Wednesday, 1 April 2015

విరించి ll చీకటి గుహ ll
..............................................
చీకటి గుహలో గుడ్డిగా తచ్చాడుతూ
బాహా బాహీగా తలపడుతున్నాం
వెలుగు రేఖ ఎపుడో ద్యోతకమైనపుడు
రెప్పలమీద కొంత భారమయిందని కళ్ళు మూసుకుంటామేమో..

వొంగిపోయే నిమిత్తమాత్ర చీపురు పుల్లలతో
రెండువృత్తాల్ని కురచగా గిరి గీసుకున్నాం
తెరలుగా గీతలు చెదిరి పోయినపుడు
చెరొక దిక్కుకి మరలిపోతామేమో...

కారణాతీత కాల్పనిక సత్యాల జిగటకు
కొలబద్దల్ని కనిపించకుండా అంటించుకున్నాం
సత్య పదార్థమేదో ఎదురు పడినపుడు
ఈ కవచ కుండలాల్నే ఎత్తుకుని పోతామేమో...

ఇరుకు దారుల్లోని సన్నటి దారంమీద
మెదళ్ళనూ గుండెల్నీ ఆరేసుకుని కూర్చున్నాం
పూర్ణకుంభంలోకి ఆవాహన జరిగేటపుడు
కాటి కాపర్లతో కబుర్లాడుతామేమో..

ఏమో ..
నీవూ నేనసలు మనసులో కలవనే లేదు
ప్రేమనేదేదీ పంచుకొనే లేదు
ఈ గుహ ఇటువైపేమీ లేదని తెలుసుకున్న మనకు
అటువైపేముందో ననే ఆశెందుకో కలగనే లేదు.

29/1/15

No comments:

Post a Comment