Friday, 17 April 2015

విరించి ll కవిత కాయని వెన్నెల ll
........................................
ఈ సమయంలో ఇక్కడ
కిటికీలన్నీ కళ్ళు మూసుకునే వుంటాయి
విరగబూసి కాసిన వెన్నెల
కవిత్వం రాయలేని చెట్లూ చేమల మధ్యే
ఒంటరి దయ్యంలా తిరుగుతూంటుంది
కుక్కలు అనుకోకుండా మొరుగుతుంటాయి

క్షణ క్షణమూ రూపాలు మార్చుకునే
ప్రతీ తెల్లటి మేఘమూ
ఈ నల్లటి ఆకాశాన్ని చూసి
నాట్యం చేస్తూంటుందని అనుకోడానికి
అవకాశమే లేదు.
చీకటిలో మాత్రమే వెలిగే వెన్నెల
ఎలాంటి అభయాన్నిచ్చినా
నమ్మే పని లేదు

జీవితంలోని రంగులన్నీ
బలవంతంగా నిదుర రంగులోకి
మారాల్సి ఒచ్చినపుడు
అణచివేత ఒప్పుకోని రంగులన్నీ
స్వప్నాల్లోకే జారుతుంటాయి
పురాతన జ్ఞాపకాల దుప్పట్లని
ఒకసారి దులిపి మళ్ళీ మీద కప్పుకుంటాయి

ఈ చీకటిలో
ఇంత మహా నగరంలో
కాసింత వెలుగును పంచే ఈ కిటికీ పక్కన
పదాల్ని కాసే ఒక బెడ్ ల్యాంప్ కింద
జీవితం ఒక కవితలోకి ఒదిగి పోయే తొందరలో
లోతుల్ని వెతుకుతున్నపుడు
నేను నింపాదిగా ఈ పేజీ కింద
సంతకంలోకి ఒదిగి పోతుంటాను
దూరపు నక్షత్రాలు చిరుగాలి ఊదిన ప్రతిసారీ
కిటికీలోంచి ముంగురులతో పలుకరిస్తుంటాను

ఏ కవితనూ కాయని వెన్నెల
బెడ్ ల్యాంప్ పక్కన వెలవెల పోతున్నపుడు
నిర్జీవమైన నిశ్శబ్ద రాత్రినీ
నీరసించి నిదురోయే మనుషులనూ
చూస్తూ..రేపటి కోసం
నిముషాలు లెక్కపెట్టుకుంటాను.

16/4/15

No comments:

Post a Comment