Wednesday, 1 April 2015

విరించి  ll ఏకాంతం ll

చుట్టూ చూసుకుంటే ఒక్కోసారి తెలుస్తుంటుంది
ఒంటరిగా రెండుకాళ్ళ మీదే నిలుచుని ఉన్నానని
ముందో వెనుకో పడే నీడలో
జీవిత వ్యాఖ్యానమంతా ఇమిడిపోతుందని

తీవ్రమైపోయిన ఆనందమో దుఃఖమో
అన్నిటినీ చుట్టేసుకునే ఓ అవ్యక్త మొత్తమో..
ఏదో ఒకటి అమాంతం బద్దలై
పక్షిలా ప్రాణంపోసుకుని ఎగిరిపోతే బాగుంటుందని

తలగడల్లోకి చెలమలుగా
ముడుచుకుపోయిన రాతిరి ముఖాలు
తెరలుగా విడిపడుతున్న చీకట్ల మూలల నుంచి
ఇంకాస్త దూరంగా జరిగి తడిచిపోతుండాలని

అనుభవాల దగ్గర్లలో
వికృతి పొందిన అకవిత్వ దృశ్యాలెన్నో
తీరాలెరుగని దూరాల్లో
కవిత్వాలై ఊరట పొందాలని

కలగాపులగం గా గీసిన ఈ కొన్ని గీతలు
ఒక జీవితమై శాసిస్తున్నపుడు
శృతిలయ లెరుగక మాట్లాడే భావాలు
ఒక ప్రాణమై ఊపిరిపోసుకోవాలని..

కానీ..
అలౌకికానందాన్నిచ్చే ఈ చిన్న పూవైనా...
ఒక రెక్కని చేజార్చుకుంటే....
తొర్రి పండ్లతో నవ్వుతూ  బతకాల్సిందే
పరిమళాల తో పరవశించాల్సిందే..

అందుకే ఇపుడనిపిస్తుంది
కఠినమైన శరీరంలాంటి జీవితంలో..
ఆత్మ అనేది ఓ వస్తువుకాదని..
అది ఏ నీడలూలేని ఓ చీకటి గది అని
దానిలో ఒంటరిగా కాసేపు నిలబడగలగటమే
ఏకాంతమనీ.. ఆనందమనీ..

2/2/15

No comments:

Post a Comment