Wednesday, 1 April 2015

విరించిll  తూర్పూ పడమర ll
......................................
మనం ఇద్దరం
కాసేపు మాట్లాడుకోవడం ఆపేద్దాం
ఆ కొన్ని క్షణాల్ని నేను లెక్కపెడతాను

మన మాటలు కత్తులు దూసుకోవడం
నవ్వుల్ని పులుముకుని నటించేయడం
నక్కల్ని దాచుకుని చేతులు కలపడం
నీకూ నాకూ తప్ప మరెవ్వరికీ తెలీదనుకుంటాను

ఈ రాత్రికి రాత్రే మన మౌన వ్రతాల్ని
గుంభనంగా వేదికలెక్కిచ్చేద్దాం
కలల్లో జోగే ఈ జనాల మీదికి
పొద్దునకల్లా ఒక శుభంకార్డు విసిరేద్దాం

అడుగులు లెక్కపెట్టుకుంటూ
నింపాదిగా నడిచే ఈ మనుషులకి
మన తగువులాటలపై ఈలలు వేసే సమయముంటుంది కానీ
బొంగరంలా ఉన్న చోటే వేగంగా
తిరిగే ఇదే మనుషులకి
మన మౌనాలకు చప్పట్లు కొట్టే తీరికెక్కడుంటుంది చెప్పు?

అసందర్భంగా మనకు దొరికిన
ఈ మర్యాదకర నిశ్శబ్దాల్ని
చలికాలంలో చిక్కిన బకెట్టు వేడినీళ్ళ లా
కాసేపు స్నానం చేద్దాం

మన మధ్య శతృత్వం అదృశ్యమైదంటేనే
దాని ఉనికి ఉన్నట్టు మనుషులు గ్రహిస్తుంటారు
బోనులో ఇమడ లేని క్రూర జంతువుల్లా
మనం పెనుగులాడుతున్నపుడు
ఎవరో ఒకరు మన కట్లు విప్పేస్తుంటారు

ఒకరి కొకరం ముచ్చెమటలు పట్టించుకుంటూ
తెలిసినట్టుగానే తూర్పూ పడమరలైపోతుంటాం
అందుకే నువ్వూ నేననే మనం
కాసేపు మాట్లాడుకోవడం ఆపేద్దాం.
ఆ కొన్నిక్షణాల్ని నేను లెక్క పెడతాను.

12/3/15

No comments:

Post a Comment