చిరిగిపోయిన ఆ చోళీ
చిగురేసిన మా స్నేహాన్ని
ఎగతాళి చేసేది
ఓ బుజ్జి మేకపిల్ల
ఆ పిల్ల పరుగుతో పోటీ పడేది
ఇప్పుడా గుడిసేదీ?
ఆ గొల్ల గురవయ్యేడీ?
ఆ మేకపిల్లా, ఆ కన్నె పిల్లా
కన్పించదేమిటి?

సాయం సంధ్య బూడిద రంగులోంచి
పొగడపూల పొదల్లోంచి
నాటి స్వాప్నిక దర్శనం
నేడు గగనమై పోయిందా?
నేనెక్కడికి వచ్చాను?
నేనెక్కడున్నాను?

ఒంటెద్దు బండిలోంచి
నగరం నాగరికతలోకి దొర్లిపోయాక
నా ఊరే నాకు పరాయిదైపోయిందా?
నేను నాఊరికే పరదేశినయ్యానా?
ఇప్పటికీ
నా శ్వాస నా పల్లెది
నా ప్రాణం మాత్రం పట్నంది
నిజం చెప్పనా...
నేనిప్పుడు
ఆత్మను కోల్పోయిన
సౌందర్య వాదిని !!

1-2-17
(కవిత్వ సందర్భం 31)