Saturday, 25 April 2015

విరించి ll భయంకర స్వప్నం ll
.......................................
నడి రాతిరి నిద్దురలో
హఠాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేచినపుడు
సగంలో ఆగిపోయిన భయంకర స్వప్నం
శ్వాసలో కూడా క్రూరంగా వినిపిస్తుంటుంది
చీకటికి కూడా కొన్ని ఆకారాల్ని అంటించి
కంటి ముందు కాసేపు వేలాడుతుంటుంది

దయ్యాల్ని మనుషుల్లోనే కనుగొనే మనం
నిదురలో అందమైన కలల్ని ఎపుడో పోగొట్టుకున్నాం..
మనుషుల్లో నమ్మకాల్ని కోల్పోయిన మనం
స్వప్నాల్ని నమ్మే స్థితికే దిగజారుతుంటాం.

ఆనందాతిశయం లో పక్షులు కూసే కూతలూ
సాన రాళ్ళ మీద నూరుకునే మన మాటలూ
ఒకటే అనుకునే మనం
నిదురలో మనసు చేసే సహేతుక దాడిని
స్వప్నమనుకుని సర్ది చెప్పుకుంటాం.

తలా మొండెమూ భాగాల్ని 
ద్వేషంతో నింపుకున్న మనం
ఒట్టి కాళ్ళ తో నిదురలోకి జారుకున్నపుడు,
తల మొండెం కలిగిన మన రూపాన్ని
స్వప్నమనే అద్దంలో చూసుకునే సమయాన
మృత్యువును చూసినట్టే జడుసుకుంటాం.

భయంకర స్వప్నాల మధ్య ఊగిసలాడే
నడి రాతిరి నిదురను ప్రేమించే మనం
మనుషులందరూ కలిసి మెలిసి జీవించే
ఒక సుందర స్వప్నాన్నెందుకనో ప్రేమించనేలేము.

24/4/15

No comments:

Post a Comment