Wednesday, 1 April 2015

విరించి ll నీ కవిత ll
......................................
మురుగు కాలువ నుండి
సెలయేటి దాకా సాగిన నీ కవిత
ఇక పై జలపాతంలా దూకాల్సి ఉంటుంది

సుదూర భవిష్యత్తనే మిష నుంచి
సమీప గతమనే మిథ్య నుంచి
వేగంగానే విడివడి
ఈ శూన్య వర్తమానాల్నే నింపాల్సి ఉంటుంది

అవ్యక్తంగా దాగున్న పరాయి మనిషిని
నీ లోతుల్లోకి తోసేసి
నిన్ను  నీవే ఆక్రమించుకోవాల్సి ఉంటుంది.

నగ్నంగా అలంకరించుకునే భావాలకే కదా
ఈ భాష అద్దంలా నిలబడేది...
అందుకే నీ మనసుకు నీవే
వలువలు విప్పుకోవాల్సి ఉంటుంది.

మనిషిగా మిగిలిన ఒక ఆకారం కోసమే కదా
ఈ ప్రపంచం ఎదురు చూసేది....
అందుకే మనమందరం కలవటం కోసమే
కవితలు రాసుకోవాల్సి ఉంటుంది.

20/3/15

(మనమందరం కలవటం కోసమే...ఒకరికొకరం తెలుసుకోవటం కోసమే ఈ కవిసంగమం అని యాకూబ్ గారు అన్న మాటల స్పూర్తితో)
Best Wishes For World Poetry Day

No comments:

Post a Comment