Wednesday, 1 April 2015

విరించి ll కొంతదూరం ఎగిరే పక్షులు ll
.........................................................
రెక్కలు ముడుచుకుని ఈ కొంతదూరం ఎగిరే పక్షులు
ఇంతలోనే ఎన్ని దూరాలు కలుపుతుంటాయో..

ఆరో గంట గడియారం పక్షి స్నేహం కోసం
పదహారు రెక్కలమీద పరిగెత్తుకొస్తాయి

వేడికాఫీల్లో చలికాచుకునే నీరెండల కోసం
బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మాండాన్ని మోసుకొస్తాయి

ఈ కొన్ని గంటల శ్వాసలోనే
ఎన్నెన్ని రేపట్లని నిన్నటికి తోసేస్తాయో...

అయినా ఒకేరోజు కూసే పక్షులకి
శల్యమవటంతప్ప శవమవటం తెలియదు
అవి చరిత్రకు గవాక్షాలుగా
భవిష్యత్తుకు కిటికీలుగా
కాలపు అల్మరాల్లో రెక్కలార్చుకుంటుంటాయి.

అవి చెప్పే కథల్లో ఎన్ని సత్యాలు దాగుంటాయో..
ఎన్ని రకాల అద్దాలై సమాజం ముందర వాల్తుంటాయో..
చుట్టాకులా కాల్తున్న జీవితాల్నుంచి
పాదాల్లో మొలుస్తున్న స్వరాలదాకా..
జీవం పోసుకున్న నీడలనుండి
పచ్చని చేలోని పసిరిక పాములదాకా
ఎన్ని విషయాల్ని పొట్లంలో చుట్టేస్తాయో...

అదిగో తెలతెలవారుతోంది
ఏదో అనామిక స్వరం
పక్షుల పాటని పదేపదే ఇంటింటా వినిపిస్తోంది.
ఏదో అనామిక హస్తం
పక్షుల్ని ప్రతియింటా ఎగిరేస్తోంది
కళ్ళల్లోకి దూరుతూ  చెవుల్లోకి విసిరేసిందొక అలుపెరుగని గీతం
'డైలీ న్యూస్ పేపర్'...అని
గడియారం పక్షి అప్పుడే లేచింది
వేడి కాఫీ మేల్కొలుపు పొగల్ని చిమ్మింది.
16/1/15

No comments:

Post a Comment