Friday, 17 April 2015

విరించి ll ఎండిపోయిన కపాలం ll
.......................................
శత్రువుగా మారిన ఓ మానవుడా
నీ తుపాకీ గొట్టంలో
తూ టా కాలుతున్నపుడే నాకు తెలుసు
నీ ఆత్మ ఈ చావబోయే దేహం కింద
ఒక శవమై నలగబోతోందని

కోపంతో మండిపోయే నీ కన్నులు
దీనంగా అర్థించే నా లోతు కళ్ళ లోకి
సూటిగా చూడనే లేవని

మడుగులుగా పారిన నా రక్తం
మరకలుగా ఆరిపోయేంత కాలంలోనే
కనుమరుగయిన నా అస్థిత్వం
నీ అధికారమంతా కొంతసేపు మాత్రమనే
విషయాన్నే చెబుతుంటుంది

చివరి క్షణాల్ని ఫోటో ఫ్రేములా
బంధించుకున్న నా కళ్ళలోకి
నీవు తొంగి చూసినపుడు
నీ ప్రతిబింబం నీకు మాత్రమే
ఒక దయ్యంలా కనిపిస్తుంటుంది.

ఎముకలు తేలిన నా అస్థిపంజరంలోకి
ఒక ఈగ దూరి రొద పెట్టినపుడు
నా మీద నీవు పెంచుకున్న పగంతా
నిన్ను చూసి నీ చెవిపక్కనే నవ్వుతుంటుంది

నీదంటూ ఏదీ మిగలని ఈ ప్రపంచంలో
ఏదో ఒకనాడు నీవు మిగిలిందేంటని వెతుకుతున్నపుడు
ఇదిగో ఈ ఎండిపోయిన నా కపాలంలో
ఒక బుల్లెట్ మాత్రమే మిగిలుంటుంది.

అపుడు నా కపాలం నవ్వే నవ్వును చూసి
నీవు ఏడవకుండా ఉండగలవని నేననుకోను

8/4/15

No comments:

Post a Comment