Wednesday, 1 April 2015

విరించి ll నీడలు ll
...................................
పశ్చిమం నుండి తూ ర్పుకు పాకే
ఈ నల్లటి నీడల్లో
అవ్యక్త నగిషీ లేమీ
దాక్కొని ఉండవు

నేల మీద నీడలుగా
నీటి మీద ప్రతిబింబాలుగా
ఊగిసలాడే జీవన దృశ్యాల్లో
ప్రస్ఫుటమైన మార్పు ఎపుడోకానీ వ్యక్తం కాదు

మెరిసే మేఘం కోసం
ఎదురు చూసే ఈ ఎండిన చెట్టు
ఒక పిడుగు తన నీడల్ని కాల్చేస్తానంటే
అరచేతి స్వర్గాల్నే స్వప్నిస్తుంటుంది

తన నీడే తనకు తెలియని
ఈ సూర్యకాంత పూవుకేం తెలుస్తుంది...?
పొడవుగా సాగిన నీడలు
పొట్టిగా కాళ్ళ కింద నలుగుతున్నప్పుడు
శరీరం, వొళ్ళంతా కళ్ళు చేసుకుని
కన్నీరు కారుస్తుందని..
ధృవాలకు లంబంగా
లోలకంలా ఊగే నీడలు
కాలాన్ని పొరపాటున వెనక్కే తిప్పేస్తుంటాయని..!

ఇపుడిక పోయేదేమీ లేదు
ముందుకో వెనుకకో ఒరిగిపోయే
నిశి రాతిరి పంపిన ఈ పొద్దుటి దూతలు
నిశి రాతిరి వైపుకే బండి కట్టాలి

24/3/15

No comments:

Post a Comment