Wednesday, 1 April 2015

విరించి ll ఈరోజే తెలిసింది ll
....................................................

రెండు మిడిగుడ్లు నా అమాయకత్వాన్ని సిగరెట్ లా కాలుస్తూ
పొగ కాలుష్యం లా ఆ ఊపిరి నన్ను చుట్టేస్తున్నపుడు

అతడి చేతి వేళ్ళ కు మొలచిన కెమెరాలు నా బాల్యం మీద
ఉబికిరాని యవ్వనాన్ని పొంగులుగా వెతుకుతున్నప్పుడు

నా చిన్నారి చేతుల్లో అర్థంకాని బ్రహ్మ పదార్థమేదో
పశుబలం తో బలవంతంగా అతడు దాచేస్తున్నపుడు

ఆ ఆకారం నా తలరాతను తల్లకిందులు చేసి
కొన్ని నిలువు గీతలమీద అడ్డంగా విధ్వంసాన్ని రచిస్తున్నపుడు

ఉమ్మాల్సిన ఎంగిలిని తడి ఆరని నా అంగాలకు
అంగలార్చి ఆబగా అంటిస్తున్నపుడు

ముందు వెనుకలు వావి వరుసలు లేని అగాధాల్లోకి
చెక్క బొమ్మగ చేసి అతడు నన్ను తోసేస్తున్నపుడు

చిట్టి పొట్టి దుస్తుల మడతల మధ్య
పెద్దరికపు తడులు చారలుగా ముడతలు విప్పుకుంటున్నపుడు

ఇంటికొచ్చిన పెంకులా...కిరాణా కొట్టు అంకులా
పావుసేరు మెంతులా..ప్రైవేట్ ట్యూషన్ పంతులా
ఎవరని అమ్మ అడిగితే...
చూపుడు వేలుని ఆకాశానికి మిగిలిన వేళ్ళని పది దిక్కులకీ
విసిరేసిన నా అయోమయపు ఉనికికి
గుంభనంగా మాడిపోయిన గాయాలే
మా అమ్మ లాలి పాటలయ్యాయి..

కానీ ఈరోజు ..
అభం శుభం తెలియని నా ముద్దల కన్నయ్య
బెంచిమీద ఒక మూలకి గూనిగా ఒదిగిపోతున్నపుడు
అటో కాలు ఇటో కాలేసి నడిస్తే దొడ్డికాళ్ళోడని గేలిచేసినపుడు
దిక్కులు చూస్తూ పిచ్చి గీతలు గీసి తిక్కలోడనిపించుకున్నపుడు
ప్రోగ్రెస్ కార్డ్ మీద ఎర్రింకు సున్నాలు వెక్కిరిస్తున్నపుడు...
కాపాడుకోలేని నా రెండు చేతుల్ని నిలువునా చీల్చేసుకోవాలని వుంది.

ఈ మొగతనపు బలహీనత నా ఆడదనం మీదేనని సర్ది చెప్పుకున్న నాకు
బాల్యపు బలహీన స్వరానికి లింగ బేధం లేదని ఈనాడే తెలిసింది.
తొలిపొద్దు సింధూరాలకు బలత్కార బంధువుల బాధలు
ఏకరువు పెడితే కరవు రాని ఏరులై పారుతాయని ఈరోజే తెలిసింది.

2/1/15

No comments:

Post a Comment