Wednesday, 1 April 2015

విరించి ll నగర పయనం ll
............... ....................
గుడ్డి లాంతరు మోసే ముప్పావు చీకటి
ఫాస్పరస్ బల్బులకింద ఉనికి కోల్పేతే..
సోదరా ...జరిగేదేముంటుంది
రోడ్డు పక్కని బీదరికపు సిగ్గంతా
బరిబత్తల బలవంతంగా నిలబడుతుంది
అభివృద్ది అంతా ఇంతే కదా
బీదరికం వెకిలిగా వెలిగిపోతోంది..!!

అర్ధ రాత్రి తిమిరాన్ని తరిమిన
డిస్కో మిర్రర్ బాల్ వెలుగుల్లో
అదిగో చూశావా...
నేలనలుకుతూ  మిణుకు మంటున్న
మిట్ట మధ్యాహ్నపు నిశీధిని.
తెరిచి వుంచిన బతుకుల లోగిలిలో
కనిపించని నగ్నత్వ వెగటు కౌగిలిని.
శిలలా కరడుగట్టిన గోడల్లో
శిల్పాల్ని వెతుక్కునే శిలాజాన్ని.
ఈ గోతుల పునాది కిందే కదా
బీదరికం మౌనంగా నలిగిపోతోంది..!!

మోసే బండలకిందే బరువెక్కువగా వుంది
ఊరే ఉప్పుకంటే చెమటెక్కువుంది
గమనించావా...
నగరమమనే బహిరంగ బలిపీఠంమీద
శ్మశాన వైరాగ్యం ఒక ఆయువు పట్టు
ఇదే కదా..వేల పల్లెలకి ఏకైక సమాధి
ఇచటికే కదా బీదరికం ప్రతిరోజూ పయనమయ్యేది..!!

సోదరా..మనమూ పోదాం పద..
మన ఊరి బొందలగట్టు మీది
వేపచెట్టు పిలిచేదాకా...
మన ఊరు కేవలం సమాధులకే
పనికొచ్చేదాకా...

25/12/14

No comments:

Post a Comment