Wednesday, 1 April 2015

విరించి ll కెవిన్ కార్టర్* సూసైడ్ నోట్ ll
..............    ............    ..       .......
క్లిక్... క్లిక్... క్లిక్...
మూడో కన్నులా తెరుచుకున్న కెమెరా ముందు
నేకెడ్ మోడల్ లా నిల్చున్న ప్రపంచం
సాక్షిగా తప్ప కథలో పాత్రలా ఇమిడిపోలేని నేను.
అక్కడక్కడా చిరుగులుపడ్డ పాత గుడ్డపేలికలా ప్రపంచం
ఎక్కడా ఊపిరి సలపని ఉత్సవ విగ్రహంలా నేను.

ఇపుడిపుడే తెలుస్తోంది...
నేను అనే ఈ స్వగతంలో
నాకు తెలిసినదాని కన్నా ఎక్కువే దాగుందని
పులిట్జర్ అవార్డుల ఫ్లాష్ ఫోటో కోసం
భావోద్వేగాల హత్య ముందెపుడో జరిగిపోయిందని

గుప్పెడు పొడి అక్షరాలైనా కొన్ని శాంతి కపోతాలుగా
ఎగరలేని దేశంలో..
ఆర్తనాదాలూ హాహాకారాలూ కామాంధుల్లా
వెంటబడి వేధించే దేశంలో...
అది నొప్పో లేక మరణమో తెలియక 'నెక్లేసింగ్'* మంటల్లో
తనువులు కాలిపోయే దేశంలో...
మనుషులు చస్తూ వుండగా ఒట్టిగా
చూస్తూ నిలబడటమే కర్తవ్యమనుకున్నా...
వెండిలా మెరిసే కెమెరా కళ్ళ లోపల
బంగారు బాతు గుడ్లలాంటివేవో పొదుగుకున్నా...

అందుకేనేమో..
మెడలు కోసేసే కత్తుల నడుమ
ఒడలు చీల్చేసే తుపాకుల నడుమ
రీళ్ళ ని కెమెరాల్లోకి తిప్పుకుంటూ పరిగెడుతున్నా..
ప్రపంచాన్ని చూడటానికి మంచి కళ్ళు కావాలో
మంచి ప్రపంచాన్ని చూడటం ఈ కళ్ళ కు చేతకాదో తెలియదు
కానీ ఈ భూభాగాలేవి ప్రపంచంలో ఉండదగినవి కావని తెలుస్తున్నా
వాటిల్లోనే నా పులిట్జర్ బహుమతుల్ని వెతుక్కుంటున్నా..

అదిగదిగో ఒక కదిలే దృశ్యం
దరిద్ర దేవత జడలు విప్పి తలారబోసుకున్నట్లు
ఖాళీ కడుపును ఈడ్చుకుంటూ నేలమీద పాకుతున్నదొక పసిప్రాణం..
ఆకలిగొన్న హింసా పిశాచి కోరలు విప్పినట్లు
క్వాషియోర్కర్* పొట్టల పేగులకోసం  ఒక గ్రద్ద లోకి ఆవాహనం
దూరాన ఎక్కడో మిణుకుమంటున్న ఆహార శిబిరం..
ఆహా.. ఇంతకు మించిన దృశ్యమెక్కడున్నది
క్లిక్...క్లిక్...క్లిక్...

ఆ పసి ప్రాణ మేమయిందో..
ఆ రాబందు ఏం బావుకుందో..
ఎవరి ఆకలి తీరిందో...
నా మూడో కంటికి అవసరంలేనిది
ఈ ప్రపంచానికి అవసరమయ్యింది
వాళ్ళేమంటున్నారో తెలియని భ్రాంతిలో
నేనేంచేశానోనని నాలో దిగ్భ్రాంతి
భయం పాతుకుపోయిన ఈ ప్రపంచంలో..
హింసా ప్రవృత్తి వృత్తైపోయిన ఈ ప్రపంచంలో..
పందుల్లాగా తిని బ్రతికే మనుషులకి
పది మెతుకుల కోసం కాచుకునే ప్రాణాలకి మధ్య
నేనొక అద్దం పగిలిన కిటికీని మాత్రమే
ఆక్షేపింప బడ్డది నా సాక్షీభూతత్వమే

ఓ ప్రపంచమా నన్ను క్షమించు..
జీవిత వ్రణం మీది నొప్పి
ఏ చిన్న ఆనందాన్నీ నాకోసం మిగల్చలేదు
వెంటాడే ఈ జ్ఞాపకాలతో స్నానం చేస్తూ
తొలుస్తున్న బాధలతో అన్నం తింటూ
కోపాల ప్రకోపాలతో కలిసి నడుస్తూ
క్రూర వికటాట్టహాసలతో కలలు కంటూ
పసి గుడ్డుల ఎముకల గూళ్ళతో
సగం చచ్చిన పీనుగులతో
ఇంతకుముందే నేనూ చచ్చిపోయాను
అదృష్టం అనేదేదో మిగిలేవుంటే..
నా ప్రియనేస్తం 'కెన్'* నే కలుసుకుంటాను
ఇక సెలవు..
3/2/15

Kevin Carter (13 September 1960 – 27 July 1994) was a South African photojournalist and member of the Bang-Bang Club. He was the recipient of a Pulitzer Prize for his photograph depicting the 1994 famine in Sudan. He committed suicide at the age of 33. His story is depicted in the 2010 feature film The Bang-Bang-Club

necklacing- Necklacing is the practice of summary execution and torture carried out by forcing a rubber tire, filled with petrol, around a victim's chest and arms, and setting it on fire. The victim may take up to 20 minutes to die, suffering severe burns in the process.

kwashiorkar- a severe malnutrition in kids

ken Oosterbroek - a close friend of Kevin Carter. Oosterbroek was shot and killed by peacekeepers in Thokoza township, about 25 km east of Johannesburg, on 18 April – days before the 1994 elections in South Africa, the country's first all-race elections. He and other photographers were covering a clash between peacekeepers and the African National Congress when the peacekeepers opened fire and shot Oosterbroek and fellow Bang-Bang Club member Greg Marinovich.

(This poem is dedicated to Kevin Carter)

No comments:

Post a Comment