Wednesday, 1 April 2015

విరించి ll ఆ క్షణంలో ll
....................................
అతీతమైనదేదీ నీకు ఇవ్వబడలేదు
అందరిలాగే
కిరణాలకీ నీడలకీ నడుమ
చితుకుల్లా ఎండిపోయే కొన్ని క్షణాలు
చీకటి కౌగిలిలో మిణుకుమంటున్న
లాంతరులా మసిబారిపోయే కొన్ని గుర్తులు

అంతరంగంలో జీవనార్తి ఒకటి
దావానలంలా అంటుకున్నపుడు
గంభీర నిశ్శబ్దాలు కాలికి తగిలిన తీగలా
అదృష్టవశాత్తూ   చిక్కినపుడు
నక్షత్రాల్లా జారిన క్షణాలు
వాన చినుకులై కురుస్తుంటాయి
కరెంటు పురుగుల్లా తిరిగే గుర్తులు
ఒక్కో కవితాత్మలై పైకి లేస్తాయి

అదిగో...ఆ క్షణంలోనే
నీ దగ్గరి చూపు అద్దాల్లోకి తొంగిచూస్తూ
అక్షరాలు వరుసగా అలంకరించుకుంటాయి
లోలోతులకు తొలిచిన గాయాలన్నిటినీ
రెక్కలు తొడిగిన పక్షుల్లాగా ఎగిరేస్తుంటాయి

వరద గుడి కట్టిన తడి మేఘంలా
మనసు ఆకాశానికి వేలాడినపుడు
ఉరమబోయే ఉదయంలోకి
నీవొక నవ్వే పూవై వికసిస్తావు
కాలం కణతల మీద
ఒక తుపాకీతో బెదిరిస్తుంటావు

4/3/15

No comments:

Post a Comment