Wednesday, 1 April 2015

విరించి ll రెండో అధ్యాయానికి ముందు మాట ll
....................................................
నీ చేతిలోని పుస్తకంలో మొదటి అధ్యాయం
ఈ పేజీ మలుపులోనే అంతమవుతుంది
పరిచయ వాక్యాలూ
పుస్తక దృక్కోణమూ నీకు ఈ పాటికి
అర్థమయే వుండాలి

తరువాత ఒచ్చే అధ్యాయాల్లో
మనిద్దరికీ ఒక యుద్ధమే జరగొచ్చు
చెమటతో నేను కట్టిన ఈ పదాలు
నీకు ముచ్చెమటలు పట్టీయొచ్చు

నీ ప్రపంచాన్ని నేను కూల్చేస్తున్నపుడు
నీవీ పుస్తకాన్ని చింపి
నడి వీధిలో కాల్చేయొచ్చు

నీ ఊహల్లోని స్వర్గం
ఈ అక్షరాల కింద పడి
నలిగి చచ్చిపోవచ్చు

శకలాలుగా ఉండే సత్య పదార్థం
ముక్కలుగానే మెదడు ని చేరుతుంటుంది
మన మధ్య బేధాలుంటాయనే
ఏకాభిప్రాయానికే ఇక మనం రావాల్సిఉంటుంది

పుస్తకాల్లో విభేదించుకునే మనం
ఒకరికొకరం కలుసుకున్నపుడు
ఆత్మీయంగానే కౌగిలించుకోవాల్సి వుంటుంది

నీవు నన్ను ఎలా అర్థం చేసుకున్నా
నేను మాత్రం నిన్ను
నా ప్రియ పాఠకుడా అనే
సంబోధించాల్సి వుంటుంది.

30/3/15

No comments:

Post a Comment