Wednesday, 1 April 2015

విరించి   ll  అంతే కదా..?  ll
............................................

చూపుల్తో చుట్టేయగల చిన్న చూపెందుకు

కళాయి అరిగి పోయిన అద్దంనుండి
కళాత్మక అందాలేవీ పురుడు పోసుకోలేవు

లోవెలుగుల లోతు తెలియాలంటే
ఈ రెండు కళ్ళ దివిటీలు ఏ మాత్రం సరిపోవు

సముద్రాలకి ఎడారులకి మధ్యగల ఇసుక గడియారంలో
గగ్గోలు పెట్టే గుండె ఆయుష్షు బావుకోగలిగినది
మహా అయితే మరో రెండు జిల్లేడాకులు

సెలవి నుండి కారే చొంగ తప్ప ఈ కేకలు
పూయించిన పూవులెన్నో చెప్పు...?

అవ్యక్త సత్యాలన్నీ మౌనంగానే ప్రతీకల్లో ప్రవచిస్తున్నపుడు
కర్ణభేరి విన్నదంతా కరడుగట్టిన శిల్పంలా పోతపోసుకున్నప్పుడు
సత్యాత్మలు నిగూఢంగా చెవుల్లో సీసాన్నే నింపుకోవాలి

సృష్టి నివృత్తంతా కొన్ని కృష్ణ బిలాల్లో దాగుందేమో
అవి ఎక్కడో మన రెండు కను బొమ్మల మధ్యే ఉండిండాలి.

8/1/15

No comments:

Post a Comment