Wednesday, 1 April 2015

విరించి   ll కొత్త నాటకం ll
.........       .........................
ఈ యామినిలోకి ఎగిరిన పక్షులు
పాతగోడల మీద ఉదాసీనంగా పడివున్న అలజడులను
కనిపించీ కనిపించని లోతు గాయాలను
థీసీస్ యాంటీ థీసీస్ తూనికరాళ్ళతో తూచి
సింథెసిస్ చేయలేని సినాప్సిస్ ని వల్లిస్తుంటే...
కథార్సిస్ తెలిసిన గడియారం మీది ముల్లు
తలా తోకలేని దిక్కుకి పదకొండు సార్లు కూసింది.

దుఃఖాతీత స్థితిని దురదృష్టమనుకునే అనామిక స్వరాలకు
ఊటలేని కన్నీటి బావుల ఊరడింపు ఊసులే గొంతు తడుపుతాయి.
నిప్పుల కొలిమిలో ఊపిరిని, ఎర్రని జీరల కంటి కాంతినీ
రంగూ రుచిలేని ఆకలిని , ఇరుకుదనం ఎరగని నిద్దురనీ
కొన్ని పనికి రాని మాటలే కౌగిలై కరుణిస్తాయి.
కళ్ళల్లో నీళ్ళ కి అపుడపుడూ నవ్వడం కూడా తెలుసునని
తూరుపు దిక్కుకి పదకొండుం పావై కాళ్ళు ఈడుస్తాయి.

జానెడు పొట్టలో పిడికెడు మెతుకుల బరువు
వేలెడు బతుకు లో చారెడు అతుకులకు సరిపోతే
ఊసిన ఉమ్మిమీద ఈగలు, పాలిన రక్తాన్ని పీల్చే దోమలూ
ఏర్గిన పీతి మీద జోగిన కుక్కలూ..ఇక పీక్కు తినడానికి మిగిలింది
బర్త్ ఆస్ఫిక్సియా తో చచ్చే లో-బర్త్ వెయిట్ ఆలోచనలు.
వాటిని సైతం కుదిపేస్తూ దక్షిణానికి నిర్దాక్షిణ్యంగా పరుగులు

దుమ్ముపట్టిన అద్దం లోకి ఎంత అందంగా ముస్తాబయినా
కన్నీటి ఆనకట్టల గాంభీర్యం గర్వభంగం ఐపోతుంటే..
ఇరుకు సందుల్లో ఇరుక్కున్న ప్రకృతిని, అగాధాల్లో చిక్కుకున్న స్వేచ్ఛనీ
పెన్నులో పొగాకులాగా పేర్చి సమజాన్ని కాలుస్తున్నపుడు
నా రాత బల్లసైతం నాలుగుకాళ్ళ కుక్కై మొరుగుతుంటే...
నీరసంగా నిద్రలేచిన నాలికలా పశ్చిమానికి పయనం...

కారాగారంలో ఒంటరిగా జ్ఞాపకాల సూసైడ్ నోట్ రెపరెపలాడుతోంది
అస్థిత్వ సందుల్లో ఉక్కపోత సంఘాతానికి 'అయోమయం' షర్టులు విప్పుకుంది
ఈ నాటకం ఇక ఆగాల్సిందే..
ఈ యవనిక ఇక కిందకి జారాల్సిందే...
దశిమి నాటి వెన్నెలైనా, దిక్కులేని మేఘమైనా ప్రేక్షకులై వేచిచూడాల్సిందే...
ఈ ఉత్తర దిక్కు అరుగు మీద ఇదిగో ఇంకో నాటకానికి ఇపుడే తెరలేస్తోంది
రెండు ముళ్ళు ఏకమయ్యాయి. ఇంకో ముడి పడిపోయింది.

happy new year
31/12/14- 1/1/15

No comments:

Post a Comment