Thursday, 30 April 2015

విరించి ll మేలుకొలుపు ll
............................................
రాళ్ళూ రప్పలు కూడా ఏదో ఒకనాడు
నీపై తిరుగుబాటు చేస్తాయి.
అకస్మాత్తుగా నిద్రలేచిన అణుబాంబుల్లాగా
ఉన్న చోటి నుండే ముక్కలుగా పేలిపోతాయి.

నీ ముందు అద్దంలా నిలబడి ఉన్న ప్రపంచంలో
నీ  ప్రతిబింబం కళ్ళెదుటే కూలిపోతున్నపుడు
శరీరమంతా మొలిచిన వెర్రి గొంతుకతో
నీవు పెట్టే గావుకేకల్ని ఆస్వాదించేందుకు
పుట్టుకొచ్చే ప్రతీ ఆత్మా
నీవు పగలగొట్టిన రాయిదో
నరికి వేసిన చెట్టుదో
చంపేసిన జంతువుదో
చిదిమేసిన పూవుదో అయ్యుంటుంది

రెండు కాళ్ళు పొడుచుకొచ్చినంత మాత్రానికే
కళ్ళు నెత్తికెక్కిన నిన్ను
ప్రకృతంతా ఒక దయ్యంలానే చూస్తుంటుంది
పిడికిలంత బూడిదగా మిగిలే నీ అస్తిత్వ సంతకం
ప్రకృతి అందాల్ని తన కాలికింద చిదిమేస్తుంటే..
అణిగి ఉన్న ప్రతి మైదానమూ
ప్రతి పర్వతమూ
ప్రతి సముద్రమూ
ఏదో ఒక రోజు విప్లవమై లేచి వస్తుంది
నీవైన విప్లవాలే ప్రళయాలనుకునే అజ్ఞానంలో
నీవు మోస్తున్న చెత్తంతా
ఒక భూమి కుదుపుకో
ఒక ఎగిసిపడే అలకో
ధ్వంసమైనపుడు
నీ అస్తిత్వ అడ్రస్ లో..
కొన్ని దుమ్ము కణాలూ, ఇసుక రేణువులూ
కొన్ని కన్నీటి చుక్కలూ మాత్రమే మిగిలుంటాయి.

ఓ మనిషీ.. నీవు నిద్రలేచే సమయానికి
నీలో కలిగే మేలుకొలుపుకీ
ఒక్క అర నిమిషం మాత్రమే తేడా
నీ వసుధైక జీవనానికీ
విశ్వ ప్రళయానికీ నీ చైతన్యమే తేడా

30/4/15

Wednesday, 29 April 2015

విరించి ll  ముఖద్వారం  ll
.............................  ........  ......
ఓ అన్వేషీ..!
అక్షరాలతో నీవు గీసే కాగితపు బొమ్మలోకి
ఈ ఒంటరి ఉద్యానవనం
ఒదిగిపోయ్యేంత అమాయకమైందేమీ కాదు
కానీ నీ తలలో మెదిలే అనేక ప్రశ్నల్లో
ఒక ప్రశ్న కే నాదగ్గర సమాధానం దొరుకుతుంది
అది మాత్రమే తెలుసుకో.

కంచె చుట్టూ రాలి పడిపోయిన గులాబీల పాదాల చెంతో
ఎండి పోయిన చిగురుటాకుల మెత్తని పొత్తిళ్ళ లోనో
నీవొక మరణ మృదంగమై నిప్పుల్ని పాడుతుంటావు
విసిరేసిన నీళ్ళ డబ్బాల్నీ, పాత ఇనుప ముక్కల్నీ
ఒక జోలెలో వేసుకొని బంగారాల్ని ఊహిస్తుంటావు

వర్షంలో ఉతికి ఆరేసిన ఆకాశం మీద
సబ్బు నురగల్లా మేఘాలు జారిపోతున్నపుడు
కాగితపు పడవల్లోకి ఒక్క కవితనూ కూడా వొంపలేని నీవు
టప్పుమని పగిలిపోయే నీటి బుడగల్లోకి
చీపురు పుల్లల్ని గుచ్చుతుంటావు.

గులకరాళ్ళతో ఒకదాన్ని గురిచూసి ఇంకోదాన్ని కొట్టినా
చేతుల్లోని మట్టిని మింగి రక్తంలోకి ఇంకించుకున్నా
గాలి మూలుగులకీ, కుక్క మొరుగుళ్ళకీ ఉన్న తేడాని
తెలుసుకోవాలనే తపన నీ నిద్ర నీకెన్నటికీ కలిగించలేదు

నీవెంత నిరర్థక జీవివో
నీ వెతుకులాటలో ఎంత నిర్జీవం ఉందో చూసాక
నీవూహించే ప్రశ్నలను నేనూ వూహించగలను
కానీ వేల తారకలకు ఒకే చంద్రుడిలాగా
నీవొక ప్రశ్ననే పట్టుకు వేలాడుతుంటావు
ఉద్యానవనానికి బయటే తచ్చాడుతూ
చేతి గోళ్ళను ఆత్రంగా నమిలేస్తుంటావు

పైన వర్షాన్ని తిట్టుకుంటూ
కింద బురదలో జారుకుంటూ
పరిగెత్తే మనుషులను బలవంతంగా ఆపేసి
ఆ ఒక్క ప్రశ్ననే పదే పదే అడుగుతుంటావు
ఈ ఉద్యానవనానికి ముఖద్వారం ఎక్కడని
నీ ఈ ఒక్క ప్రశ్నకే నాదగ్గర సమాధానం వుంది
ఎందుకంటే ఆ ఒక్క సమాధానమే నేను
నీ కోసం ద్వారాల్ని తెరిచేవుంచాను
నాతో మాట్లాడటం కోసమే నీవిక నోరు తెరవాలి.

29/4/15

Saturday, 25 April 2015

విరించి ll పిడికిలి ll
..................................
పిడికిలి అంటేనే మూసి వుంచేది.
ఎత్తి పట్టినా, జై కొట్టినా
దాని స్వార్థాలు దాక్కునే వుంటాయి

శత్రు విజయాలకన్నా మిత్ర విజయాల్ని 
లెక్కపెడుతూ 
ఉత్సాహాల్ని తాగి ఉరకలెత్తే ప్రతివాడూ
గుంపుని పోగేసుకునేది
ఒక తలలేని గుండెకోసమే.

నీలో ఉరిమే ఉరుములకి
మురిసిపోయేవాడెపుడూ
నీ కడుపులోనే అగ్గి పెడుతుంటాడు
నీ ఖాళీ కడుపులో వాడికొక 
వెలిగే దారి కనుక్కొంటాడు

ఒక దండవేసి రెండు స్తోత్రాలు
గట్టిగా చదివినంత మాత్రానికే
భ్రమలో పదిమందిని వెనకేసుకు నిల్చుంటావు
నీ వెనుకనున్న వాడి ధీమా నీకుంటుందా చెప్పు?

నీ ఆవేశమూ నీ ఆకలీ
ఒక ఉదయాన్ని రగిలించడానికే తప్ప
నీ ఉదయాన్ని వెలిగించటానికి కాదు

వెలుగొక రోజుగా ఉదయించే సమయానికి
వెనుక వరసలు ముందుకు మారుతుంటాయి
చివరి వరుసకి మారిన నీ ఆవేశం, నీ ఆకలి వెనుక
ఎప్పటిలా ఒక అగాధమే నిలబడివుంటుంది.

24/4/15
విరించి ll భయంకర స్వప్నం ll
.......................................
నడి రాతిరి నిద్దురలో
హఠాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేచినపుడు
సగంలో ఆగిపోయిన భయంకర స్వప్నం
శ్వాసలో కూడా క్రూరంగా వినిపిస్తుంటుంది
చీకటికి కూడా కొన్ని ఆకారాల్ని అంటించి
కంటి ముందు కాసేపు వేలాడుతుంటుంది

దయ్యాల్ని మనుషుల్లోనే కనుగొనే మనం
నిదురలో అందమైన కలల్ని ఎపుడో పోగొట్టుకున్నాం..
మనుషుల్లో నమ్మకాల్ని కోల్పోయిన మనం
స్వప్నాల్ని నమ్మే స్థితికే దిగజారుతుంటాం.

ఆనందాతిశయం లో పక్షులు కూసే కూతలూ
సాన రాళ్ళ మీద నూరుకునే మన మాటలూ
ఒకటే అనుకునే మనం
నిదురలో మనసు చేసే సహేతుక దాడిని
స్వప్నమనుకుని సర్ది చెప్పుకుంటాం.

తలా మొండెమూ భాగాల్ని 
ద్వేషంతో నింపుకున్న మనం
ఒట్టి కాళ్ళ తో నిదురలోకి జారుకున్నపుడు,
తల మొండెం కలిగిన మన రూపాన్ని
స్వప్నమనే అద్దంలో చూసుకునే సమయాన
మృత్యువును చూసినట్టే జడుసుకుంటాం.

భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే
నడి రాతిరి నిదురను ప్రేమించే మనం
మనుషులందరూ కలిసి మెలిసి జీవించే
ఒక సుందర స్వప్నాన్నెందుకనో ప్రేమించనేలేము.

24/4/15

Tuesday, 21 April 2015

విరించి ll అడ కత్తెరలో వేడి వేడి ఛాయ్ ll
............ .................................
కొన్ని అన్యోన్య బంధాలుంటాయి
మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా
కప్పూ సాసర్ లాగా..

కాచి వడబోసిన వేడి వేడి ఛాయ్ ని
కప్పూ సాసర్ లోనే తాగాలి
ఖాళీ గా ఉండిపోయే కప్పూ సాసర్ కి
ఎలాంటి విలువా ఉండదు
వాటికి జీవం ఒచ్చేది 
ఛాయ్ నిండినపుడే కదా..

చిక్కటి ఛాయ్ ని కప్పు ఒడిసి పట్టుకున్నపుడు
అది ఒక సాసర్ మీద ఉంటేనే బాగుంటుంది

సాసర్ మీద కప్పూ
కప్పు కింద సాసరూ
ఎపుడూ నేను గొప్పంటే 
నేను గొప్పని
అనుకోవెందుకో అసలు
రెండూ కలిసుంటేనే కదా
చిక్కటి రుచికరమైన ఛాయ్ ని
నోటికి అందించగలిగేది.

పొగలు కక్కే వేడి వేడి ఛాయ్ ని
వేడిగానే తాగాలంటే
కప్పులోకే ఏకంగా పెదవులు దూర్చాలి
ఎంత వేగంగా ఆ వేడిని గొంతులోకి దింపాలో
అంత పైకి సాసర్ని ఎత్తి పట్టుకోవాలి

పొగలు కక్కే వేడి వేడి ఛాయ్ ని
మెల్లిగా చల్లగా తాగాలంటే
కప్పులోని ఛాయ్ ని సాసర్ లోకే వంచాలి
ఎంత వేడి ఛాయ్ అయినా
సాసర్ గర్భంలో కి వంచినపుడు
క్షణాల్లో చల్లబడాల్సిందే..
రుచి వేడి పర్యాయ పదాలే కావొచ్చు
సాసర్ మీదుగా ఛాయ్ ని తాగినపుడు
వేడీ చలువ కలిసిన ఒక కొత్త రుచినే ఆస్వాదించొచ్చు

ఏదో ఒక రోజు హఠాత్తుగా
కప్పు పగలినపుడో..
సాసర్ ముక్కలైనపుడో..
ఛాయ్ రుచి హీనమైపోతుంది
ఒంటరి జీవితం ఎవరికైనా దుర్భరమే మరి.

కానీ ఆధునికత పెరిగిన ఈ సమాజంలో
కప్పులూ,సాసర్లూ ఒంటరిగానే కనిపిస్తుంటాయి
ఛాయ్ ని ఆస్వాదించలేనట్టుగా మారిన కప్పులు
గప్ చుప్ బండ్లమీద సాసర్లు
భారంగానే జీవితాల్ని వెళ్ళదీస్తుంటాయి.

అక్కడక్కడా ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఉంటాయి
చేతినిండా సరి పడని సైజులతో
నోటి నిండా అందని మూతులతో
వేడి వేడి ఛాయ్ లోకి
తమ ప్లాస్టిక్ సరుకును కూడా 
కొంచెం కొంచెం కడుపులోకి అందిస్తుంటాయి.
ఎపుడైనా వేడి వేడి ఛాయ్ ని 
ఈ గ్లాసుల్లో తాగాలనుకున్నపుడు
వేడి కాస్త తగ్గించుకోవాలంటే..
ఒక గ్లాసు లోంచి ఇంకో గ్లాసులోకే వంపి చల్లార్చుకోవాలి
లేదా..ఒక గ్లాసుని ఇంకో గ్లాసులోకే దూర్చుకోవాలి.
ఏం ఖర్మ రా బాబూ...

20/4/15

Saturday, 18 April 2015

విరించి ll మంగళ సూత్రం ll
...........................................
రాతిరి వసంతంలా విరబూసినపుడు
రొమ్ము మీది వెంట్రుకల పై
వెచ్చగా తగిలే ఆమె శ్వాస
నా రెండు చేతుల్లోకి ప్రేమని నింపి
దగ్గరికి హత్తుకునేలా చేస్తుంటుంది..

కానీ ఈ రాతిరి ఆమె ఒక
మధుర స్వప్నంలా అక్కడ ఒదిగిపోతుంది

రేపు ఉదయం నిద్రలేచే సమయానికి
ఆమె తలస్నానం చేసి తలకు చుట్టుకునే
టవల్ దెండానికి వేలాడుతుంటుంది

పొగలు కక్కే కాఫీ కప్పులో
ఆమె నింపే ఆత్మీయానురాగం
నాతో ఒక యుద్ధమే చేస్తుంటుంది

దేవుని గదిలో ఆమె పాడే సుప్రభాతమూ
విష్ణు సహస్ర నామమూ
మ్రోగించే దేవుని గంటా
నా మూగవోయిన చెవులను
చివుక్కుమని పిస్తాయి

చిక్కు ప్రశ్నల్లాంటి ఆమె తల వెంట్రుకల్ని
పొడుపు కథల్లాగా విప్పేసిన మేధావి దువ్వెన
రెండు శాంపిల్ ప్రశ్నలను ఎత్తి చూపినట్టుగా
రెండు వెంట్రుకలని పేర్చుకుని కనిపిస్తుంది

ఆడదాని అందానికి మనమిద్దరమే కదా
కారణమన్నట్టు
అద్దమూ దానిమీది బొట్టుబిళ్ళ
ఒకదానికొకటి కౌగిలించుకుని కనిపిస్తాయి.

తిని పారేసిన అంట్లూ
వేసుకుని విడిచేసిన బట్టలూ
కడుపులో దేవుతున్నట్టు ఆకలీ
అన్నీ ఆమె పుట్టింటికి వెళ్ళిందన్న విషయాన్ని
మైకులో చెవిపక్కనే చెబుతున్నట్టూ
చెట్టంత  మనిషిని చెట్టుకి కట్టేసి చూపుటున్నట్టూ
అనిపిస్తుంటాయి.

ఆహా ప్రియ సఖీ...!
నీవొక్కరోజు ఊరికెళితే
నేను నేనుగా లేను

నా స్మృతి పథంలో
నీవెన్ని గుర్తులని నాకోసం
ఇలా వదిలేసి వెళ్ళావో అనుకుంటాను

ఇల్లంతా ఇన్ని గుర్తులను నాకోసం
వదిలి వెళ్ళే నీకు
నా గుర్తుగా ఏదీ ఇవ్వలేకపోయానని
బాధపడుతున్న సమయాన....

నీవక్కడ, నీ పుట్టింటిలో..
ఇంటికి వచ్చిన ముత్తైదువలతో కూడి
కాళ్ళ కు పసుపు రాయించుకుని
నుదుటిమీద బొట్టు పెట్టించుకుని
మంగళ సూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటుంటావు

నన్నూ..నా గుర్తునీ
మన జీవితంలో మరచి పోలేని ఒక ఙ్ఞాపకాన్నీ
నీ గుండెలపై దాచుకునే
ఓ..నా ప్రియ సఖీ..
నీవెంత మధుర మైనదానవి..!!

19/4/15





విరించి ll ఖాళీ జేబు ll
-----------------------------
ఒక్కోసారి మన దగ్గర
డబ్బులసలు ఉండనే ఉండవు
కొనాలను కున్న వస్తువు ఒక విగ్రహంలా
మన భావాల్లో పూజలు
అందుకుంటూనే ఉంటుంది

మన పడక  గదినైనా
పూర్తిగా నింపలేని కలలు
సుదీర్ఘ రాత్రుల్లో మనకు
నిద్రలేకుండా చేస్తుంటాయి

మన అభ్యర్థనలకు విసిగిపోకుాడదని
మనమొక మాట్లాడని  దైవాన్ని
తయారు చేసుకుంటాము

ప్రపంచాన్ని సృష్టించిన ప్రభువు
మనకోసం ఒక అద్భుతాన్ని
చేసేస్తాడని నమ్ముతుంటాం

ఇంత సమయంలో
ఇంత సంపాదించేయాలని
ఆ తరువాత హాయిగా బతికేయాలని
మరో ఆలోచన లేకుండా
భవిష్యత్తు లోకి దూకేసి
ప్రస్తుతానికి మరణిస్తుంటాం


ఖాళీ అంగీ జేబులోకి
చేతులు పెట్టినప్పుడల్లా
చేతివేళ్ళను తాకే గుండెను చూసి
ఇంకా బ్రతికే ఉన్నామని తెలుసుకుంటాం

కొనాలనుకున్న వస్తువు
బ్యాంకు వాడిచ్చిన అప్పుకో
స్నేహితుడిచ్చిన చేబదులుకో
లొంగి పోయినపుడు
ఆనందాతిశయం కలిగించిన తొందరలో
ఇంకో వస్తువు కూడా మన కలల్లోకి
దూకే ప్రయత్నంలో
మన గది మీదనే వేలాడుతూ
నిరీక్షిస్తుంటుందని తెలుసుకోలేము.

18/4/15

Friday, 17 April 2015

పరిచయం
..............
అలిశెట్టి ప్రభాకర్
"అక్షర నక్షత్రమ్మీద..."
కవితా చిత్రాలు
ఒక విహంగ వీక్షణం - విరించి
.....................................

కొన్ని గీతల్ని పెన్నుతో గీస్తే అక్షరాలవుతాయి, అదే పెన్సిలుతో గీస్తే ఒక చిత్రమౌతుంది. అందంగా భావాలతో కవితలాగా అల్లిన అక్షరాలకి, ఒక చిత్రం ప్రతిబింబమయితే అది అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రమౌతుంది. "అక్షర నక్షత్రం మీద...కవితా చిత్రాలు" అనే ఈ పుస్తకంలో మనకు కనబడే కవితలూ వాటి చిత్రాలూ, సమాజాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకోడానికి గీసిన గీతలేమో అనిపిస్తుంటాయి. కానీ ఆ కవితా చిత్రాలని అర్థం చేసుకోడానికి మన కళ్ళు ద్వారాలుగా మారాల్సిందే. అపుడే హృదయం తేజోవంతమౌతుంది. ద్వారాలుగా మన కళ్ళు మారనపుడు మన ముందు కదిలే ఈ కవితా చిత్రాలు సైతం, తెల్ల గుడ్డ కప్పబడున్న శవాలుగా మిగిలిపోతాయంటాడు.
"కళ్ళు ద్వారాలైనప్పుడు/హృదయపు గదంత/తేజోవంతం కావాలి
అటువంటప్పుడే /జీవితాల్ని/క్షుణ్ణంగా పరిశోధించగలుగుతాం/లేదా
కనుగుడ్ల తెప్పలపై తేలిపోయే దృశ్యాలూ/తెల్లగుడ్డు కప్పబడుతున్న శవాలూ/రెండూ ఒకటే మరి."

కుంచెనీ కలాన్నీ నమ్ముకున్న వాడు కాబట్టి, ప్రభాకర్ సమాజాన్ని, ఆకలిని కూడా నమ్ముకున్నడేమో అమాయకంగా. అవి ఎప్పటిలాగే ఆయన్ని కూడా మోసం చేసాయి. కటిక దరిద్రంలోనే టీబీ వ్యాధితో చిన్న వయసులోనే మనల్ని వదిలి వెళ్ళిన ప్రభాకర్, నేటికీ తన కవితా చిత్రాలతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాడు. ఎంతటి ఆశ్చర్యం అంటే ఈనాటి సమాజాన్ని ఆయన అప్పుడే చూశాడా అన్నంతగా. కానీ తరచి చూస్తే, ప్రభాకర్ ఉన్నప్పటి కాలానికీ నేటికీ సమాజంలో పెద్దగా మార్పు యేమీ రాలేదనిపిస్తుంది.
ఈ కవిత చూడండి. ఇపుడు కూడా యువత ఇలాగే ఉంది. కాదంటారా.
వెండితెరపై /నువ్ వ్యభిచరిస్తున్నప్పుడో
క్రికెట్ క్రిమి/నీ మెదడుని తొలిచేస్తున్నప్పుడో
బురద రాజకీయాలు/నీ ముఖంనిండా/పులుముకున్నప్పుడో..తప్ప
లేనే లేదిక నువ్ బ్రతికున్న దాఖలా.

ఆయన చిత్ర కారుడి నుండి కవిగా ఎదగడానికి మధ్యన ఉన్న ఆలంబన సమాజమే, ప్రేరణ విప్లవ పోరాటాలూ ఆకలి బాధలే. శ్రీ శ్రీ, శివసాగర్, చేరబండ రాజుల కవిత్వాన్ని ఊపిరిగా పీల్చిన ప్రభాకర్, పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలమూ కుంచే రెండూ ఉంటాయని ప్రకటించుకుంటాడు, అయినా తానొక ఉద్యమ దిశని సూచించే దిక్సూచినే అంటూ తన పరిధిని వ్యక్తపరుస్తాడు. అందుకే తన కవితలతో మనల్ని కుదిపి లేపుతాడు. భయాన్ని వదిలి పెట్టమంటాడు.
చీకట్లో జడుసుకుంటే
ఒక చెట్టే చుట్టూరా
అరణ్యమై భయపెడుతుంది
గుండెంటూ కలిగుంటే
నీ వెంట అదే పెద్ద
సైన్యమై నిలుస్తుంది
అనిధైర్యాన్ని నూరిపోస్తాడు.
నిజం చెప్పలేని నాలికలని, పని చేయని చేతుల్నీ శాపనార్థాలు పెడతాడు.
నిజం చెప్పటానికీ తడిలేని నాలుకలు/మూసిన నోల్ల చీకటి గుహల్లోనే పడుండి/గొంతెండి చావనీ
చేతులుండీ/అటు యిటూ పీనుగుల్లా వేలాడితే/వాట్ని సాంతం నరికెయ్యటమే ధర్మం

నా దృష్టిలో ధనమదాంధుడే అడుక్కు తినే వాడు అని శ్రామికుల పక్షం వహిస్తాడు. "అలా సమాధిలా అంగుళం మేరకన్నా/ కదలకుండా పడుకుంటే ఎలా? /కొన్నాల్లు పోతే నీ మీద నానా గడ్డీ మొలిచి /నీ ఉనికే నీకు తెల్సి చావదు" అని మొట్టికాయలూ వేస్తూ పెను నిద్దరని ఒదిలించేస్తాడు. రాజకీయాలమీద ప్రభుత్వాలమీద విమర్శనాత్మక విసుర్లతో ఆకట్టుకుంటాడు. "మెతుకులేరుకోవటం మీ విధి /మీ కడుపులు నిండకుండా చూసే బాధ్యత మాది /మెడలు వంచి శ్రమించటం మీ ఖర్మం /మీ వెనుక మేడల్లా నిలబడి పర్యవేక్షించటం మా కర్తవ్యం /మీరు పునాదుల్ని తవ్వుతూనే ఉండండి/ మిమ్మల్ని పూడ్చిపెట్టే పూచీ మాది" అంటు వర్గ తత్వాలపై వ్యంగాస్త్రాలు ఎక్కుపెడతాడు.

ఇక అలతి అలతి పదాల్లో ఆయన ఇచ్చిన కవితా నిర్వచనాలు అధ్భుతంగా ఉంటాయి. "న్యాయం గాయమై సంవత్సరాల తరబడి సలుపుతున్న బాధే కోర్టు " అంటాడు. "చట్టమేర్పరిచిన అగాధం బోను" అని, "పోగేసిన శవాల గుట్ట వంటిది బ్యాలెట్ పెట్టె" అనీ, "ఆశ -విత్తనం లేకుండా పెరిగే మొక్క యొక్క శ్వాస"యని, "నిరాశ -నాభిలేని ఊబిలో దిగబడక ముందే పొందే ప్రయాస" అనీ చమత్కరిస్తాడు. ఇక ముఖ్యంగా చెప్పు కోవాల్సింది వేశ్య కవిత గురించి.
"తను శవమై
ఒకరికి వశమై
తనుపుండై
ఒకడికి పండై
ఎపుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై"
అని అలతి పదాల్లో చెప్పేసి 'ఔరా' అనిపిస్తాడు.
కానీ ఈ పుస్తకంలో కవితా చిత్రాల కు ముందు ఉన్న మాటలు మనకు అలిశెట్టి ప్రభాకర్ జీవితవిశేషాల్ని అందిస్తాయి. ఆయన ఎంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడో అర్థం అవుతుంది. "సానుభూతి పరులైతే మనిషికో దోసెడు మట్టేసి పోండి" అని ఆయన ఎందుకంటున్నాడో తెలియాలంటే జయధీర్ తిరుమలరావు గారి ముందు మాట చదివి తీరాలి. కనులని ద్వారాలుగా మలచుకోమని చెప్పిన వ్యక్తే, "ఆకలి మండి పోతున్నపుడు/ ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా దగ్ధమైపోవాల్సిందే" అంటున్నపుడు మనసు బాధతో నిండిపోతుంది. ఆయన కవిత, జీవితం వేరు కాదు అని తెలుసుకున్నపుడు దోపిడీ సమాజంలో, కళ కూడా ఒక దోపిడీ సాధనం అయిన సమాజంలో ఇలాంటి కవులు బతకడం కష్టమే అనిపిస్తుంది. అందుకేనేమో
"తొంభై తొమ్మిది మంది
చర్మాన్ని వొలిచి
నూరో వాడొక్కడే
పరుచుకునే తివాసీ
ఈదేశంలో
కళా పోషణ" అంటాడు.
కలమూ, కుంచే, జీవితమూ, కవిత్వమూ అన్నీ ఒకటే అయి అలిశెట్టి ప్రభాకర్ స్వేదంలా, అశ్రువుల్లా, రక్తంలా మనముందు ప్రవహిస్తాయి. మొత్తంగా మునకలు వేస్తేకాని తెలియదు ఆ లోతులు.

11/3/15
విరించి ll కవితా అద్దం ll
..............................
ఓ కవీ..
జీవితంలోని అనేక రంగులు
శబ్దాల్లా మ్రోగుతున్నపుడు
పదాల్ని ఇటుకలుగా పేర్చి
నీవొక గుడిని కట్టుకోవాలి

జీవితపు సంతకాలు
ఖాళీ కాగితాల్ని వ్యర్థంగా నింపుతున్నపుడు
గంభీర గ్రంధాల తలుపుల్ని
నీలోనే వెతుక్కోవాలి

సముద్రంలో కలిసిపోయే జీవనది
చివరి మలుపు దగ్గర తిరిగి చూసినపుడు
నదికార్చే చివరి కన్నీరు
నీలో ఇంకో నదిని పుట్టించాలి

గుండెలనుండి ఒలికి పోయే సిరా
పదాలుగా పరుచుకున్నపుడు
కాగితం మీద వ్యక్తమయ్యే వ్యక్తిత్వం
నీ కవితా అద్దంలో అలంకరించుకోవాలి

నిన్ను వింటూ నీతో మాట్లాడే కవిత
ఒక జీవంగా నీలో ప్రవహించినపుడు
నీ వెనుక నీవే దాచుకోకుండా
నీతో నీవే గెలవడానికి రాసుకోవాలి.

17/4/15
విరించి ll కవిత కాయని వెన్నెల ll
........................................
ఈ సమయంలో ఇక్కడ
కిటికీలన్నీ కళ్ళు మూసుకునే వుంటాయి
విరగబూసి కాసిన వెన్నెల
కవిత్వం రాయలేని చెట్లూ చేమల మధ్యే
ఒంటరి దయ్యంలా తిరుగుతూంటుంది
కుక్కలు అనుకోకుండా మొరుగుతుంటాయి

క్షణ క్షణమూ రూపాలు మార్చుకునే
ప్రతీ తెల్లటి మేఘమూ
ఈ నల్లటి ఆకాశాన్ని చూసి
నాట్యం చేస్తూంటుందని అనుకోడానికి
అవకాశమే లేదు.
చీకటిలో మాత్రమే వెలిగే వెన్నెల
ఎలాంటి అభయాన్నిచ్చినా
నమ్మే పని లేదు

జీవితంలోని రంగులన్నీ
బలవంతంగా నిదుర రంగులోకి
మారాల్సి ఒచ్చినపుడు
అణచివేత ఒప్పుకోని రంగులన్నీ
స్వప్నాల్లోకే జారుతుంటాయి
పురాతన జ్ఞాపకాల దుప్పట్లని
ఒకసారి దులిపి మళ్ళీ మీద కప్పుకుంటాయి

ఈ చీకటిలో
ఇంత మహా నగరంలో
కాసింత వెలుగును పంచే ఈ కిటికీ పక్కన
పదాల్ని కాసే ఒక బెడ్ ల్యాంప్ కింద
జీవితం ఒక కవితలోకి ఒదిగి పోయే తొందరలో
లోతుల్ని వెతుకుతున్నపుడు
నేను నింపాదిగా ఈ పేజీ కింద
సంతకంలోకి ఒదిగి పోతుంటాను
దూరపు నక్షత్రాలు చిరుగాలి ఊదిన ప్రతిసారీ
కిటికీలోంచి ముంగురులతో పలుకరిస్తుంటాను

ఏ కవితనూ కాయని వెన్నెల
బెడ్ ల్యాంప్ పక్కన వెలవెల పోతున్నపుడు
నిర్జీవమైన నిశ్శబ్ద రాత్రినీ
నీరసించి నిదురోయే మనుషులనూ
చూస్తూ..రేపటి కోసం
నిముషాలు లెక్కపెట్టుకుంటాను.

16/4/15
విరించి ll అమాయకుడు ll
......................................
ఈ రోజు నుండి ఈ అమాయకుడు
ఈ సమాధిలోనే పడుకుని వుంటాడు
ఎప్పటి లాగే మౌనంగా..
కానీ ఇకపై ఎవ్వరికీ కనపడకుండా...

ఎన్నో దురదృష్ట రోజుల్లాగే
ఈ రోజు కూడా ఆకాశానికే వ్రేలాడింది
ఎన్నో అర్థంకాని రోజుల్లాగే 
ఈ రోజుకూడా అర్ధాంతరంగానే ముగిసింది.
కానీ మరో ముగింపు లేకుండా...

ఒకరినొకరు ద్వేషంచుకునే మనుషులంతా
బలం కోసమో ధైర్యంకోసమో
గుంపులుగానే పోతూంటారు.
ప్రేమించే మనుషుల కోసం ఎదురు చూసేవాడు
ఎపుడూ ఒంటరి అమాయకుడే కదా...

చిత్ర పటంలా బిగుసుకు పోయిన
ఈ భయంకర నిశ్శబ్ద సాయంత్రానికి
ఇతడి చివరి శ్వాసలే తుదిమెరుగులు దిద్దుతున్నపుడు
ఎండి పోయిన ఆకుల మీద
ఇంకో ఎండుటాకు పడుతున్నపుడు
అక్కడక్కడా కొన్ని పదాలు చలిస్తుంటాయి
శ్రమించే చేతుల మధ్య పగిలి పోయే రాళ్ళ లాగా
ముక్కలుగా ఎగిరి మీదకి దూకుతుంటాయి

ఈ రాతిరి చీకట్లు వెలుగుగా మారకముందు
ఎండిన పెదవులతో మనం గొణుక్కునే
ఈ అమాయకుడి చరమ గీతాలు
ఏ వెలుగుకి ఆలంబనౌతాయో చూడాల్సిందే..
అలవోకగా జారిపోయే ఈ కన్నీటి బొట్లు
ఏ హృదయాన్ని కరిగిస్తాయో చూడాల్సిందే

15/4/15
విరించి ll మనలోకి మనం ll
...................................
ఎన్నో మౌనాలు మన లోతుల్ని
సుతారంగా తాకాలని ప్రయత్నిస్తుంటాయి.
జీవితంలోని మాధుర్యాన్ని దోసిళ్ళ తో అందించాలని చూస్తుంటాయి
శరీరంలో ఆత్మని ప్రవేశ పెట్టే ప్రతి అవకాశాన్ని
మనం తెలియకుండానే వదిలేసుకుంటాము
కొమ్మ మీదినుంచి జారి నేలమీద పడిపోయిన గులాబీ పువ్వుని
మనం కనీసం గమనించకుండా పక్కనుంచే పోతున్నపుడు
దాని మౌన గీతాల్లో ఎంతటి బాధని నింపుకుని వుంటుందో
మనం ఊహించనే లేము కదూ...

చల్లగాలికి హాయిగా ఊగే పొడుగాటి ఎండుగడ్డి మీదుగా
చేతుల్ని తగిలిస్తూ నును మెత్తగా తాకాలని అనిపిస్తుంటుంది
కానీ అక్కడ ఉండే బురదనో , ముల్ల కంపనో చూసి
మన ప్రయత్నాన్ని ముభావంగానే వాయిదా వేసుకుంటాం

రాత్రిపూట వెలుగు జిలుగులతో నిండిపోయే మన గదిలో
అకస్మాత్తుగా కరెంటు పోయినపుడు
ఒక్కసారిగా చుట్టుముట్టిన చీకటిలో
ఎంతో ఆనందం ఉంటుంది
చేస్తున్న పనినంతా పక్కకి విసిరేసి
ఆ చీకటిలో మనలో మనల్నే కొత్తగా కనుగొంటుంటాం కాసేపు
చీకటితో పాటు వచ్చిన నిశ్శబ్దంలో
ఒక ఈగో దోమో చేసే రొదకూడా ఆనందంగా అనిపిస్తుంటుంది
చీకటిలో ఏమీ కనిపించకున్నా, మన కన్నులు
విచ్చుకున్నట్లే అనిపిస్తుంటుంది.
శ్వాస చలనం మెల్లిగా జరుగుతున్నప్పుడు
మోకాళ్ళ లోకి తల పెట్టి
ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది
హఠాత్తుగా ఒచ్చే కరెంటు చీకట్లతో పాటు
మన ఆత్మాశ్రయ ఆనందాన్ని కూడా 
చటుక్కున మాయం చేసేస్తుంది.

ఒక్కోసారి కొన్ని ఉదయాల్లో నిద్ర లేవగానే
గోడమీది దేవుని పటము నవ్వుతూ కనిపిస్తుంటుంది
దూరంగా వినిపించీ వినిపించని సుప్రభాతంలో అజ కూడా కలిసిపోయి
తెలియని నమ్మకాన్ని గుండెలనిండా నింపుతున్నట్టు వుంటుంది.
ఆ సమయంలో వినిపించే పక్షుల కిలకిలారావాలూ కోయిలల కూతలూ
మౌనంగానే అనిపిస్తుంటాయి. వేరేగా కాక మౌనంలో ఇవికూడా భాగాలే అనిపిస్తాయి.
కిటికీలోంచి గదిలోకి పడే లేలేత ఎండలోకో
కిటికీలోంచి కనిపించే చెట్ల ఆకులమీద మెరిసే కిరణాల్లోకో
చూపును కన్నార్పకుండా కోల్పోతూ
ఒక కప్పు కాఫీని మనసులోకి నింపుకోవాలనిపిస్తుంది
ఆఫీసునుండి వచ్చే ఫోనో, విసిరేసిన పేపర్లో కనిపించే చావు వార్తో
దీపం ఆర్పేసినట్టు ఈ ఆనందాన్ని ఆర్పేస్తుంటుంది.

కొన్ని సాయంత్రాలు, రోడ్డమీద దొరికిన రూపాయి బిళ్ళ లా
అనుకోకుండా దొరుకుతుంటాయి
చీకటీ వెలుగూ కలిసిన ఒక మసక వెలుతురులో
మన చుట్టూవున్న ప్రతి వస్తువూ మనతో అవ్యక్త సంభాషణేదో చేస్తున్నట్టు 
భాషలేని భావ ప్రసారమేదో జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది
లీలగా బూజులాగా పడే వస్తువుల నీడలు
వెలుతురుని ఎక్కడో ఓ మూలకి సుతారంగా మోసే వస్తువులూ
ఆ క్షణంలో ప్రాణంతో బ్రతికే ఉన్నాయేమో అనిపిస్తుంది
చీకట్లు పెరిగే కొద్దీ నీడల్లోకి కలిసిపోయే వస్తువుల్లా
మనలో ఉన్న అల్లకల్లోలాలు కరిగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది
ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఆ చీకటిలో దొరుకుతున్నట్టుంటుంది.

ఒక్కోసారి కొన్ని ఆదివారాలు
గంటల కొద్దీ నిరీక్షించిన తరువాత కనిపించిన ప్రియురాలిలా అనిపిస్తుంటాయి
అపుడు ఇష్టమైన పుస్తకమో, పాటనో కొన్ని నిముషాల్ని నింపినా చాలనిపిస్తుంది
ప్రతీ రోజూ తప్పని డ్యూటీలాగా కాకుండా
ప్రపంచాన్ని మరచిపోయి ఇష్టంగా కొన్ని గంటలు 
కావాలనే నిద్ర పోవాలనిపిస్తుంది
నిదురనుంచి లేచి, మెరిసే కళ్ళతో ఉబ్బిన బుగ్గలతో
మనల్ని మనం స్వచ్ఛంగా అద్దంలో చూసుకోవాలని ఉంటుంది
మనుషులకి దూరంగా మనల్ని మనం దూరంగా విసిరేసుకుని
మౌనంగా పలకరించే కుక్కపిల్లతోనో
పెరటిలో మొలకెత్తిన కొత్తిమీర మొక్కలతోనో
కాసేపు గడిపేయాలని వుంటుంది
బంధువుల రూపంలోనో, స్నేహితుల రూపంలోనో
మనల్ని మనకి కాకుండా చేస్తూ ఎవరో ఒకరు మనల్ని ఆక్రమిస్తూనే వుంటారు

ప్రతీ రోజూ కాలాల్ని వెంబడిస్తూ మనం బస్సుల్లోనో కార్లలోనో పరిగెత్తుతున్నపుడు
రోడ్డు పక్కన కనిపించే ఒంటరి చెట్టుకిందనో
అల్లరి లేని అలలతో ఊగే చెరువు కట్టమీదనో
అన్నీ వదిలేసి అత్యవసరంగా కూర్చుండి పోవాలనిపిస్తుంది
అక్కడ అమాయకంగా ఆడుకునే చిన్న పిల్లలనో
నవ్వులతో విరబూసే ప్రేమికులనో చూస్తూ
ప్రపంచం అంతా ఇలా బాల్యంతోటో, ప్రేమతోటో
నిండిపోతే బాగుంటుందనిపిస్తుంది
చేయాల్సిన పనులన్నీ గుర్తుకువచ్చి వెళ్ళి పోదామనుకున్నపుడు
అక్కడి చెట్టు ఆప్యాయంగా ఒక ఆకును మన మీదికి రాలుస్తుంటుంది
దానిని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా గుండెలకి హత్తుకుని
కృతజ్ఞతగా అక్కడినుండి వెళుతున్నప్పుడు
తెలియని భారమేదో ఇంకా చెట్టు కిందే ఉండిపోతుంటుంది.

12/4/15
విరించి ll పది అక్షరాలు ll
...............................................
ప్రతి మత పుస్తకంలో
పవిత్ర దీపాల్లా వెలిగే అక్షరాలు
మెదళ్ళ లో పొగ చూరులా చుట్టుకుంటునపుడు

అర్థం అయినది ఒకటే
అర్థం కాని అయోమయమే.

అర్థం కానిది ఒకటే
చిరిగిన పుటల్లో ఉండగలిగే దేవుడు
మనుషుల్లో ఉండ లేడేమని

మనసే లేని మనిషికి
మారు మనసు అవసరమని ఒకడు

వసుధైక కుటుంబకం లో
ఘర్ వాపసీ కి పిలిచేదొకడు

సోదరుడిగా కలిసి వుండటానికై
పవిత్ర యుద్ధమని అరిచేదొకడు

చెత్తకుప్పల్లాగా పేరుకు పోయిన 
మత సాహిత్యంలో..అక్షరాలు
మాటలై
మాటలు తూ టాలై, 
తూ టాలు తుపాకులై, బాకులై
మానవ బాంబులై
'శవాల'నే గుట్టలుగా మారుతుంటే..

నా తలరాత కాకపోతే
ఈ మూలనుంచి ఇంకొకడంటాడు
నీవు కవివి కదా
అక్షరాలకి వేలాడుతుంటావు కదా
మౌనంగా ఉన్నావేమని...

పవిత్రమని చెప్పుకునే అక్షరాలే
ప్రేతాత్మల్లా ప్రాణాలు పీక్కుతింటుంటే
పట్టుమని ఒక్క రోజు కూడా బతకని
పనికి మాలిన ఈ నా పది అక్షరాలు
ఏం ఉద్ధరిస్తాయని...?

9/4/15