Wednesday, 1 April 2015

విరించి ll అలారం ll
------------------------
ఇపుడు ఎవరో ఒకరు
కళ్ళు తెరవాల్సి ఉంటుంది

గుంపులుగా సాగిపోయే సమూహాల మధ్య
ప్రత్యేకంగా మెరిసిపోయే ముఖంలా
వెలగాల్సి ఉంటుంది

కుహానా ఔదార్యాల్ని
దొంగ దాతృత్వాల్నీ పాతిపెట్టి
చిత్తం దొరా అనేదానికే
పాడె కట్టాల్సి ఉంటుంది

గుడిలోని డప్పుల దాకా పారిన ఔదార్యం
మెట్ల మీది చెప్పుల దాకా పాకాల్సి ఉంటుంది

కాల్పనిక సత్యాల బంధాల నుండి
స్వేచ్ఛ, స్వేచ్ఛగా ఎగరాల్సి ఉంటుంది

పరిపూర్ణ మానవుడి అవతార ప్రకటన
అలారంలా మ్రోగినపుడు
ప్రేక్షకులుగా కాక పాత్రధారులుగానే
మనం మారాల్సి ఉంటుంది

పద మిత్రమా..
నీలాగో నాలాగో ఉండిపోవటమే
మానవత్వమని ఎవరికి వారమే అనుకునే మనం
మన ఇద్దరికీ అతీతంగా ఉండే
ఆ నవ్య మానవుణ్ణే
మనలో కనుక్కోవలసి వుంది.

11/3/15

No comments:

Post a Comment